గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణిని పూర్తిగా ఇరికించిన బాలు.. భార్యను నిలదీసిన మనోజ్.. ప్రభావతి శిక్ష
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 20 ఎపిసోడ్ లో రోహిణిని బాలు పూర్తిగా ఇరికించేస్తాడు. అది విని మనోజ్ కూడా తన భార్యను నిలదీస్తాడు. అటు ప్రభావతి అయితే తన ముద్దుల కొడుకు, కోడలిని తీవ్రంగా మందలిస్తుంది.
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ కూడా రోహిణి భండారం మరింత బయటపెట్టేలా సాగింది. ఆమె గతం తవ్వే పనిలో ఉన్న బాలు, మీనా ఇంట్లో ఆమెను పూర్తిగా ఇరికించేస్తారు. చివరికి మనోజ్, ప్రభావతి కూడా రోహిణిని అనుమానించేలా చేస్తారు.

మనోజ్, రోహిణిలను డబ్బు డిమాండ్ చేసిన ప్రభావతి
గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (మే 20) ఎపిసోడ్ మనోజ్, రోహిణిలను ప్రభావతి నిలదీసే సీన్ తో మొదలవుతుంది. డబ్బు ఏమైందని అడుగుతుంది. ఆ డబ్బు తీసుకొస్తేనే ఇంట్లో పరువు నిలుస్తుందని అంటుంది. డబ్బు ఎక్కడా దొరకడం లేదని మనోజ్, రోహిణి చెప్పినా వినదు. నీ ముఖానికి నీకు ఎవడురా అప్పు ఇచ్చేదని కొడుకుని తిడుతుంది. మీ మామ, రోహిణి వాళ్ల నాన్నను రూ.40 లక్షలు అడుగు.. కోట్ల ఆస్తిని ఆయన మీద పెట్టుకొని వెళ్తారా అని ప్రభావతి అంటుంది.
మరింత పరువు తీసిన బాలు, మీనా
అప్పుడే బాలు, మీనా, సత్యం కూడా సీన్ లోకి ఎంటరవుతారు. వీళ్లను విల్లా పేరుతో ముంచినోడి కోసం తిరుగుతున్నామని వాళ్లు చెబుతారు. ఎవరు తిరగమన్నారు అని మనోజ్, రోహిణి అనడంతో బాలు, మీనా రెచ్చిపోతారు. మరింత పరువు తీస్తారు. మా నాన్న బయట ఉంటే ఇలా విసిరేసేవాడు అని రోహిణి అనడంతో మీనా ఇక దండకం చదువుతుంది.
అంతకుముందు ఎన్ని లక్షలు విసిరేశాడు.. పార్లర్ కోసం ఎంత విసిరేశాడు.. అసలు నీకు పుట్టిల్లు ఉందా.. నా పుట్టిల్లు ఇది అని నేను గర్వంగా చెప్పుకుంటాను.. నీకు పెళ్లయినప్పటి నుంచీ ఎవరూ రాలేదు అని రోహిణిని అందరి ముందు మరింత ఇరికించేలా మాట్లాడుతుంది మీనా. సత్యం కూడా వాళ్లకు సపోర్ట్ చేస్తాడు.
తిండికీ నోచుకోని మనోజ్, రోహిణి
చివరికి ఇంట్లో తిండికీ మనోజ్, రోహిణి నోచుకోని పరిస్థితి వచ్చేస్తుంది. తనకు, మీనాకు, సత్యం, ప్రభావతిలకు బయటి నుంచే బాలు భోజనం తీసుకొస్తాడు. మరి మనోజ్, రోహిణి ఏం తింటారని ప్రభావతి అడిగితే.. వాడికో పెళ్లాం ఉంది కదా.. వంట చేసుకోమని బాలు అంటాడు. అటు రవి, శృతి కూడా తమ భోజనం తాము బయటి నుంచి తెచ్చుకుంటారు. దీంతో మనోజ్, రోహిణి ముష్టివాళ్లలా మారిపోతారు. అయినా ఎవరూ కనికరించరు.
