సచివాలయంలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా .. సినిమాటోగ్రఫీ మంత్రిని చూస్తే జాలేస్తోంది : హరీశ్ రావు

తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే.. సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల్‌లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతోందన్నారు.

Published on: Jan 11, 2026, 15:51:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తుందని, మరోవైపు.. ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రేమో.. నాకు తెలియదు.. నా ప్రమేయం లేదు.. నా దగ్గరికి ఫైల్ రాలేదు అని నిస్సహాయంగా చేతులెత్తేస్తారని వ్యాఖ్యానించారు. శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది.. జీవో ఇచ్చేది ఇంకొకరు అని విమర్శించారు.

మాజీ మంత్రి హరీశ్ రావ్
మాజీ మంత్రి హరీశ్ రావ్

ఒక క్యాబినెట్ మంత్రికి తెలియకుండానే.. ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే.. అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు అని హరీశ్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అసలు మీరు నడుపుతున్నది సర్కారా.. లేక సర్కస్ కంపెనీనా అని ప్రశ్నించారు. టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా.. ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయమన్నారు.

ఒక వైపు అసెంబ్లీ సాక్షిగా సొంత డబ్బా.. మరొక వైపు క్షేత్రస్థాయిలో అడ్డగోలు నిర్ణయాలు. చెప్పేదొకటి, చేసేది మరొకటి..పేపర్లలో కలరింగ్ ఇచ్చేది ఇంకొకటి అని హరీశ్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఏమని ప్రగల్భాలు పలికారు? అని అడిగారు. తాను సీఎం సీట్లో ఉన్నంత కాలం సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండదని, బెనిఫిట్ షోలు ఉండవని, ఎవరికీ స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వం అని మైకు పట్టుకొని ఊదరగొట్టారని విమర్శించారు.

హరీశ్ రావు ఇంకా ఏం మాట్లాడారంటే..

'ఇప్పుడు రాత్రికి రాత్రే జీవోలు ఎట్లా వచ్చినయ్.. ఇప్పటికే మూడు సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెంచుతూ జీవోలు ఇచ్చారు. ఇవాళో రేపో.. మరో సినిమాకు కూడా జీవో ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అసెంబ్లీలో అబద్ధాలు ఆడటం మీకు వెన్నతో పెట్టిన విద్య అని మాకు తెలుసు.. కానీ సినిమా టికెట్ల విషయంలో కూడా ఇంత నిస్సిగ్గుగా సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా..

ఇక సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తోంది. ఒక పక్క హోం శాఖ జీవో ఇస్తుంది.. సినిమా మంత్రి ఏమో నాకు సంబంధం లేదు, నా దగ్గరికి ఎవరూ రాలేదు అంటారు. ఐటీ మంత్రిని నేనే సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇపుడు ఉన్న శాఖ తో తనకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారు?

టిక్కెట్ల రేటు పెంపు సీఎం నిర్ణయమేనని కొమటిరెడ్డి చెప్పకనే చెపుతున్నారు. అంటే, తెలంగాణలో సినిమా శాఖకు మంత్రి ఉన్నట్టా..లేనట్టా..? సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే జీవోలు విడుదల అవుతున్నాయంటే.. ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు? తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉంది? ఒక సినిమా రిలీజ్ సమయంలో దుర్ఘటన జరిగినప్పుడు నీతులు చెప్పారు.. ఇప్పుడేమో యథేచ్ఛగా రేట్లు పెంచుతున్నారు. మంత్రికి తెలియకుండా పాలన సాగడమేనా మీ ప్రజా పాలన అంటే..

అసలు సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా? లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా? ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు.. ఇంకో సినిమాకేమో రెండు రోజుల ముందే రాచమర్యాదలతో పర్మిషన్ ఇస్తారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష గడతారు. మీ పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారు.

ఇప్పుడు మీకు నచ్చినోళ్లు అయితే.. రూ. 600 టికెట్ రేటుకి పర్మిషన్ ఇస్తారా? వారానికి వారం రోజులు రేట్లు పెంచుకోవచ్చని రెడ్ కార్పెట్ వేస్తారా? రేవంత్ రెడ్డి గారు.. పాలకుడు అనేవాడు పాలసీతో ఉండాలి తప్ప, పగతో ఉండకూడదు.

గత పదేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఎక్కడా వివక్ష చూపలేదు. అందుకే ఇవాళ తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదిగింది. ప్రపంచం గర్వించేలా మన సినిమాలు తయారవుతున్నాయి.

50, 60 ఏళ్లుగా ఎంతోమంది కష్టపడి నిర్మించుకున్న ఈ పరిశ్రమ వాతావరణాన్ని.. మీ అహంకారంతో, మీ పిచ్చి చేష్టలతో, మీ పగ ప్రతీకారాలతో, మీ చిల్లర రాజకీయాలతో నాశనం చేస్తున్నారు. ప్రభుత్వమంటే అందరినీ సమానంగా చూడాలి. ఒకరికి చుట్టం .. మరొకరికి శత్రుత్వం ఉండకూడదు. సినిమా వాళ్లను కూడా మీ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు. ఇది ప్రజా పాలన కాదు.. ఇది మీ పాపిష్టి పాలనకు పరాకాష్ట.

మొన్న ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో? ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో? ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతాం. ఆ శాఖ మంత్రికి తెలియకుండా జరుగుతున్న ఈ సినిమా రేట్ల కమిషన్ల దందాపై గవర్నర్ దృష్టి సారించాలని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.' అని హరీశ్ రావు అన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More