Gunde Ninda Gudi Gantalu Today Episode: రోడ్డుపై బాలు, అరుణ్ మళ్లీ గొడవ.. తగ్గేదే లేదంటున్న తోడల్లుళ్లు.. నలిగిన మీనా
Gunde Ninda Gudi Gantalu Serial November 13th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 13 ఎపిసోడ్ లో బాలు, అరుణ్ మళ్లీ గొడవ పడతారు. సుమతి విషయంలో తోడల్లుళ్లు ఇద్దరూ వెనక్కి తగ్గేదే లేదన్నట్లుగా సై అంటే సై అంటారు.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ సుమతి పెళ్లి చుట్టూనే తిరిగింది. సుమతి, అరుణ్ పెళ్లి కోసం అరుణ్ తల్లి రావడం, పార్వతి అంగీకరించకపోవడం, అటు బావ దగ్గరికి సుమతి.. ఇటు మీనా దగ్గరికి అరుణ్ వచ్చి బతిమాలడం కూడా చూడొచ్చు. అయితే వెనక్కి తగ్గాల్సిన టైమ్ లోనూ బాలు, అరుణ్ తగ్గేదే లేదంటూ రోడ్డుపై గొడవకు దిగుతారు.

అబద్ధం చెప్పి పుట్టింటికి మీనా
మీనాకు సుమతి ఫోన్ చేసే సీన్ తో సీరియల్ శుక్రవారం (నవంబర్ 13) ఎపిసోడ్ మొదలైంది. అరుణ్ వాళ్ల అమ్మ వస్తున్నారు.. మాట్లాడటానికి రావాలని చెబుతుంది. అప్పుడే బాలు రావడంతో సరే వస్తాను లే అని చెప్పి పెట్టేస్తుంది.
బాలు అడిగితే ఏదో పూల ఆర్డర్ వచ్చిందట.. సుజాత అర్జెంటుగా రమ్మంటుంది అని చెప్పి పుట్టింటికి వెళ్తుంది. పార్వతికి నచ్చజెప్తుంది. నేను ఆయనకు సర్ది చెబుతాను.. ముందు ఆవిడ రాని.. ఏం మాట్లాడుతుందో చూద్దాం అని అంటుంది.
సుమతి ఇంటికి అరుణ్ తల్లి.. కోడలిగా పంపాలంటూ.. ఒప్పుకోని పార్వతి
అప్పుడే సుమతి ఇంటికి అరుణ్ తల్లి వస్తుంది. అరుణ్ కూడా వచ్చినా అతన్ని ఇంట్లోకి రానీయకుండా కారులోనే కూర్చోమంటుంది. సుమతి చాలా మంచి అమ్మాయి అని, ఆమెను తన ఇంటి కోడలిగా చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని చెబుతుంది. కానీ పార్వతి మాత్రం తగ్గదు.
మీ అబ్బాయి మా అల్లుడిగారిని చాలా ఇబ్బంది పెట్టారని విన్నాను.. మా ఇంటికి ఏ కష్టం వచ్చినా ఆయనే నిలబడతారు.. అలాంటి అల్లుడిగారిని కాదని ఈ సంబంధానికి నేను ఒప్పుకోలేను అని తెగేసి చెబుతుంది.
ఇందులో మీ అల్లుడి తప్పు కూడా ఉంది కదా.. ఆయన వల్ల మా అబ్బాయి రెండుసార్లు సస్పెండ్ అయ్యాడు.. వాళ్ల మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు.. అయినా మీ అల్లుడి కోసం సుమతి జీవితాన్ని నాశనం చేస్తారా అని అడిగినా పార్వతి వినదు. మీరు చెప్పాల్సింది చెప్పారు.. ఈ పెళ్లి జరగదు.. మీరు వెళ్లొచ్చు అని పార్వతి మరోసారి తెగేసి చెప్పడంతో చేసేది లేక ఆమె వెళ్లిపోతుంది.
