బ్రహ్మముడి అక్టోబర్ 20 ఎపిసోడ్: బిడ్డ పుడితే నువ్వు చస్తావ్.. కావ్యకు నిజం చెప్పేసిన రాజ్.. బెడిసికొట్టిన దీపావళి వేడుక
బ్రహ్మముడి సీరియల్ సోమవారం (అక్టోబర్ 20) ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కావ్య పుట్టింటికి వస్తుంది. అయితే దీపావళి వేడుకలు బెడిసికొట్టడంతో కావ్యకు రాజ్ అసలు నిజం చెప్పేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 856వ ఎపిసోడ్ లో కావ్యకు రాజ్ అసలు నిజం చెప్పేస్తాడు. అయితే దానికి దారి తీసిన పరిస్థితుల వెనుక రుద్రాణి హస్తం ఉంటుంది. దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కావ్య పుట్టింట్లో దీపావళి వేడుకలు జరుపుకోగా.. అక్కడ ఆ వేడక కాస్తా బెడిసి కొట్టి రాజ్ దిగి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది.

రాజ్ కోసం భోజనం తెచ్చిన కృష్ణమూర్తి
బ్రహ్మముడి సీరియల్ సోమవారం (అక్టోబర్ 20) ఎపిసోడ్ రాజ్ ఆకలితో విలవిలలాడే సీన్ తో మొదలవుతుంది. అయితే తండ్రి కృష్ణమూర్తితో రాజ్ కోసం కావ్య భోజనం పంపిస్తుంది. మామ వచ్చి అల్లుడికి అన్నం పెడతాడు. అందరూ పడుకున్న తర్వాత ఎవరూ చూడకుండా అన్నం తీసుకొచ్చానని, తినమని అనడంతో రాజ్ వెంటనే ప్లేట్ తీసుకొని గబాగబా తింటాడు. అది చూసి ఇటు కృష్ణమూర్తి, అటు లోపల ఉన్న కావ్య బాధపడతారు. ఇంతటి ప్రేమ పెట్టుకొని ఎందుకు నిజం చెప్పడం లేదని మరోసారి కృష్ణమూర్తి అడిగినా రాజ్ మాత్రం చెప్పడు.
రాజ్‌ను చూసి కరిగిపోయిన కావ్య
అయితే రాజ్ ఇంటి బయట అలా ఇబ్బందులు పడుతుండటం చూసి కావ్య చాలా బాధపడుతుంది. తల్లి కనకం పాలు తెచ్చి ఇచ్చినా తాగదు. భర్త కళ్ల ముందు అలా ఇబ్బందులు పడుతుంటే.. తాను మాత్రం ఎలా బాగుంటానని కావ్య అంటుంది. దీంతో కావ్య ఎక్కడ కరిగిపోతుందో అని కనకం టెన్షన్ పడుతుంది. అల్లుడిగారిని లోనికి తీసుకొస్తే చాలు కదా.. అని అడుగుతుంది. సరే నువ్వు పాలు తాగు నేను చూసుకుంటానని కావ్యకు కనకం హామీ ఇస్తుంది.
అపర్ణకు కనకం ఫోన్.. దీపావళికి ఇంటికి రమ్మని ఆహ్వానం
ఆ తర్వాత అపర్ణకు కనకం ఫోన్ చేస్తుంది. కావ్యను చూస్తుంటే కరిగిపోయి ఎక్కడ అబార్షన్ చేయించుకుంటుందో అని కనకం కంగారు పడుతుంది. మరి ఏదో ఒకటి చెయ్యు అని అపర్ణ అంటుంది. అందుకే రేపు దీపావళి కదా.. మీరు మా ఇంటికి రండి.. ఏం చేయాలో చెబుతాను అని అంటుంది. అపర్ణ సంతోషంగా సరే అని అంటుంది. తామూ వస్తామని కల్యాణ్, అప్పు అంటారు.
