గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: శృతి దెబ్బకు అడ్డంగా దొరికిపోయిన మనోజ్.. ప్రభావతి బుకాయింపు.. మీనాపైనే నింద
గుండె నిండా గుడి గంటలు మంగళవారం (నవంబర్ 18) ఎపిసోడ్ లో బాలు, మీనా నిలదీయగా ప్రభావతి తాను తప్పు చేయలేదని బుకాయిస్తూ మీనా పుట్టింటి వాళ్లపైనే నింద వేస్తుంది. అయితే శృతి ప్లాన్ దెబ్బకు మనోజ్ అడ్డంగా దొరికిపోతాడు.
గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 556వ ఎపిసోడ్ లో ప్రభావతి, మనోజ్ కు తన విశ్వరూపం చూపిస్తాడు బాలు. సుశీల వెళ్లిపోగానే గిల్టు నగల గురించి నిలదీస్తాడు. కానీ ప్రభావతి బుకాయిస్తూ నిందను తిరిగి మీనాపైనే మోపుతుంది. కానీ శృతి, బాలు ప్లాన్ దెబ్బకు మనోజ్ అడ్డంగా దొరికిపోతాడు.

బాలు, మీనాలకు వంశ గౌరవాన్ని ఇచ్చిన సుశీల
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (నవంబర్ 18) ఎపిసోడ్ బాలు, మీనాలకు సుశీల ఇచ్చే గిఫ్ట్ తో మొదలవుతుంది. ఇది వంశ గౌరవం అంటూ ఓ బంగారు నగను సుశీల వాళ్లకు ఇస్తుంది. తనకు మరుపురాని చిన్ననాటి జ్ఞాపకాలను అందించిన బాలుకే అది చెందాలని ఆమె స్పష్టం చేస్తుంది. అంతేకాదు ప్రతి ఏటా దీనిని పూజించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకూడదని తేల్చి చెబుతుంది. దీంతో మిగిలిన వాళ్లు నిరాశ చెందుతారు. ఆ తర్వాత మౌనిక తాను ఇక వెళ్తానని చెప్పి తన అత్తారింటికి వెళ్లిపోతుంది.
ఆరు తరాల వంశ గౌరవాన్ని తమకు ఇవ్వడం చూసి మీనా మురిసిపోతుంది. అటు బాలు కూడా ఆ గౌరవం తమకు దక్కినందుకు సంతోషిస్తాడు. కానీ ఆ గిల్టు నగల గురించి తలుచుకొని ఆవేశపడతాడు. బామ్మ వెళ్లిపోగానే ఇంట్లో వాళ్ల సంగతి తేలుస్తానని ఊగిపోతాడు.
మౌనికను నిలదీసిన సంజూ
అటు ఇంటికి వచ్చిన మౌనికను సంజూ నిలదీస్తాడు. ఎక్కడి వెళ్లావని అడుగుతాడు. గుడికే వెళ్లొచ్చానని చెప్పినా వినడు. మీ ఇంటికి వెళ్లి వచ్చావు కదా.. అమ్మ చెప్పింది అని అబద్ధం చెబుతాడు. అప్పుడే మౌనిక అత్త అక్కడికి వచ్చి తాను అలా చెప్పలేదని, కంగారు పడకని మౌనికకు సైగ చేస్తుంది. దీంతో తాను గుడికే వెళ్లానని, అత్తయ్యే తనను పూజ పూర్తి చేసుకొని రమ్మని చెప్పిందని అంటుంది. దీంతో సంజూ సరే అని వెళ్లిపోతాడు.
బాలుని ఏం జరిగిందని అడిగిన సుశీల
ఆ తర్వాత సుశీల తిరిగి వెళ్లిపోతుంది. ఆమెను కారులో బస్టాండు వరకూ డ్రాప్ చేయడానికి బాలు వెళ్తాడు. అంతా హ్యాపీయే కదా బామ్మ అని బాలు అడుగుతాడు. చిన్ననాటి జ్ఞాపకాలను అందించావు అంతకంటే ఏం కావాలని ఆమె అంటుంది. అయితే మీనా, నువ్వు ఎందుకు అలా ఉన్నారు.. బాధగా కనిపించారు అని అడుగుతుంది. అదేం లేదు.. నీకు చెయిన్ చేయించాలనుకున్నాం.. కానీ కుదరలేదు అని బాలు అంటాడు. ఈ వయసులో బంగారు చెయిన్ నాకెందుకు.. జీవితంలో మరచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చావు అది చాలు అని ఆమె అని వెళ్లిపోతుంది.
ఇంటికి తాళం వేసి మరీ విశ్వరూపం చూపించిన బాలు
ఇక తిరిగి ఇంటికి రావడంతోనే గేటుకు తాళం వేసి మరీ బాలు ఆవేశంగా లోనికి వస్తాడు. పనుందని బయటకు వెళ్లడానికి ప్రయత్నించిన మనోజ్ ను పట్టి లాగుతాడు. గ్యాంగ్ లీడర్ ఏదంటూ అనగానే ప్రభావతి కూడా అక్కడికి వస్తుంది. మనోజ్ వెళ్లి తల్లి వెనుక దాక్కొంటాడు. ఏం జరగిందని సత్యం అడిగితే.. మీనా వెళ్లి గిల్టు నగలు తీసుకొచ్చి పెడుతుంది. అది చూసి మనోజ్, ప్రభావతి కంగారు పడతారు. మీనా ఇచ్చిన నగలు గిల్టుగా ఎలా మారాయని బాలు నిలదీస్తాడు. తమ ముందే మీనా నగలు ఇచ్చింది కదా అని సత్యం, రవి, శృతి కూడా అడుగుతారు.
తెలియదని బుకాయించిన ప్రభావతి
కానీ ప్రభావతి మాత్రం బుకాయిస్తుంది. అవి గిల్టు నగలు ఎలా అయ్యాయో తనకెలా తెలుస్తుందని ఆమె అంటుంది. అసలు మీనా ఇచ్చినప్పుడు అవి గిల్టు నగలు ఎందుకు కాకూడదు.. అంతకుముందు ఆమె చాలాసార్లు వాటితో పుట్టింటికి వెళ్లి వచ్చింది.. అక్కడి నుంచి ఈ గిల్టు నగలు వచ్చి ఉంటాయి అని ప్రభావతి అంటుంది. దీంతో బాలు, మీనా ఆమెపై మండిపడతారు. తమ పుట్టింటి వాళ్లను ఇందులోకి లాగితే బాగుండదని మీనా గట్టి వార్నింగ్ ఇస్తుంది.
ఏం చేసినా ప్రభావతి అసలు నిజం చెప్పకపోవడంతో బాలు, మీనా, రవి, శృతి కలిసి ఎలాగైనా నిజం తెలుసుకోవాలని అనుకుంటారు. దీంతో మనోజ్ ఆ గిల్టు నగలు ఎక్కడ తెచ్చాడో తెలసుకొని ఆ షాపు నుంచి ఫోన్ చేస్తున్నట్లుగా శృతి మనోజ్ కు ఫోన్ చేస్తుంది. తానే కొన్నానని మీకు ఎలా తెలుసని అడిగితే.. బిల్లు ఉందని, మీకు గిఫ్ట్ వచ్చిందని శృతి చెబుతుంది. దీంతో మనోజ్ దొరికిపోయాడని బాలు అనుకుంటాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


