బ్రహ్మముడి డిసెంబర్ 27 ఎపిసోడ్: దుగ్గిరాల కుటుంబానికి ముంచుకొస్తున్న ముప్పు.. ఆ కొత్త వ్యక్తి ఎవరు.. ఆందోళనలో కావ్య
బ్రహ్మముడి సీరియల్ శనివారం (డిసెంబర్ 27) ఎపిసోడ్ లో దుగ్గిరాల కుటుంబానికి ఓ పెను ముప్పు రాబోతోందని, రాహువు దూసుకొస్తోందని పంతులుగారు చెబుతారు. ఓ కొత్త పాత్ర ఎంట్రీ ఇవ్వనున్నట్లు చూపించారు.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 915వ ఎపిసోడ్ లో దుగ్గిరాల కుటుంబానికి ఓ కొత్త ముప్పు రాబోతున్నట్లు చూపించడం ఆసక్తి రేపుతోంది. కావ్యకు పీడకల రావడం, హారతి ఆరిపోవడం, అటు రాజ్ ను దొంగ బంగారంతో ఇరికించాలని రాహుల్ ప్లాన్ చేయడం, చివరికి ఓ కొత్త పాత్ర ఎంట్రీ మరింత ఆసక్తి రేపుతోంది.

ఇల్లు తగలబడుతున్నట్లు కావ్యకు కల
బ్రహ్మముడి సీరియల్ శనివారం (డిసెంబర్ 27) ఎపిసోడ్ కావ్యకు ఓ పీడకల రావడంతో మొదలవుతుంది. దుగ్గిరాల వారి ఇల్లు మంటల్లో తగలబడిపోతున్నట్లు కావ్య కలగంటుంది. దీంతో ఆమె ఉలిక్కి పడి లేస్తుంది. రాజ్ కూడా ఆందోళన పడతాడు. తనకు వచ్చిన కల గురించి చెప్పడంతో దానిని పీడకల అంటారని, లైట్ తీసుకోమని రాజ్ అంటాడు. ఏదో ఆలోచిస్తూ పడుకోవడం వల్ల మన మెదడు అలాంటివి క్రియేట్ చేస్తుందని అతడు చెప్పినా కావ్య మాత్రం ఆందోళన చెందుతూ ఉంటుంది.
దొంగ బంగారంతో రాహుల్ కొత్త ప్లాన్
ఇటు రాహుల్ ఓటమి భారంతో కుమిలిపోతుంటాడు. ఎలాగైనా రాజ్, కావ్యలను దెబ్బ కొట్టాలని అనుకుంటాడు. రుద్రాణి వచ్చి వాళ్లను బిజినెస్ లో ఎదుర్కోవడం కష్టం.. ఇంటి నుంచే నరుక్కురావాలని సూచిస్తుంది. దీంతో రాహుల్ దొంగ బంగారం అమ్మే సాండీకి ఫోన్ చేస్తాడు. అతని బంగారం మొత్తం తానే కొంటానని, అయితే ఒకసారి వెళ్లి రాజ్ ను కలవాలని చెబుతాడు. అతడు సరే అంటాడు. బంగారం తాను కొన్నా కూడా.. ఇందులో రాజ్, కావ్యలను ఇరికించి వాళ్లను శాశ్వతంగా దెబ్బ కొడతానని రాహుల్ అంటాడు.
ఆరిపోయిన హారతి.. ఇందిర, అపర్ణ ఆందోళన
ఇటు ఉదయాన్నే కావ్య తనకు వచ్చిన పీడకల గురించి దేవుడికి మొరపెట్టుకుంటుంది. ఎందుకిలా జరిగిందని, ఏదైనా కీడు జరుగుతుందా అని, అలా జరగకుండా చూడు స్వామీ అని వేడుకుంటుంది. తర్వాత హారతి ఇచ్చి అపర్ణ, ఇందిరా దేవిల దగ్గరికి తీసుకెళ్తుంది. రాజ్ హారతి తీసుకోబోతుండగా అది ఆరిపోతుంది.
దీంతో కావ్య ఆందోళన మరింత పెరుగుతుంది. రాత్రి కూడా ఇలాగే పీడకల అంటూ భయపెట్టిందని రాజ్ చెప్పడంతో అపర్ణ, ఇందిరా దేవి టెన్షన్ పడతారు. వెంటనే పంతులుగారి దగ్గరికి వెళ్లి ఏం చేయాలో అడగాలని రాజ్ కు చెప్పినా తనకు కుదరదని వెళ్లిపోతాడు. దీంతో వాళ్లే వెళ్తారు.
అప్పుని సివిల్స్‌కు ప్రిపేర్ కావాలన్న ధాన్యలక్ష్మి
మరోవైపు అప్పుపై ధాన్యలక్ష్మి ఎనలేని ప్రేమ చూపిస్తూ ఉంటుంది. తినడం, నడవడం, పడుకోవడం తప్ప తానేమీ చేయలేకపోతున్నానని కల్యాణ్, ప్రకాశంలతో అప్పు చెబుతుంది. అది విన్న ధాన్యం ఆమె దగ్గరికి వచ్చి నువ్వు సివిల్స్ కు ప్రిపేర్ కావాలని అంటుంది. ఎస్సైతోనే ఆగిపోవద్దని, ఐపీఎస్, ఐఏఎస్ కావాలని చెబుతుంది. అంతేకాదు బుక్స్ కూడా ఇచ్చి రెండు నెలలు బాగా చదవాలని అంటుంది. అవి ఫిజిక్స్, కెమెస్ట్రీ బుక్స్ కావడంతో కల్యాణ్ ఆమెను ఆటపట్టిస్తాడు. ధాన్యలక్ష్మి చూపిస్తున్న ప్రేమకు అప్పు ఎమోషనల్ అయిపోయి ఆమెను హత్తుకొని కంటతడి పెడుతుంది.
రాజ్‌కు దొంగ బంగారం ఆఫర్ చేసిన సాండీ
రాహుల్ చెప్పినట్లుగానే రాజ్ ను కలవడానికి వెళ్తాడు సాండీ. తన బిజినెస్ గురించి చెబుతాడు. బంగారం పెద్ద మొత్తంలో ఇల్లీగల్ గా వస్తుందని, దానిని స్వరాజ్ గ్రూపులాంటి వాళ్లు వాడుకుంటే ఇద్దరికీ చాలా లాభం అని రాజ్ తో సాండీ చెబుతాడు. అది వినగానే రాజ్ కు ఆవేశం వస్తుంది. స్వరాజ్ గ్రూప్ అంటే కంపెనీ కాదు జనాల నమ్మకం అంటూ అతన్ని తట్టి పంపిస్తాడు.
అటు పంతులుగారి దగ్గరికి వెళ్లిన అపర్ణ, ఇందిర, కావ్యలకు షాక్ తగులుతుంది. ఇవన్నీ కుటుంబానికి కీడు జరగబోతోందని సూచిస్తున్నాయని, రాహువు మీవైపు దూసుకొస్తోందని చెబుతాడు. దీంతో వాళ్లు ఆందోళన చెందుతారు. అదే సమయంలో ఓ కొత్త పాత్ర ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా చూపించారు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


