ఒక్క హీరోయిన్ వైపు కూడా కన్నెత్తి చూడలేదు.. మా అమ్మ కూడా హీరోయినే.. ఆ నటికి థ్యాంక్స్: బాలీవుడ్ నటుడు సంచలన కామెంట్స్
బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా వివాహేతర సంబంధం గురించి తన భార్య సునీత అహుజా చేసిన వ్యాఖ్యలపై మౌనం వీడాడు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, ఇండస్ట్రీలో తన ప్రవర్తన, హీరోయిన్లతో తనకున్న గౌరవప్రదమైన సంబంధాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా (Govinda) తన దాంపత్య జీవితంలో గొడవలపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. ఇటీవల అతని భార్య సునీత అహుజా చేసిన కొన్ని కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. గోవిందాకు వివాహేతర సంబంధం ఉందనే కోణంలో వస్తున్న పుకార్లపై ఆయన ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూటిగా స్పందించాడు.
ఒక్క హీరోయిన్ వైపు కూడా కన్నెత్తి చూడలేదు.. మా అమ్మ కూడా హీరోయినే.. ఆ నటికి థ్యాంక్స్: బాలీవుడ్ నటుడు సంచలన కామెంట్స్ (HT_PRINT)
"ముసలితనంలో ప్రేమనా?"
గోవిందా తనదైన శైలిలో స్పందిస్తూ.. "నాపై ఆరోపణలు రావడం ఇదేం కొత్త కాదు. ఎప్పుడూ ఏదో ఒక నింద వేస్తూనే ఉంటారు. ఇప్పుడు వస్తున్న ఆరోపణలు చూస్తుంటే.. ఇది చిన్ననాటి ప్రేమ అని అంటున్నారు. కానీ కొందరి ఆలోచన ప్రకారం చూస్తే.. ఇది ముసలితనంలో పుట్టిన ప్రేమ అనుకోవాలి" అంటూ పరోక్షంగా సెటైర్ వేశాడు. ప్రేమ విషయంలో తనకు ఎప్పుడూ కలిసి రాలేదని అతడు అనడం విశేషం.
"మిస్ యూనివర్స్‌తో పనిచేశా.. కానీ ఎప్పుడూ అలా.."
తన క్యారెక్టర్ గురించి వివరిస్తూ గోవిందా ఎమోషనల్ అయ్యాడు. "నేను నలుగురు సూపర్ స్టార్లతో, మిస్ యూనివర్స్ వంటి అందగత్తెలతో పనిచేశాను. కానీ ఎప్పుడూ వారిని తప్పుగా చూడలేదు. నేను ఏ హీరోయిన్‌ను ఇబ్బంది పెట్టానని కానీ, అసభ్యంగా మాట్లాడానని కానీ నా కెరీర్లో ఒక్కరు కూడా చెప్పలేరు. మా అమ్మ కూడా ఒక హీరోయిన్. అందుకే స్త్రీలను ఎలా గౌరవించాలో నాకు తెలుసు. ఇన్నాళ్ల నా కెరీర్లో నాకు సహకరించిన హీరోయిన్లు, దర్శకులకు ధన్యవాదాలు" అని అన్నాడు.
'కోమల్' మౌనానికి థ్యాంక్స్..
ఈ వివాదంలో వినిపిస్తున్న 'కోమల్' అనే పేరుపై గోవిందా స్పందించాడు. "ఆమె (సునీత) కోమల్ పేరు ఎత్తుతోంది. కానీ నేను కోమల్‌కు ధన్యవాదాలు చెబుతున్నాను. ఎందుకంటే ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఈ రోజుల్లో యువత అయితే చిన్న విషయానికి కూడా సోషల్ మీడియాలో రచ్చ చేసేవారు. ఆమె మౌనమే ఈ రోజు నన్ను కాపాడింది" అని గోవిందా పేర్కొన్నాడు.
కొత్తవారికి క్షమాపణలు..
ఇలాంటి పుకార్ల వల్ల తనతో పని చేయడానికి కొత్త నటీనటులు భయపడతారేమో అని గోవిందా ఆవేదన వ్యక్తం చేశాడు. "నా ప్రొడక్షన్‌లో పని చేయడానికి ఎవరైనా వెనకడుగు వేస్తారేమో అని కొత్తవారందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను. నేను అందరితో కలిసి పనిచేయాలనుకుంటున్నాను" అని అన్నాడు.
చివరగా తన తల్లి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ.. "నలుగురు కుటుంబ సభ్యులే లోకం అనుకుంటే ఏదో ఒకరోజు మోసపోతావు. బయట ప్రపంచం నిన్ను ప్రేమిస్తోంది, వాళ్లేమీ పిచ్చోళ్లు కాదు కదా అని మా అమ్మ చెప్పేది" అని గోవిందా ముగించాడు. గోవిందా, సునీత 1987లో వివాహం చేసుకున్నారు. వీరికి టీనా, యశ్వర్ధన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.