Gunde Ninda Gudi Gantalu Today Episode: ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్లుగా బాలు, రవి, శృతి.. మీనా విషయం తెలుసుకున్న అరుణ్

Gunde Ninda Gudi Gantalu Serial September 25th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 25 ఎపిసోడ్ లో బాలు, రవి, శృతి, రాజేష్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల అవతారం ఎత్తుతారు. ఓవైపు వాళ్లు చింతామణి పని పట్టడానికి రెడీ కాగా.. మరోవైపు మీనా విషయం తెలుసుకుంటాడు అరుణ్.

Published on: Sep 25, 2026, 07:00:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో మీనా డబ్బు పోవడం వెనుక చింతామణి హస్తమే ఉందని ఫిక్సయిపోతాడు బాలు. ఆ డబ్బును తీసుకురావడానికి అదిరిపోయే ప్లాన్ వేస్తాడు. దానికి కామాక్షి సాయం చేస్తుంది. అటు అరుణ్ కి కూడా ఈ దోపిడీ విషయం తెలిసిపోతుంది.

Gunde Ninda Gudi Gantalu Today Episode: ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్లుగా బాలు, రవి, శృతి.. మీనా విషయం తెలుసుకున్న అరుణ్
Gunde Ninda Gudi Gantalu Today Episode: ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్లుగా బాలు, రవి, శృతి.. మీనా విషయం తెలుసుకున్న అరుణ్

ప్రభావతి, సత్యం రొమాన్స్.. ఆ రోజులను గుర్తు చేసుకొని..

బాలు, మీనా ఆటలు చూసి మండిపడిన ప్రభావతిని సత్యం గదిలోకి తీసుకెళ్లే సీన్ తో సీరియల్ శుక్రవారం (సెప్టెంబర్ 25) ఎపిసోడ్ మొదలైంది. ఇప్పుడీ ఆటలేంటి అని ప్రభావతి విసుక్కుంటుంటే.. సత్యం తమ పాత రోజులను గుర్తు చేస్తాడు. రాజుగారి తోట నుంచి నీ కోసం మల్లెపూలు, కనకాంబ్రాలు తుండుగుడ్డలో తీసుకొచ్చి వేయలేదా అని అంటాడు.

ఆ రోజులు గుర్తు చేసుకొని ప్రభావతి కూడా సిగ్గు పడుతుంది. ఫస్ట్ నైట్ రోజు కూడా నువ్విలాగే బాటిల్ బదులు పాల గ్లాసు పట్టుకొని రాలేదా అనడంతో మరింత సిగ్గు పడుతుంది. ఆ శోభనం రాత్రి సీన్ ను రీక్రియేట్ చేస్తూ సత్యం, పబ్బి అంటూ ఇద్దరూ రొమాన్స్ లో మునిగిపోతారు.

పూలతో మీనా, బాలు ఆటలు.. వీడియో తీసిన శృతి.. కుళ్లకున్న రోహిణి

ఇటు హాల్లో బాలు, మీనా పూలను ఒకరిపై మరొకరు తలంబ్రాలలాగా పోసుకుంటూ ఆటలాడుతుంటారు. అప్పుడే రవి, శృతి అక్కడికి వస్తారు. వాళ్లను చూసి ముచ్చటపడిన శృతి చాటుగా ఆ వీడియో తీస్తుంది. వాళ్లు రాగానే మీనా, బాలు పూలు పోసుకోవడం ఆపేస్తారు. ఈ ఆటలో తన బాధను మరచిపోయానని మీనా అంటుంది. ఆ తర్వాత రవి, శృతి కూడా అలాగే పూలతో ఆటలాడుకుంటారు. అప్పుడే పైనుంచి కిందికి వస్తున్న రోహిణి వాళ్లను చూసి ఏడుపు మొహం పెడుతుంది.

సుమతికి అరుణ్ ఫోన్.. మీనా విషయం చెప్పడంతో..

మరోవైపు హాస్పిటల్లో ఉన్న సుమతికి అరుణ్ ఫోన్ చేస్తాడు. ఆమె డల్లుగా మాట్లాడటంతో ఏమైందని అడుగుతాడు. దీంతో సుమతి జరిగిన విషయం చెబుతుంది. మీ దగ్గర తీసుకున్న మూడు లక్షలు అక్కకు ఇచ్చానని, వాటిని డిపాజిటల్ కట్టడానికి వెళ్తుంటే గాంధీ నగర్ రెండో వీధిలో ఎవరో అడ్డుకొని ఎత్తుకెళ్లిపోయారని, అక్కను తోసేశారని చెబుతుంది.

దీంతో అరుణ్ షాక్ తింటాడు. ఇప్పుడు మీ అక్క ఎలా ఉంది అని అడుగుతాడు. సుమతి డబ్బు గురించి మాట్లాడుతుంటే.. ఆ విషయం వదిలెయ్.. నేను మీ ఇంటికి కాబోయే అల్లుడిని.. పరాయివాడిలా చూడకు అని అంటాడు. ఆ రౌడీలను పట్టుకోమని సీఐకి చెబుతానని అరుణ్ అంటే.. ఇప్పటికే బావ ప్రయత్నిస్తున్నాడని, వద్దని సుమతి అంటుంది. సరే నువ్వు జాగ్రత్త అని అరుణ్ ఫోన్ పెట్టేస్తాడు.