ఆమెతో అలా మాట్లాడినందుకు తల్లిని మీనా తిడుతుంది. ఇంటికి వచ్చిన వాళ్లతో అలాగేనా మాట్లాడేది అని అంటుంది. మరేం చేయమంటావ్.. మనం ఏమనుకుంటున్నామో స్పష్టంగా చెప్పాలి కదా అని చెప్పి.. సుమతిని పిలుస్తుంది. అరుణ్ ను మరచిపోవాలని, మీ బావ తీసుకొచ్చిన సంబంధం చేసుకోవాలని స్పష్టంగా చెబుతుంది.
ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని అరుణ్‌కు చెప్పిన తల్లి..
కారులో తల్లి కోసం వేచి చూస్తున్న అరుణ్.. ఆమె రాగానే ఏం జరిగిందని అడుగుతాడు. ఎంత చెప్పినా వాళ్లు వినడం లేదు.. వాళ్ల అల్లుడి వైపే ఉన్నారు.. ఈ పెళ్లి జరిగేలా లేదు.. సుమతిని మరచిపో అని చెబుతుంది. కానీ అరుణ్ మాత్రం వినడు. బాలు అడ్డుపడితే ఆగిపోవడానికి ఇది నా ఉద్యోగం కాదు.. నా జీవితం.. నా జీవితంలో ఎవరు ఉండాలో తేల్చుకునే హక్కు నాకే ఉంది అని స్పష్టం చేస్తాడు.
ప్రభావతికి క్లాస్ పీకిన మీనా.. తినడం మమల్ని తిట్టడమే పనా అంటూ..
ఇటు ఇంట్లో మీనా కనిపించకపోవడంతో ప్రభావతి తనకు అలవాటైన రీతిలో దండకం వేస్తుంది. ఆమె రాగానే ఎక్కడికెళ్లావే.. నాకు తిండి పెట్టాలన్న ఆలోచన కూడా లేదా అంటూ తిడుతుంది. దీంతో మీనా చెలరేగిపోతుంది. మీరేం చేస్తున్నారు మరి.. చేసింది మామయ్యకు పెట్టే టైమ్ కూడా లేదా.. మీకు ఏం పని ఉంది.. తినడం.. తిరగడం.. అది అరిగేదాకా మా మీద అరవడం తప్ప మీకు వేరే పనేం ఉంది అని మీనా ఎడాపెడా తిడుతుంది. అప్పుడే శృతి కూడా వచ్చి అంత బద్ధకం ఏంటి.. ఇలాంటి లేడీని చూడలేదు అని మరింత తిట్టబోతే మీనా ఆపుతుంది.
సుమతి పెళ్లి గురించి సత్యంకు చెప్పిన శృతి
అసలేం జరిగింది అలా ఉన్నావ్ అని సత్యం అడుగుతాడు. దీంతో శృతి అసలు విషయం చెబుతుంది. మీనాకు చాలా సమస్యల ఉన్నాయి.. ఆ సుమతి బాలుతో గొడవపడే ట్రాఫిక్ కానిస్టేబుల్ ను ప్రేమించింది.. వాళ్ల పెళ్లికి బాలు ఒప్పుకోవడం లేదు.. ఇద్దరి మధ్యా మీనా నలిగిపోతోంది అని శృతి చెప్పడంతో సత్యం ఆశ్చర్యపోతాడు. బాలు చెప్పేదాంట్లో ఎంతోకొంత నిజం ఉంటుంది.. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోండి అని అంటాడు. తర్వాత మీనా పూల డెలివరీ కోసం వెళ్లిపోతుంది.