దోసెలు వేయడమూ రాని రోహిణి
ఇక లాభం లేదని రోహిణియే కిచెన్ లోకి అడుగుపెడుతుంది. మనోజ్ కు దోసెలు వేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ అసలు వేయలేకపోతుంది. మీనా వచ్చి ఎలా వేయాలో ఓ దోసె వేసి చూపించినా రోహిణి వల్ల కాదు. దీంతో శృతి, మీనా నవ్వుతారు. అది చూసి తన దగ్గరికి రావద్దు.. తన పనేదో తాను చేసుకుంటానని అంటుంది. అటు బాలు, రవి కూడా వచ్చి రోహిణి దోసె కోసం పడే తంటాలు చూసి నవ్వుకుంటారు.
మనోజ్, ప్రభావతి కళ్లలో నీళ్లు తెప్పించిన రోహిణి దోసెలు
చివరికి ఏదోలా ముక్కలు ముక్కలుగా దోసెలు తీసుకొచ్చి మనోజ్, ప్రభావతిలకు పెడుతుంది రోహిణి. వాటిని చూసి ఇద్దరూ షాక్ తింటారు. సరే చట్నీ బాగుంటే ఏదోలా తినేయొచ్చులే అనుకొని రోహిని చేసిన చట్నీ తింటే కారంతో వాళ్ల కళ్లలో నీళ్లు వస్తాయి. చివరికి మీనా వెళ్లి కాస్త చక్కెర తీసుకు వస్తే వాళ్లు కాస్త శాంతిస్తారు.
రోహిణిని గుణ అప్పు గురించి అడిగిన మీనా
ఇదంతా అయిపోయిన తర్వాత కిచెన్ లో మీనా, శృతి ఉండగా రోహిణి వెళ్తుంది. అప్పుడే ఓ విషయం అడగాలంటూ గుణ దగ్గర అప్పు చేశావా అని రోహిణిని మీనా నిలదీస్తుంది. ఆ విషయం మీకెలా తెలుసు అంటే శివ చెప్పాడని, గతంలో వాడు అతని దగ్గరే పని చేసేవాడని, వాడో పెద్ద రౌడీ అని మీనా చెబుతుంది.
అత్తయ్య దగ్గర శివ దొంగతనం చేయడానికి కారణం వాడే అని, ఆ వీడియో కూడా వాడే బయటపెట్టాడని అనడంతో రోహిణి మరింత కంగారు పడుతుంది. ఆ వీడియో కూడా తాను ఇచ్చిందే అని తెలిస్తే ఏమవుతుందో అని టెన్షన్ పడుతుంది. గుణ గురించి వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది మీనా.
రోహిణి గురించి మనోజ్‌కు చెప్పిన బాలు, రవి
ఇటు బాలు, రవి కూడా రోహిణి గురించి మనోజ్ కు చెబుతారు. గుణ అనే రౌడీ దగ్గర ఆమె అప్పు చేస్తోందని అంటారు. కానీ మనోజ్ మాత్రం వినడు. తన భార్యను వెనకేసుకొస్తూ తమ్ముళ్లనే నిందిస్తాడు. నువ్వు సంతోషంగా ఉండాలనే, సమస్యల్లో ఇరుక్కోవద్దనే ఇదంతా చెబుతున్నామని రవి అంటాడు. అసలు ఈ విషయం మీకెలా తెలుసు అని అడిగితే.. శివ చెప్పాడని, వాడు గతంలో అక్కడ పని చేసే సమయంలో పార్లరమ్మ వెళ్లి అప్పు చేసేదట అని బాలు చెబుతాడు.
అయినా మనోజ్ వినకుండా వెళ్లిపోతాడు. అయితే అతనిలోనూ రోహిణిపై అనుమానం మొదలవుతుంది. గుణ విషయమే కాకుండా అసలు రోహిణి పుట్టింటిపైనా సందేహంతో అసలు మీ నాన్న దగ్గర కోట్లు ఉన్నాయా అని భార్యను నిలదీస్తాడు మనోజ్. దీంతో రోహిణి షాక్ తింటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