కామాక్షి దగ్గరికి బాలు.. చింతామణిని పట్టుకునే ప్లాన్

చింతామణిపై అనుమానపడిన బాలు ఆ తర్వా త కామాక్షి దగ్గరికి వెళ్తాడు. మీనాకు జరిగిన విషయం ఆమెతో చెబుతాడు. ఇది బాగా తెలిసిన వాళ్లే చేశారని బాలు అంటే.. కొంపదీసి మీ అమ్మే అనుకుంటున్నావా అని కామాక్షి అంటుంది. ఆమె మరీ ఇంకా అంతకు దిగజారలేదు కానీ.. చింతామణే ఇలా చేసి ఉంటుందని బాలు అంటే.. తనకూ ఆమె మీదే అనుమానం ఉందని కామాక్షి చెబుతుంది.

ఈ విషయం తెలుసుకోవడానికి నీ సాయం కావాలని బాలు అంటాడు. రేపు చింతామణిని ఓ మూడు గంటల పాటు మీ ఇంట్లోనే ఉండేలా చేయాలని, ఆమెకు డబ్బు పిచ్చి కాబట్టి కుబేర వ్రతం చేయిస్తున్నానని చెప్పి పిలవాలని బాలు చెబుతాడు. కామాక్షి సరే అంటుంది.

అరుణ్ తల్లికి మీనా లిఫ్ట్.. సుమతి ఆశ్చర్యం

మరోవైపు మీనా బండిపై బయటకు వెళ్తుండగా.. అనుకోకుండా అరుణ్ తల్లి కలుస్తుంది. ఆమె వెళ్లే ఆటో ఆగిపోవడంతో ఆమెకు లిఫ్ట్ ఇస్తుంది. సుమతి పని చేసే హాస్పిటల్ కే వాళ్లు వెళ్తారు. ఇక్కడ తన చెల్లి ఉందని, మీకు ఏం కావాలన్నా చేస్తుందని మీనా అంటే.. తనకూ తెలిసిన ఓ మంచి అమ్మాయి ఉందని ఆమె అంటుంది. వాళ్లిద్దరూ కలిసి రావడం చూసి సుమతి ఆశ్చర్యపోతుంది.

తర్వాత సుమతియే వాళ్లిద్దరికీ ఒకరినొకరిని పరిచయం చేస్తుంది. మొదట నిన్ను చూశాను.. తర్వాత మీ అమ్మగారిని చూశాను.. ఇప్పుడు మీ అక్కను చూశాను.. అందరూ చాలా పద్ధతిగా, ఎదుటి వాళ్లకు సాయం చేసే గుణం ఉన్నవాళ్లే అని అరుణ్ తల్లి మెచ్చుకుంటుంది.

అరుణ్ తల్లి గురించి చెప్పిన సుమతి

తర్వాత అరుణ్ తల్లిని టెస్టుల కోసం సుమతి లోనికి పంపిస్తుంది. ఆ తర్వాత అరుణ్ తల్లి గురించి మీనాకు చెబుతుంది. ఓ అబ్బాయి గురించి మీకు చెప్పాలని అన్నాను కదా.. అది వీళ్ల అబ్బాయి గురించే అని సుమతి అంటుంది. చాలా మంచి వాళ్లలా ఉన్నారు.. ఇలాంటి అత్త దొరకడం నీ అదృష్టం అని మీనా అంటుంది.

అది సరేగానీ ఆ డబ్బు పోయిన విషయం తెలిస్తే ఆ మంచితనం వాడుకునే వాళ్లను మోసం చేశానని అనుకుంటారేమో అని సుమతి భయపడుతుంది. ఎందుకలా అనుకుంటారని మీనా అంటే.. ఆ డబ్బు ఇచ్చింది వాళ్ల అబ్బాయే అని చెప్పడంతో మీనా షాక్ తింటుంది. వాళ్ల దగ్గర ఎందుకు డబ్బు తీసుకున్నావని సుమతిని మందలిస్తుంది.

ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్లుగా బాలు, రవి, శృతి

ఆ తర్వాత చింతామణి దగ్గర ఉన్న డబ్బు తిరిగి రాబట్టడానికి బాలు ఓ ప్లాన్ వేస్తాడు. ముందుగా మీనా, రవి, శృతి, రాజేష్ లను తమ ఇంటి పైకి పిలిచి అక్కడే తన ప్లాన్ ఏంటో చెబుతాడు. ఆ డబ్బు తిరిగి రాబట్టడానికి అందరం ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల అవతారం ఎత్తాలని అంటాడు. దానికి అందరూ ఓకే చెబుతారు. మరుసటి రోజు వాళ్లంతా ఆఫీసర్లలా హుందాగా రెడీ అయి చింతామణి ఇంటికి వెళ్తారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More