Brahmamudi August 27 Episode: బ్రహ్మముడి.. తమ్ముడికి రాజు సాయం.. ఇందుని ఇరికించిన అపర్ణ.. రాజుతో ఇందు డీల్.. రేఖ అనుమానం
Brahmamudi Serial August 27th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 27 ఎపిసోడ్ లో తమ్ముడు వెంకీకి సాయం చేయడానికి రెడీ అవుతాడు రాజు. అటు వరలక్ష్మీ వ్రతం అంటూ ఇందుని పరోక్షంగా ఇరికిస్తుంది అపర్ణ. దీంతో ఇందు, రాజు ఇద్దరూ చిక్కుల్లో పడతారు.
Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లోనూ వరలక్ష్మీ వ్రతం గురించి సాగదీతే కనిపించింది. గత మూడు నాలుగు ఎపిసోడ్లుగా ఇదే చూపిస్తున్న మేకర్స్.. లేటెస్ట్ ఎపిసోడ్ లోనూ వ్రతం ఏర్పాట్ల దగ్గరే ఆగిపోయారు. ఈ వ్రతం ద్వారా ఇందుకి పెళ్లి కాలేదని నిరూపించాలని ఐశ్వర్య చూడటం ఇందులో చూడొచ్చు.

తమ్ముడికి సాయం చేయమని రాజుని అడిగిన చలపతి
చాలా రోజుల తర్వాత సొంతింటికి వెళ్లిన రాజు అమ్మ చేతి వంట తినే సీన్ తో బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ మొదలవుతుంది. నీ చేతి వంట చాలా మిస్ అవుతున్నానని రాజు తల్లి లక్ష్మితో అంటాడు. ఇంతలో చలపతి వస్తాడు. వెంకీ గురించి చెబుతాడు. వాడు మంచి కోర్స్ కోసం ఏదో ఇన్‌స్టిట్యూట్ లో చేరతాడట.. నీ సాయం కావాలని అని అడుగుతాడు. అదేముంది చేసేద్దాం అని రాజు అంటాడు. ఫీజు ఎంత కట్టాలని అడిగితే రూ.50 వేలని చలపతి చెబుతాడు.
దీంతో రాజు షాక్ తింటాడు. నీకు సాధ్యం కాకపోతే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటాను.. తర్వాత ఇచ్చేద్దామని చలపతి అంటాడు. అవసరం లేదు.. అలా అప్పులు చేసే ఈ పరిస్థితి వచ్చింది.. నేనే ఏదో రకంగా ఏర్పాటు చేస్తానులే అని రాజు అనడం చూసి చలపతి సంతోషిస్తాడు. నువ్వు చాలా మారిపోయావు అంటూ మురిసిపోతాడు.
వెంకీకి ధైర్యం చెప్పి వెళ్లిన రాజు
తమ్ముడికి కాస్త ధైర్యం చెప్పి వెళ్లు అని చలపతి అడగడంతో వెంకీ దగ్గరికి వెళ్తాడు రాజు. అతడు బాధగా ఉండటం చూసి రాజు ధైర్యం చెబుతాడు. జాబ్ కోసం ఇంతలా ఆలోచించాలా.. నీకున్న టాలెంట్ కు ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది అని రాజు అంటాడు. నువ్వు నీ కోర్సు మీదే దృష్టి పెట్టు.. డబ్బు విషయం నాకు వదిలెయ్ అని కూడా చెబుతాడు. వెంకీ సరే అంటాడు.
వెళ్లబోతూ నువ్వు నాకేదైనా చెప్పాలనుకుంటున్నావా అని వెంకీని మరోసారి రాజు అడుగుతాడు. ఏది ఉన్నా సరే నాకు చెప్పు.. ఈ అన్నయ్య ఉన్నాడు.. చిన్నప్పటి నుంచీ కలిసి పెరిగాం అని రాజు ఎమోషనల్ అవుతాడు. కానీ వెంకీ మాత్రం తన ప్రేమ గురించి చెప్పడు.
భ్రమరాంబకు క్లాస్ పీకిన శేషు
ఇటు ఇంట్లో భ్రమరాంబకు శేషు క్లాస్ పీకుతాడు. భర్త కోసం వ్రతం చేయని భార్య ఉండటం దండగ అనే విషయం ఆమెకు అర్థమయ్యేలా ఫోన్ లో ఏదో వినిపిస్తాడు. కానీ ఆమె పట్టించుకోదు. ఎప్పుడూ తినడమే తప్ప నా కోసం ఏ వ్రతం చేయవా అని శేషు అడుగుతాడు. అప్పుడే రేఖ, ఐశ్వర్య కూడా వస్తారు. వాళ్ల ముందూ అదే చెబుతాడు. నువ్వు కూడా బామ్మర్ది కోసం వ్రతం చేయవా అని రేఖను అడుగుతాడు శేషు.
వరలక్ష్మీ వ్రతం గురించి అపర్ణ ప్రస్తావన
అప్పుడే వరలక్ష్మీ వ్రతం గురించి అపర్ణ ప్రస్తావిస్తుంది. తాను రేపు ఇంట్లో వ్రతం చేస్తున్నానని, అందులో మీరు కూడా కూర్చోండని అంటుంది. దీంతో భ్రమరాంబ, రేఖ కూడా సరే అంటారు. దానికోసం ఏర్పాట్లన్నీ తాను చేశానని అపర్ణ చెబుతుంది.
