Gunde Ninda Gudi Gantalu Today Episode: స్వాహా మాత ముందు దొరికిపోయిన రోహిణి.. శృతికి రవి పరీక్ష.. కలిసిపోయిన బాలు, మీనా

Gunde Ninda Gudi Gantalu Serial November 27th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 27 ఎపిసోడ్ లో బాలు, మీనా మళ్లీ ప్రేమగా కలిసిపోతారు. తమ గొడవను అడ్డు పెట్టుకొని నోరు లేని మనోజ్ ను నానా తిట్లు తిడతారు. మరోవైపు రెస్టారెంట్ పెడతానన్న శృతికి రవి పరీక్ష పెడతాడు.

Published on: Nov 27, 2026, 06:59:11 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో మీనాపై అలిగిన బాలు తర్వాత ఆమె చేత్తోనే తినిపించుకుంటూ మళ్లీ కలిసిపోతాడు. అటు రోహిణి బండారం మరోసారి బయటపడేలా కనిపిస్తుంది. ఇంటికి వచ్చిన స్వాహా మాతకు ఆమెకు అడ్డంగా దొరికిపోతుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 27 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 27 ఎపిసోడ్

మీనాపై అలిగిన బాలు

సత్యానికి ప్రభావతి వడ్డించే సీన్ తో సీరియల్ శుక్రవారం (నవంబర్ 27) ఎపిసోడ్ మొదలైంది. అప్పుడే మీనా, బాలు ఇంటికి వస్తారు. బాలు చాలా సీరియస్ గా కనిపిస్తాడు. సత్యం పలకరించినా మాట్లాడడు. తినమని చెప్పినా తనకు ఆకలిగా లేదని వెళ్లిపోతాడు. ఎక్కడికెళ్లారు అని సత్యం అడిగితే.. సుమతి గురించి మీనా చెబుతుంది. తాను వెళ్లి చూస్తానని సత్యం అంటే.. అవసరం లేదు ఇంటికి పంపించేశారని అంటుంది. మరి బాలు ఎందుకు అలా ఉన్నాడు.. ఏం జరిగిందని మీనాను ప్రభావతి అడుగుతుంది.

ఆయననే అడగండి అని అత్తకు తనదైన స్టైల్లో మీనా సమాధానం చెబుతుంది. బాలు గురించి ఆలోచిస్తూ ప్లేట్ లో అన్నం ఉండగానే నీళ్లు పోసేస్తుంది ప్రభావతి. వాడి గురించి మంచిగా ఆలోచించినా తనకే నష్టం అని విసుక్కుంటూ వెళ్లిపోతుంది.

మనోజ్‌తో ఆడుకున్న బాలు, మీనా.. బిర్యానీ తీసుకొచ్చి..

ఆ తర్వాత బాలు బిర్యానీ తెచ్చుకుంటాడు. అప్పటికే నోటికి సీల్ తో ఏమీ తినలేక తంటాలు పడుతున్న మనోజ్.. ఆ బిర్యానీ చూసి మరింత టెంప్ట్ అవుతాడు. బాలు తెచ్చిన బిర్యానీనే చూస్తూ ఉంటాడు. అప్పుడే మీనా వస్తుంది. మరోసారి ఇద్దరూ మాటా మాటా అనుకుంటారు. అయితే ఇదే అదునుగా భార్యాభర్తలిద్దరూ మనోజ్ తో ఆడుకుంటారు. నా చేతి వంట అవసరం లేదా.. అయితే రోజూ ఇలాగే బిర్యానీ తెచ్చుకొని తినండి.. ఇంతకుముందు బిర్యానీ తెస్తే నాకు కూడా ప్రేమతో పెట్టేవారు అని మీనా అంటుంది.

ఇప్పుడు కూడా తిను.. ఈ లెగ్ పీస్ నీకోసమే అని బాలు అంటే.. నేనేమీ మీ అన్నయ్యలాగా సిగ్గు వదిలేసి.. సారీ అన్నీ వదిలేసి తినలేను అని అంటుంది. మనోజ్ బిర్యానీని అలాగే చూస్తుంటే.. నువ్వు అలా చూడకు రా దిష్టి తగులుతుంది అని అతనితో అంటాడు బాలు. ఏది కనిపిస్తే అది మింగుతూ ఉంటే.. ఇలాగే మూతికి సీల్ పడుతుంది అని మీనా అంటుంది. వీళ్లు గొడవ పడుతున్నారా లేక నన్ను తిడుతున్నారా అని మనోజ్ అనుకుంటాడు.

మీరూ మా దారికి రావచ్చు కదా అని మీనా అంటుంది. అయినా వాడు మంచోడు కాదు.. వీడి కంటే దరిద్రుడు.. నికృష్టుడు అని చెబుతున్నా ఎందుకు వినడం లేదు.. అని మనోజ్ ను చూపిస్తూ బాలు అనడంతో మనోజ్ మరింత ఫీలవుతాడు.

మామకు మీనా ఫిర్యాదు.. పుల్లలు పెట్టిన ప్రభావతి

బాలు, మీనా గొడవను హాల్లో నిల్చొని చూస్తూ మురిసిపోతుంది ప్రభావతి. అప్పుడే సత్యం వచ్చి చూసి ఈ జన్మలో తల్లిగా జన్మించావ్.. వచ్చే జన్మలో బల్లిగా పుడతావ్.. అలా చాటుగా విని సంతోషించకూడదు అని క్లాస్ పీకి తీసుకెళ్తాడు. ఏం జరిగింది.. ఎందుకు గొడవ పడుతున్నారని అడిగితే.. నా వంట అవసరం లేదట.. బయట నుంచి బిర్యానీ తీసుకొచ్చుకున్నాడు అని మామకు మీనా ఫిర్యాదు చేస్తుంది.

