Drishyam 3: దృశ్యం విషయంలో నేను ఆ తప్పు చేశాను.. ప్రేక్షకులు అలా చేస్తారనుకోలేదు: 13 ఏళ్ల తర్వాత జీతూ జోసెఫ్ సంచలనం

Drishyam 3: మాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా భారతీయ చలనచిత్ర రంగంలోనే క్లాసిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా నిలిచిన చిత్రం 'దృశ్యం' (Drishyam). అయితే ఈ సినిమా విడుదలై 13 ఏళ్లు పూర్తయి, మూడో పార్ట్ రిలీజ్ కానున్న వేళ దర్శకుడు జీతూ జోసెఫ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

Published on: May 20, 2026, 22:06:43 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Drishyam 3: మలయాళ చిత్ర పరిశ్రమలో థ్రిల్లర్ జోనర్ రూపురేఖలను మార్చేసి, సరికొత్త రికార్డులు సృష్టించిన మూవీ 'దృశ్యం'. మోహన్‌లాల్ 'జార్జ్‌కుట్టి'గా నటించిన ఈ చిత్ర క్లైమాక్స్ ప్రేక్షకులకు ఒక మైండ్ బ్లోయింగ్ అనుభూతిని ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీ నుంచి మోస్ట్ అవేటెడ్ 'దృశ్యం 3' (Drishyam 3) మే 21న విడుదలకు సిద్ధమవుతోంది.

Drishyam 3: దృశ్యం విషయంలో నేను ఆ తప్పు చేశాను.. ప్రేక్షకులు అలా చేస్తారనుకోలేదు: 13 ఏళ్ల తర్వాత జీతూ జోసెఫ్ సంచలనం
Drishyam 3: దృశ్యం విషయంలో నేను ఆ తప్పు చేశాను.. ప్రేక్షకులు అలా చేస్తారనుకోలేదు: 13 ఏళ్ల తర్వాత జీతూ జోసెఫ్ సంచలనం

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా 'ఆశీర్వాద్ సినిమాస్' నిర్వహించిన ఇంటర్వ్యూలో జీతూ జోసెఫ్ మాట్లాడుతూ.. మొదటి భాగం స్క్రిప్ట్ విషయంలో తాను అనుకున్నదానికి, ప్రేక్షకుల రియాక్షన్‌కు మధ్య జరిగిన ఒక పొరపాటును పంచుకున్నారు.

'దృశ్యం' కథ వెనుక ఉన్న నిజ జీవిత సంఘటన

ఈ సినిమా ఐడియా తనకు ఎలా వచ్చిందనేది జీతూ జోసెఫ్ వివరించారు. 2000 సంవత్సరంలో ఆయన సినీ పరిశ్రమలోకి రాకముందు రెండు కుటుంబాల మధ్య జరిగిన ఒక యదార్థ ఘర్షణ ఆధారంగా ఈ కథ పుట్టింది.

"ఒక అబ్బాయి, అమ్మాయికి సంబంధించిన సమస్య కారణంగా రెండు కుటుంబాల మధ్య తీవ్రమైన వివాదం నడిచింది. చివరికి అది పోలీస్ కేస్ వరకు వెళ్లింది. ఆ సమయంలో ఆ రెండు కుటుంబాల గురించి తెలిసిన ఒక వ్యక్తి నాతో.. 'ఇక్కడ రెండు వైపులా న్యాయం ఉంది, అలానే రెండు వైపులా తప్పులు ఉన్నాయి. ఇందులో మనం ఎవరి వైపు నిలబడాలో అర్థం కావడం లేదు' అని అన్నాడు. ఆ మాట నా మనసులో బలంగా నాటుకుపోయింది" అని జీతూ జోసెఫ్ చెప్పారు.

ఆ పాయింట్ చుట్టూనే ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు. ఇలాంటి నైతిక సంఘర్షణ ఉన్న కథను థియేటర్లలో చూపిస్తే ప్రేక్షకులు ఎవరికి మద్దతు ఇస్తారో చూడాలనుకున్నారు. అలా జార్జ్‌ కుట్టి పాత్ర రూపుదిద్దుకుంది.

నేను చేసిన 'తప్పు' అదే.. జీతూ జోసెఫ్ ఓపెన్ టాక్

కథ రాసుకున్నప్పుడు ప్రేక్షకుల ఆలోచనలు రెండు వైపులా ఊగిసలాడుతాయని (అటు ఐజీ కుటుంబం వైపు, ఇటు జార్జ్‌కుట్టి కుటుంబం వైపు) జీతూ భావించారు. కానీ సినిమా విడుదలయ్యాక ఆయన అంచనా తలకిందులైంది.

థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు ఎవరూ కూడా ఇరువైపులా ఆలోచించలేదు. వారంతా వంద శాతం జార్జ్‌కుట్టి, అతని కుటుంబం వైపే నిలబడ్డారు. "సినిమా చూశాక నేను ఒక తప్పు చేశానని గ్రహించాను. నేను అనుకున్న ఆ బ్యాలెన్సింగ్ థియేటర్లలో జరగలేదు. ప్రేక్షకులు పూర్తిగా ఐజీ గీతా ప్రభాకర్ పాత్రను తప్పుబడుతూ, జార్జ్‌కుట్టి ఫ్యామిలీని మాత్రమే సమర్థించారు" అని జీతూ జోసెఫ్ పేర్కొన్నారు.

ఐజీ గీతా ప్రభాకర్ పాత్రను సమర్థించిన దర్శకుడు

ఈ సందర్భంగా కొడుకును కోల్పోయిన తల్లి, ఐజీ గీతా ప్రభాకర్ (ఆశా శరత్) పాత్రను జీతూ జోసెఫ్ సమర్థించారు.

"ఒక తల్లిగా గీతా ప్రభాకర్‌ను మనం పూర్తిగా ఎలా తప్పుబట్టగలం? ఆమె కొడుకు కనిపించకుండా పోయాడు. అతడి ఆచూకీ కోసం ఆమె తపన పడుతోంది. జార్జ్‌కుట్టి తన తెలివితేటలతో పోలీసులను, వ్యవస్థను ఎలా తప్పుదోవ పట్టిస్తున్నాడో ఆమెకు తెలుసు. దానిని ఒక తల్లిగా, పోలీస్ ఆఫీసర్‌గా ఆమె ఎలా సహిస్తుంది? పైగా ఆమె కొడుకు చేసిన తప్పు (అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేయడం) ఆమెకు తెలియదు. ఎందుకంటే వాడు ఆ విషయాన్ని ఎప్పుడూ తల్లికి చెప్పలేదు. కాబట్టి ఆమె దృష్టిలో తన కొడుకు నిర్దోషి. నిజానికి 'దృశ్యం' సినిమాకు అసలైన స్పార్క్ ఆ తల్లి ఆవేదనే" అని జీతూ జోసెఫ్ చెప్పుకొచ్చారు.

ఏది ఏమైనప్పటికీ ఈ నైతిక పోరాటంలో జార్జ్‌కుట్టి విజయం సాధించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు 'దృశ్యం 3' లో జార్జ్‌కుట్టిని పోలీసులు ఎలా పట్టుకోబోతున్నారు? లేదా ఈసారైనా జార్జ్‌కుట్టి పోలీసులకు దొరికిపోతాడా? అనే ఉత్కంఠకు తెరపడనుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'దృశ్యం' సినిమా ఏ సంవత్సరంలో విడుదలైంది?

మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి భాగం 'దృశ్యం' 2013లో విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

2. ఈ సినిమా కథకు ప్రేరణ ఏమిటి?

2000 సంవత్సరంలో ఒక అబ్బాయి, అమ్మాయి విషయంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఒక వాస్తవ వివాదం/పోలీస్ కేస్ ఆధారంగా దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ కథను సిద్ధం చేశారు.

3. దృశ్యం మూవీ స్క్రిప్ట్‌లో తాను చేసిన తప్పుగా జీతూ జోసెఫ్ దేనిని భావిస్తున్నారు?

కథ ప్రకారం ప్రేక్షకులు ఇరు కుటుంబాల వైపు (నైతికంగా) ఆలోచిస్తారని ఆయన అనుకున్నారు. కానీ ప్రేక్షకులు ఐజీ పాత్రను పక్కనబెట్టి, కేవలం జార్జ్‌కుట్టి కుటుంబానికి మాత్రమే ఏకపక్షంగా మద్దతు ఇచ్చారు. ఈ బ్యాలెన్స్ కుదరకపోవడమే తాను చేసిన పొరపాటని ఆయన భావించారు.

4. 'దృశ్యం 3' ఎప్పుడు విడుదల కాబోతోంది?

ఈ సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో మూడవ భాగం 'దృశ్యం 3' మే 21న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More