బావకు సుమతి రిక్వెస్ట్.. మాట వినని బాలు
మరోవైపు బావ బాలు దగ్గరికి సుమతి వెళ్తుంది. ఏమైనా సమస్యా.. డబ్బులు కావాలా అని బాలు అడుగుతాడు. అరుణ్ గురించి మాట్లాడటానికి వచ్చానని చెబుతుంది. అరుణ్ చాలా మంచి వాడని, తనపై ఈగ వాలకుండా చూసుకుంటాడని అంటుంది. కానీ వాడు అస్సలు మంచోడు కాదని, ఇప్పుడు ప్రేమ పేరుతో అలాగే ఉంటాడని, పెళ్లి తర్వాత నీపై కక్ష సాధిస్తాడని చెబుతాడు. అప్పుడే వేధిస్తుంటే ఏం చేస్తావని అడుగుతాడు. అరుణ్ పోలీస్ అయినా నన్ను పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కనివ్వడని, కోర్టు మెట్లు ఎక్కనిస్తాడా అని సుమతి అంటుంది.
అక్క ఇంటికి వచ్చిందని చెప్పడంతో..
అరుణ్ వాళ్ల అమ్మ ఇంటికి వచ్చి అమ్మ, అక్కతో మాట్లాడిందని కూడా సుమతి చెబుతుంది. అక్క వచ్చిందా అని బాలు అడగడంతో మీకు తెలియదా అని అంటుంది. తనకు పూల ఆర్డర్ అని అబద్ధం చెప్పి అక్కడికి వెళ్లిందా అని అరుణ్ మనసులో అనుకుంటాడు.
అరుణ్ నువ్వు అనుకునేంత చెడ్డవాడు కాదు అని చెప్పినా బాలు వినడు. వాడు నీకు కరెక్ట్ కాదు.. వాడిని చేసుకుంటే నీ జీవితం నాశనమవుతుంది.. మీ నాన్న స్థానంలో ఉండి నేను ఈ విషయం చెబుతున్నాను.. కాదు కూడదు అని నువ్వు వాడినే పెళ్లి చేసుకుంటే నేను అల్లుడి స్థానం నుంచి తప్పుకుంటాను అని బాలు తేల్చి చెప్పడంతో చేసేది లేక సుమతి వెళ్లిపోతుంది.
మీనాకు అరుణ్ రిక్వెస్ట్.. భర్తను డిఫెండ్ చేస్తూ..
మరోవైపు మీనా దగ్గరికి అరుణ్ వెళ్తాడు. బాలు గారు తప్పుగా అర్థం చేసుకొని తమ పెళ్లికి అడ్డుపడుతున్నారని, మరోసారి ఆలోచించాలని అంటాడు. ఆయనకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అని నోరు జారడంతో మీనా తన భర్తను డిఫెండ్ చేసుకుంటుంది. జరిగినదాంట్లో మీ తప్పు లేదా.. ఆయన లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని చూశారు.. కారు బ్రేకులు పని చేయడం లేదని తెలిసినా కేసు పెట్టారు. కారు సీజ్ చేశారు అని మీనా నిలదీస్తుంది.
బాలు వల్ల తాను కూడా ఇబ్బంది పడ్డానని, కానీ ఇప్పుడు సుమతితో పెళ్లికి దానితో సంబంధం ఏంటని అరుణ్ అంటాడు. సుమతిని పెళ్లి చేసుకుంటే మీరు తోడల్లుళ్లు అవుతారు.. ఇద్దరూ అసలు ఎలా కలిసి ఉంటారు అని మీనా అడుగుతుంది. ఈ విషయంలో మరోసారి ఆలోచించాలని రిక్వెస్ట్ చేయడానికే తాను వచ్చానని, ఇక మీ ఇష్టం అని అరుణ్ వెళ్లిపోతాడు.
నడిరోడ్డుపై అరుణ్, బాలు గొడవ
ఆ తర్వాత కారులో బాలు, మీనా వెళ్తుంటే.. అరుణ్ బైకుపై అడ్డొస్తాడు. ఇద్దరూ హారన్ కొడుతూ వెనక్కి తగ్గడానికి ఒప్పుకోరు. నడిరోడ్డుపైనే ఇద్దరూ గొడవకు దిగుతారు. ఇటు మీనా, అటు సుమతి వాళ్లను చూసి టెన్షన్ పడతారు. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవుతున్నా తోడల్లుళ్లు వెనక్కి తగ్గరు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