ఈ మధ్య నీ పెళ్లాం నిన్ను పూచిక పుల్లలా తీసిపారేస్తోంది.. నువ్వు ఏం చెప్పినా వినడం లేదు అని ప్రభావతి పుల్లలు పెట్టబోతోంది. కానీ గొడవ పడకుండా సర్ది చెప్పాల్సింది పోయి ఇంకా పెద్దది చేస్తావేంటని ప్రభావతిని సత్యం తిడతాడు. అటు బాలు కూడా ఇదే అదునుగా మా ఇద్దరి మధ్య దూరం పెంచాలని చూస్తున్నావా.. ఇప్పటికే ఈ మనోజ్, పార్లరమ్మను దూరం చేశావ్.. మా దగ్గర ఆ పప్పులు ఉడకవ్.. మేము అనుకుంటాం.. మళ్లీ కలిసిపోతాం అని బిర్యానీ తినకుండానే బాలు లేచి వెళ్లిపోతాడు.

రెస్టారెంట్ కోసం శృతి బడ్జెట్ ప్లాన్.. క్లాస్ పీకిన రవి

అటు గదిలో శృతి చాలా సీరియస్ గా ఏదో రాస్తూ ఉంటుంది. అప్పుడే రవి వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతాడు. నువ్వే కదా రెస్టారెంట్ కోసం బడ్జెట్ కావాలి.. పక్కా ప్లాన్ ఉండాలని అన్నావ్.. అందుకే రాస్తున్నాను అని తాను రాసింది చూపిస్తుంది. అందులో ఫర్నీచర్ కు 50 లక్షలు, పార్కింగ్ కు 15 లక్షలు, సిట్టింగ్ ఏరియాకు 10 లక్షలు అంటూ ఏవేవో లెక్కలు ఉంటాయి.

వీటికే ఇంత ఖర్చు చేస్తే రెస్టారెంట్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చే ఖర్చులు, జీతాలు ఎలా అని రవి అడుగుతాడు. అప్పుడు కస్టమర్లు బాగా వచ్చి తిని డబ్బు ఇచ్చి వెళ్తారు.. అందులో నుంచి ఇస్తానని అంటుంది. అసలు నీకు వంట గురించి ఏం తెలుసని రెస్టారెంట్ పెడతానంటున్నావ్.. నువ్వు ముందు పదా అంటూ ఆమెను లాక్కెళ్తాడు.

కలిసిపోయిన బాలు, మీనా.. ప్రేమగా వడ్డించి..

ఇటు కింద కిచెన్ లో మీనా వంట చేస్తుంటుంది. బాలు ఆకలితో ఆమె దగ్గరకు వస్తాడు. ఆమెను మెల్లగా బుజ్జగించడానికి వెళ్తుంటే.. బయటి నుంచి తెచ్చుకున్నారు కదా వెళ్లండి అని బెట్టు చేస్తుంది. మీనాను బతిమాలి దారికి తెచ్చుకుంటాడు. దీంతో ఆమె బాలుకి వడ్డించడమే కాదు.. కలిపి, ముద్దలు తినిపిస్తుంది. ఇద్దరూ మళ్లీ ప్రేమగా కలిసిపోతారు.

డబ్బుడమ్మకు రవి పరీక్ష

అప్పుడే శృతిని తీసుకొని రవి వస్తాడు. ఏం జరిగిందని, బాలు, మీనా అడిగితే.. ఈవిడ రెస్టారెంట్ కోసం ప్లాన్ చేస్తోంది.. అసలు వంట గురించి ఎంత తెలుసో తెలుసుకుందామని తీసుకొచ్చానని రవి అంటాడు. అప్పుడే సత్యం, ప్రభావతి, మనోజ్ కూడా వస్తారు. రవి కిచెన్ లోకి వెళ్లి నాలుగైదు డబ్బాలు తీసుకొస్తాడు. వాటిలో ఉన్న పప్పులు చూపించి ఏది ఏ పప్పో చెప్పమంటాడు. కానీ శృతికి అవేంటో అర్థం కావు. చిన్నప్పటి నుంచీ కిచెన్ లోకి వెళ్లలేదు.. అందుకే తెలియదు అని ఆమె కవర్ చేసుకుంటుంది. మరి రెస్టారెంట్ ఎలా పెడతావని రవి క్లాస్ పీకుతాడు.

ఇంటికి స్వాహా మాత.. దొరికిపోయిన రోహిణి

ఆ తర్వాత స్వాహా మాతను ఇంటికి తీసుకొస్తుంది కామాక్షి. ఆమెను చూడగానే బాలు సెటైర్లు వేస్తాడు. ప్రభావతి వచ్చి నమస్కరించగా.. నీ సర్వం స్వాహా అంటూ దీవిస్తుంది. నీకు తాయత్తు ఇచ్చింది ఈవిడేనా అని బాలు అడుగుతాడు. అప్పుడే రోహిణి కూడా వస్తుంది. స్వాహా మాతను చూసి షాకవుతుంది. ఈమె ఇక్కడికి వచ్చిందేంటి.. దొరికిపోతానా అని కంగారు పడుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

ABOUT THE AUTHOR

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.