Chinmayi Sripaada: అమ్మాయిలను రిటర్న్ పాలసీ లేని వస్తువులా చూస్తున్నారు.. అత్తారింట్లో చనిపోయినా ఓకేనా?: చిన్మయి
Chinmayi Sripaada: నోయిడాకు చెందిన ట్విషా శర్మ భోపాల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. రిటైర్డ్ జడ్జి కుటుంబంపై వరకట్న వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్న ఈ తరుణంలో.. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఘాటుగా స్పందించింది.
Chinmayi Sripaada: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన ట్విషా శర్మ (33) అనుమానాస్పద మృతి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. అత్తవారింటి వరకట్న వేధింపులే ఆమె మరణానికి కారణమని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) రంగంలోకి దించారు. ఈ విషాదంపై గాయని, సామాజిక కార్యకర్త చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' ద్వారా అత్యంత ఘాటుగా స్పందించారు.

‘ఆడపిల్ల అంటే రిటర్న్ పాలసీ లేని వస్తువా?’
ట్విషా శర్మ మృతిపై చిన్మయి చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. భారతీయ సమాజంలో పెళ్లి పేరిట అమ్మాయిలను చూసే కోణాన్ని ఆమె తీవ్ర పదజాలంతో నిలదీశారు.
"ట్విషా మరణం ఒక చేదు నిజాన్ని స్పష్టం చేస్తోంది. భారతదేశంలో చాలా మంది తల్లిదండ్రులు తమ కుమార్తెలను అత్తవారింటికి పంపించే ఒక 'వస్తువు'లా (commodity) భావిస్తున్నారు. దానికి ఎలాంటి 'రిటర్న్ పాలసీ' ఉండదని అనుకుంటున్నారు. కన్యాదానం ముగిసిన తర్వాత ఆ అమ్మాయి అత్తవారింట్లోనే ప్రాణాలు విడిచినా పర్వాలేదు.. అదే తమకు గౌరవం అని భావిస్తున్నారు.. అంతేనా?" అని చిన్మయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు ఏం జరిగింది?
నోయిడాకు చెందిన ట్విషా శర్మకు భోపాల్‌కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్‌తో 2025 డిసెంబర్‌లో వివాహం జరిగింది. అయితే పెళ్లయిన కేవలం ఐదు నెలలకే.. మే 12 రాత్రి భోపాల్‌లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న అత్తవారింట్లో ట్విషా శర్మ అనుమానాస్పద స్థితిలో మరణించారు.
దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు.. ట్విషా భర్త, అడ్వకేట్ సమర్థ్ సింగ్‌తో పాటు ఆమె అత్త గిరిబాల సింగ్‌పై వరకట్న మరణం, వేధింపుల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. నిందితురాలైన అత్త గిరిబాల సింగ్ గతంలో అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ కేసులో భర్త సమర్థ్ సింగ్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను భోపాల్ సెషన్స్ కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం అతను పరారీలో ఉండటంతో, అతని ఆచూకీ తెలిపిన వారికి మధ్యప్రదేశ్ పోలీసులు రూ. 10,000 నగదు బహుమతిని కూడా ప్రకటించారు.
రోడ్డుపై ఒంటరి పోరాటం చేస్తున్నాం
ఈ కేసు దర్యాప్తు పారదర్శకతపై ట్విషా శర్మ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మూడు పేజీల సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. భోపాల్ వీధుల్లో తాము ఒంటరిగా న్యాయపోరాటం చేస్తున్నామని వారు పేర్కొన్నారు.
స్థానిక యంత్రాంగం, రాజకీయ పక్షాలు లేదా ప్రముఖ మహిళా హక్కుల సంఘాల నుంచి తమకు ఎలాంటి ఆశించిన మద్దతు లభించడం లేదని వాళ్లు చెబుతున్నారు. కేసు తర్వాత బెయిల్ పొందిన రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్, స్థానిక న్యాయవ్యవస్థలో తనకున్న పాత పరిచయాలు, ప్రభావాన్ని ఉపయోగించి ఉన్నత న్యాయస్థానాల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు భోపాల్ కోర్టు ఆవరణలో గట్టిగా ప్రచారం జరుగుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