ఇందుని ఇరికించిన ఐశ్వర్య.. సై అన్న ఇందు
అప్పుడే ఇందుని ఇరికించాలని ఐశ్వర్య చూస్తుంది. ఇంట్లో కొత్తగా పెళ్లయిన జంట కూడా వ్రతం చేయాలి కదా అంటూ ఇందు, రాజు గురించి చెబుతుంది. దీంతో రేఖ వెంటనే ఇందుని పిలుస్తుంది. అది విని అపర్ణ షాక్ తింటుంది. పెళ్లి కాకుండా వాళ్లు ఎలా వ్రతంలో కూర్చుంటారు అని అనుకుంటుంది. ఇందు వచ్చిన తర్వాత రేఖ, భ్రమరాంబ వ్రతం గురించి చెబుతారు.
కానీ ఇందు మాత్రం కంగారు పడుతుంది. అపర్ణ వచ్చి రేపుకు మీకు ఏదో మీటింగ్ ఉంది కదా.. వద్దులే అని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఐశ్వర్య మరింత ఇరికిస్తుంది. మీటింగ్ మరో రోజు పెట్టుకోవచ్చు.. ఇప్పుడు వ్రతంలో అయిన కూర్చో లేదంటే అసలు నిజం చెప్పెయ్ అని అనడంతో ఇందు సరే అంటుంది. రాజుతో కలిసి వ్రతం చేస్తానని స్పష్టం చేసి వెళ్లిపోతుంది.
ఆధారాలతో నిరూపిస్తానన్న ఐశ్వర్య
ఇందు, రాజుకు పెళ్లి కాలేదని నేను చెబితే నమ్మలేదు కదా.. ఆధారాలు చూపించినా వినలేదు.. రేపు మరోసారి నిరూపిస్తాను చూడండి అని ఐశ్వర్య అంటుంది. ఈ వ్రతం కూడా పూర్తి చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు చూడండి అని ఐశ్వర్య చెబుతుంది. చెప్పిందే ఎన్నిసార్లు చెబుతావని రేఖ చిరాకు పడినా కూడా.. ఈసారి మీరే చూస్తారు కదా అని ఐశ్వర్య అంటుంది.
వ్రతం వద్దని ఇందుని వారించిన అపర్ణ.. మనసుకు మంగళసూత్రం కట్టేసినట్లేనన్న ఇందు
లోనికి వెళ్లిన తర్వాత ఇందుని అపర్ణ తిడుతుంది. ఎందుకు వ్రతం చేస్తావని ఒప్పుకున్నావ్.. పెళ్లి కాకుండా వ్రతంలో ఎలా కూర్చొంటారు.. అమ్మవారితో ఆటలు వద్దు అని వారిస్తుంది. కానీ తాను కూర్చోకపోతే తమకు పెళ్లి కాలేదని రేఖ ఆంటీకి డౌట్ వస్తుందని ఇందు అంటుంది. అలా అని పెళ్లి కాకుండా వ్రతం చేయకూడదు అని అపర్ణ చెబుతుంది.
పెళ్లి కాని వాళ్లు చేయకూడదని రూల్ ఏముంది.. మంచి భర్త కోసం చేస్తారు కదా.. అయినా బావ ఎప్పుడైతే మనకోసం తన ఇంటిని వదిలి వచ్చాడో అప్పుడే అతని ప్రేమలో పడిపోయాను.. ప్రపంచం చూడటానికి తమకు పెళ్లి కాలేదు కానీ.. మనసుకు మాత్రం బావ ఎప్పుడో మంగళసూత్రం కట్టేశాడు.. ఏమీ కాదు మేము వ్రతంలో కూర్చొంటామని ఇందు అంటుంది. మరి రాజు ఒప్పుకుంటాడా అని అపర్ణ అడిగితే.. ఒప్పిస్తానని ఇందు హామీ ఇస్తుంది. అప్పుడే రాజు వస్తాడు.
రాజుకి వరలక్ష్మీ వ్రతం గురించి చెప్పిన ఇందు
నీ గురించే మాట్లాడుకుంటున్నామని, నువ్వు బాగా చూసుకోవడం లేదని మీ నాన్నకు ఫోన్ చేద్దామనుకుంటున్నామని ఇందు అంటుంది. అపర్ణ కూడా అదే చెబుతుంది. దీంతో అంత పని చేయకండి అని రాజు కంగారు పడతాడు. ఆయన ఇందు మాట నమ్ముతాడు.. నన్ను తిడతాడు అని రాజు అంటాడు.
అలాంటిదేమీ లేదులే, ఊరికే అన్నానని ఇందు అంటుంది. రాజుకు వ్రతం గురించి చెప్పి వస్తానని అతన్ని గదిలోకి తీసుకెళ్తుంది. నీ సాయం కావాలని ఒకరికొకరు అడుగుతారు. డబ్బు కోసం రాజు.. వ్రతం కోసం ఇందు అడగాలని అనుకుంటారు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