అటు పైనుంచి ఈ మాటలు విన్న రుద్రాణి, రాహుల్.. కొత్త ప్లాన్ వేయడంలో బిజీగా ఉంటారు. వాళ్లతోపాటూ మనమూవ వెళ్దాం రాహుల్ అని రుద్రాణి అంటుంది. అక్కడ కావ్యకు అబార్షన్ అయ్యేలా మనమే ప్లాన్ చేద్దాం.. ఇప్పటికే రెండుసార్లు రాజ్ ఆ ప్రయత్నం చేశాడు కాబట్టి.. ఈసారి కూడా నింద అతడిపైకే వెళ్తుందని అంటుంది. ఈ ప్లాన్ బాగుంది వెళ్దామని రాహుల్ అంటాడు.
రాజ్‌కు కావ్య సేవలు
అటు రాజ్ పడుకోవడానికి టెంట్ కింద ఇబ్బంది పడుతూ ఉంటాడు. కావ్య అతని దగ్గరికి వెళ్లి సేవలు చేస్తుంది. తల కింద దిండు వేసి, దుప్పటి కప్పుతుంది. ఏసీ గదుల్లో రాజులా పడుకోవాల్సిన మీరు ఇలా ఇబ్బందులు ఎందుకు పడుతున్నారు.. ఆ నిజమేంటో చెప్పేస్తే అయిపోతుంది కదా అని కావ్య అనుకుంటుంది.
సీన్‌లోకి స్వరాజ్ ఎంట్రీ.. రాజ్‌ను రెచ్చగొట్టిన ఇందిరా దేవి, కావ్య
అటు ఉదయాన్నే రాజ్ నిద్ర లేవకముందే దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కావ్య పుట్టింటికి వస్తుంది. వాళ్ల వెంట స్వరాజ్ కూడా వస్తాడు. అతన్ని చూసి నువ్వు కూడా వచ్చావా డార్లింగ్ అని కనకం అంటుంది. నేను లేకుండా మా మామయ్యను ఎవరు తీసుకెళ్తారు అని అతడు అంటాడు. దుప్పట్లో దూరి మామయ్యను నిద్ర లేపుతా అంటూ రాజ్ దగ్గరికి వెళ్తాడు.
దీంతో రాజ్ అమ్మో ఎలుక అంటూ నిద్ర లేస్తాడు. స్వరాజ్ తోపాటు ఫ్యామిలీ మొత్తం ఉండటం చూసి షాక్ తింటాడు. అదే అదునుగా ఇందిరా దేవి, కావ్య అతన్ని రెచ్చగొడతారు. కావాలని రాజ్ తరఫున మాట్లాడినట్లుగా ఇందిర నటిస్తుంది. అటు దమ్ముంటే మీ మనవడిని ఇంట్లోకి వచ్చి స్నానం చేయమనండి అని కావ్య అంటుంది. ఇంట్లోకి రావడం ఏంటి.. మనతో కలిసి దీపావళి వేడుకల్లో కూడా పాల్గొంటాడని ఇందిర అంటుంది. అది విని రాజ్ కూడా రెచ్చిపోయి సరే అంటాడు.
కావ్యకు నిజం చెప్పేసిన రాజ్
అటు కావ్య పుట్టింట్లోనే అందరూ దీపావళి వేడుకలు జరుపుకుంటారు. అయితే టపాసులు పేలుస్తుండగా ఆ పొగకు ఊపిరాడక అప్పు కళ్లు తిరిగి పడిపోతుంది. ఆమెను చూసి డాక్టర్ల ఆ టపాసుల్లో ఉన్న విష వాయువల వల్లే ఇలా జరిగిందని అంటుంది.
ఆ టపాసులు తెచ్చింది నువ్వే కదా రాజ్ అంటూ రుద్రాణి అందరి ముందు నిలదీస్తుంది. దీంతో కావ్య ఆవేశంతో ఎందుకిలా చేస్తున్నావ్.. నా కడుపులో బిడ్డను ఎందుకు చంపాలనుకుంటున్నావ్ అంటూ కాలర్ పట్టుకొని అడుగుతుంది. బిడ్డ పుడితే నువ్వు చస్తావ్ కాబట్టి అంటూ రాజ్ అసలు నిజం చెప్పేస్తాడు. అక్కడితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


