Jr NTR: సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు.. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర తారక్‌ను చూడగానే అభిమానుల ఉత్సాహం
Jr NTR: సీనియర్ ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్ నివాళులర్పించారు. ఈ క్రమంలో అభిమానులు సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేయడం, తమిళనాడులో విజయ్ విజయం రేపిన పొలిటికల్ చర్చలపై ప్రత్యేక విశ్లేషణ.
Jr NTR: మహానటుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు 103వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి ఏటా తాతగారిని స్మరిస్తూ పత్రికల్లో ప్రకటన ఇవ్వడం, ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పించడం జూనియర్ ఎన్టీఆర్ కు ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా అదే రిపీట్ అయింది. ఉదయాన్నే తారక్ ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని తన తాతగారికి ఘనంగా అంజలి ఘటించారు.

సీఎం ఎన్టీఆర్ నినాదాలు
ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తారక్‌ను చూడగానే అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేసింది. అక్కడ ఒక్కసారిగా "సీఎం ఎన్టీఆర్.. సీఎం సీఎం" అంటూ చేసిన నినాదాలు మిన్నంటాయి. ప్రతి సంవత్సరం ఇలాంటి నినాదాలు రావడం సహజమే అయినప్పటికీ, ఈసారి మాత్రం ఆ సౌండ్ చాలా గట్టిగా వినిపించింది.
నిజానికి ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కనిపించినా సీఎం అనే నినాదాలు మార్మోగుతున్నాయి. బెంగళూరు వెళ్లినప్పుడు, ఆ తర్వాత డ్రాగన్ గ్లింప్స్ సమయంలో థియేటర్లోనూ ఎన్టీఆర్ సీఎం అనే నినాదాలు గట్టిగా వినిపించాయి. ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర అదే సీన్ రిపీటైంది.
దారి చూపిస్తున్న విజయ్
దీనికి ప్రధాన కారణం తమిళనాడు రాజకీయాల్లో నటుడు జోసెఫ్ విజయ్ సాధించిన విజయమేనని చెప్పాలి. విజయ్ సాధించిన సక్సెస్ ఇటు టాలీవుడ్ అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తించింది.
గతంలో తెలుగు రాజకీయాల్లో చిరంజీవి, పవన్ కల్యాణ్ లాంటి అగ్ర కథానాయకులు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించి ఆశించిన స్థాయిలో సఫలం కాలేకపోయారు. దీంతో సినిమా యాక్టర్లకు పాలిటిక్స్ సూట్ కావనే భావన అందరిలోనూ బలంగా నాటుకుపోయింది. అయితే తమిళనాడులో విజయ్ సాధించిన గెలుపు ఈ ఆలోచనా ధోరణిని పూర్తిగా మార్చేసింది. అందుకే తారక్ కూడా పాలిటిక్స్ లోకి రావాలని అభిమానులు అంత గట్టిగా కోరుకుంటున్నారు.
ఇక్కడ సాధ్యమేనా?
అయితే తమిళనాడులో విజయ్ విజయాన్ని తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు ముడిపెట్టడం సరి కాదని పలువురు విశ్లేషిస్తున్నారు. తమిళనాడులో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అక్కడ జయలలిత మరణం తర్వాత ఏఐఏడీఎంకేలో సరైన నాయకత్వం కరువైంది.
దానికి తోడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ పరిస్థితిని మరింత దిగజార్చింది. మరోవైపు అధికార డీఎంకే అగ్రనాయకత్వం అహంకారం వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. ఈ రాజకీయ శూన్యత వల్లే అక్కడ విజయ్‌కు ఒక మంచి అవకాశం దక్కింది.
ఏపీలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అసలు యాక్టివ్ పాలిటిక్స్ వైపుగా అసలు ఆలోచించడం లేదు. అలాంటి ఆకాంక్షలు కూడా తనకు ఉన్నట్లుగా లేదు. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలపైనే ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత దేవరతో బోల్తా పడినా వచ్చే ఏడాది ప్రశాంత్ నీల్ డ్రాగన్ తో తారక్ రాబోతున్నాడు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో జయంతి వేడుకలు జరిగాయి?
జవాబు: మే 28న నందమూరి తారకరామారావు 103వ జయంతి వేడుకలు జరిగాయి. దీనికోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పేపర్ యాడ్ ఇచ్చి తాతగారిని స్మరించుకున్నారు.
ప్రశ్న: ఎన్టీఆర్ ఘాట్ వద్ద అభిమానులు సీఎం ఎన్టీఆర్ అని ఎందుకు నినాదాలు చేశారు?
జవాబు: ప్రతి ఏటా ఈ నినాదాలు చేయడం కామనే అయినా, ఈసారి తమిళనాడులో నటుడు విజయ్ సాధించిన రాజకీయ విజయం చూసి ఉత్సాహం తెచ్చుకున్న అభిమానులు మరింత గట్టిగా సీఎం నినాదాలు చేశారు.
ప్రశ్న: ఎన్టీఆర్ త్వరలోనే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా?
జవాబు: ప్రస్తుతానికి అలాంటి అవకాశాలు లేవు. ఎన్టీఆర్ పాన్-ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


