Producer: 21 ఏళ్లకే ప్రొడ్యూసర్.. దాచుకున్న డబ్బులతో సినిమా.. 2 కోట్లు పెడితే రూ.100 కోట్లు.. అనుప్రియ సక్సెస్ స్టోరీ
Producer: బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిన మూవీ హనుమాన్ అంశ్ ప్రొడ్యూసర్ వయసు కేవలం 21 ఏళ్లంటే నమ్మగలరా? అనుప్రియ నాగర్ అనే ఆ అమ్మాయి తాను దాచుకున్న డబ్బులతో ఈ సినిమా తీయడం విశేషం.
Producer: లండన్‌లో చదువుకుంటూ మూడేళ్ల పాటు పార్ట్‌టైమ్ జాబ్స్ చేసి సంపాదించిన ప్రతీ రూపాయిని ఒక డివోషనల్ సినిమాపై పెట్టి, ఇప్పుడు ఏకంగా రూ. 100 కోట్ల బాక్స్ ఆఫీస్ సంచలనం సృష్టించింది 21 ఏళ్ల యంగ్ ప్రొడ్యూసర్ అనుప్రియ నాగర్. ఎలాంటి ఫిల్మ్ మేకింగ్ అనుభవం లేకుండా నీమ్ కరోలి బాబా (మహారాజ్ జీ) జీవితం ఆధారంగా 'హనుమాన్ అంశ్' (Hanuman Ansh) చిత్రాన్ని నిర్మించి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హిస్టారికల్ సక్సెస్ సాధించింది.

స్విట్జర్లాండ్ జాబ్ ఆఫర్ వదిలేసి స్వదేశానికి..
యూకేలోని ఫేమస్ యూనివర్సిటీ ఆఫ్ బాత్ నుంచి ఎకనామిక్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనుప్రియకు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరంలో ఒక కార్పొరేట్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. అయితే ఆ జాబ్ వదిలేసి 2025లో ఇండియాకు తిరిగి వచ్చి ఈ హనుమాన్ అంశ్ సినిమా ప్రాజెక్ట్‌లో కో-ప్రొడ్యూసర్‌గా జాయిన్ అయ్యారు.
"నా దృష్టిలో వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే. నీమ్ కరోలి బాబా (మహారాజ్ జీ) కథలను మన జెన్ జీ (Gen Z) యువతకు దగ్గర చేయడమే నా ఏకైక లక్ష్యం. లండన్‌లో ఉన్నప్పుడు ఒక విదేశీ వ్యక్తి ద్వారా బాబా గారి గురించి మొదటిసారి విన్నాను. మన దేశంలో పుట్టి ఆయన కథను ఒక విదేశీయుడి ద్వారా తెలుసుకోవాల్సి వచ్చినందుకు ఒక భారతీయ యువతిగా నాకు చాలా సిగ్గుగా అనిపించింది" అని అనుప్రియ చెప్పుకొచ్చారు.
సంపాదన మొత్తం పణంగా పెట్టిన రిస్క్
ఆర్థికంగా లాభాలు వస్తాయో లేదో అనే ఆలోచనతో తాను ఈ సినిమా నిర్మించలేదని అనుప్రియ స్పష్టం చేశారు. "లండన్‌లో చదువుకుంటున్నప్పుడు మూడేళ్ల పాటు పార్ట్‌టైమ్ జాబ్స్ చేసి సంపాదించిన డబ్బునంతా ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయించాను. నా జీవితంలో ఒక అందమైన సందర్భంలో మహారాజ్ జీ గురించి తెలిసింది. ఫిల్మ్ మేకింగ్‌లో నాకు ఎలాంటి అనుభవం లేకపోయినా నా ప్రాణాన్ని, ఆత్మను ఈ సినిమాకు ధారపోశాను. ఆ టైమ్‌లో ప్రాజెక్ట్‌కి ఫండ్స్ అవసరమైనప్పుడు నా దగ్గర ఉన్న మొత్తం పొదుపును ఇచ్చేశాను" అని ఆమె తెలిపారు.
సినిమా రంగంలోకి అడుగుపెడతానన్నప్పుడు కుటుంబంలో కొన్ని ఆందోళనలు వ్యక్తమైనట్లు చెప్పారు. "మా నాన్నగారు చాలా ఆలోచించారు. నీకు ఫిల్మ్ మేకింగ్ తెలియదు. ఇండస్ట్రీ వాతావరణం ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. పైగా నీకు వయసు చాలా తక్కువ అని హెచ్చరించారు. కానీ ఒక పవిత్రమైన సాధువు గురించి సినిమా తీస్తున్నానని చెప్పి కథ వివరించాక ఆయన పూర్తిగా సపోర్ట్ చేశారు. నా ఫ్యామిలీ నా వెంట నిలిచింది. నిజం చెప్పాలంటే నాకంటే నా కుటుంబమే ఈ సినిమాకు ఎక్కువ పబ్లిసిటీ చేస్తోంది" అని నవ్వుతూ చెప్పారు.
30 థియేటర్ల నుంచి 1500 థియేటర్లకు.. రూ. 100 కోట్ల రికార్డ్
'హనుమాన్ అంశ్' సినిమా బాక్స్ ఆఫీస్ జర్నీ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. ప్రారంభంలో 300 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. ఎనిమిదో రోజు నాటికి ఆదరణ లేక కేవలం 30 థియేటర్లకు పడిపోయింది. ఆ తర్వాత ప్రేక్షకుల్లో వచ్చిన విపరీతమైన రెస్పాన్స్, వర్డ్ ఆఫ్ మౌత్ ప్రచారంతో ఏకంగా 1,500 కంటే ఎక్కువ థియేటర్లకు విస్తరించింది.
ఇప్పుడు ఇంటర్నేషనల్‌గా రిలీజ్ అవుతూ రూ. 100 కోట్ల కలెక్షన్ మార్క్‌ను తాకింది."ప్రజలు మహారాజ్ జీ గురించి తెలుసుకోవడమే నా అసలైన బాక్స్ ఆఫీస్ విజయం. అయితే ఈ వసూళ్లు చూస్తుంటే ఇలాంటి డివోషనల్ కంటెంట్‌ను ఆదరించడానికి జనాలు సిద్ధంగా ఉన్నారని, థియేటర్లలోనే ఆయన దర్శనం చేసుకోవడానికి వస్తున్నారని నమ్మకం కలిగింది" అని అనుప్రియ అన్నారు.
సీక్వెల్ కన్ఫర్మ్.. 'హనుమాన్ అంశ్ 2' విశేషాలు
సినిమా క్లైమాక్స్ చూసిన ప్రేక్షకులు సీక్వెల్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై అనుప్రియ స్పందిస్తూ సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. "ప్రేక్షకులను మేము నిరాశపరచము. బాక్స్ ఆఫీస్ విషయంలో మహారాజ్ జీ మాకు అపారమైన విజయాన్ని ఇచ్చారు. కాబట్టి పార్ట్ 2 తీయడం తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు" అని ప్రకటించారు.
మొదటి భాగం లాగే సీక్వెల్ కూడా అత్యంత నిరాడంబరంగా ఉంటుందని చెప్పారు. "మా సినిమా కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అదే సినిమాను రూ. 10 కోట్లతో తీసి ఉంటే ఆ నేచురల్ లుక్ వచ్చి ఉండేది కాదు. తక్కువ బడ్జెట్ వల్ల వచ్చిన ఆ సింప్లిసిటీని సీక్వెల్‌లో కూడా అలాగే కాపాడుకుంటాం" అని అనుప్రియ స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


