Kamal Haasan: మనసు ఒప్పుకోవడం లేదు.. 9 మంది పోలీసులకు ఉరిశిక్షపై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు.. భార్యాపిల్లలు బలి

Kamal Haasan: తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో తొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష పడటంపై కమల్ హాసన్ స్పందించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందని చెబుతూనే, మరణశిక్షపై తనకున్న వ్యక్తిగత వ్యతిరేకతను ఆయన కుండబద్ధలు కొట్టారు. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Published on: Apr 7, 2026, 12:11:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన తూత్తుకుడి జిల్లా సాత్తాంకుళం లాకప్ డెత్ కేసులో కోర్టు వెలువరించిన తీర్పుపై మక్కల్ నీది మయ్యం అధినేత, నటుడు కమల్ హాసన్ స్పందించారు. ఉరిశిక్షను సమర్థించనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనసు ఒప్పుకోవడం లేదన్నారు.

కమల్ హాసన్ (PTI)
కమల్ హాసన్ (PTI)

పోలీసులకు మరణశిక్ష

సాత్తాంకుళం లాకప్ డెత్ కేసులో తొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ వచ్చిన తీర్పును కమల్ హాసన్ చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. అయితే, తన వ్యక్తిగత సిద్ధాంతం ప్రకారం ఉరిశిక్షను తాను సమర్థించనని కమల్ స్పష్టం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

విజయం దక్కిందని

ఈ తీర్పుపై కమల్ స్పందిస్తూ, "జయరాజ్, బెన్నిక్స్ అనుభవించిన నరకం తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతోంది. ప్రజలను రక్షించాల్సిన వారే కాలయముళ్లుగా మారడం అత్యంత దారుణం. బాధితుల కుటుంబాలకు, స్థానిక ప్రజలకు, సామాజిక కార్యకర్తలకు ఈ న్యాయ పోరాటంలో విజయం దక్కింది.

మనసు ఒప్పుకోవడం లేదు

‘‘వ్యక్తిగతంగా నేను మరణశిక్షకు వ్యతిరేకిని. అందుకే మనసు ఒప్పుకోవడం లేదు. ఎంతటి ఘోరమైన నేరానికి పాల్పడినా సరే వాళ్లకు జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధించాలి. వారు చేసిన తప్పుకు ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న వేదనను చూస్తుంటే బాధగా ఉంది. ఆ పోలీసుల అమానవీయ చర్యల వల్ల ఎలాంటి పాపం తెలియని వారి భార్యాపిల్లలు బలికావాల్సి వస్తోంది" అని కమల్ హాసన్ ఆవేదన వ్యక్తం చేశారు.

వాళ్లను వదలొద్దు

కేవలం పోలీసులపైనే కాకుండా, ఈ కేసులో నిజాలను దాచిపెట్టిన ఇతరులపై కూడా కమల్ నిప్పులు చెరిగారు. "పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని కనీసం పరీక్షించకుండానే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్, రిమాండ్ విధించిన అధికారులు, కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన వారు, అలాగే వారు శ్వాస తీసుకోలేక చనిపోయారని నిర్లక్ష్యంగా మాట్లాడిన అప్పటి అధికార పార్టీ నేతలకు కూడా శిక్ష పడాలి" అని కమల్ డిమాండ్ చేశారు.

ఏమిటీ సాత్తాంకుళం కేసు

కరోనా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో 2020 జూన్ నెలలో సాత్తాంకుళం పోలీసులు పి. జయరాజ్, ఆయన కుమారుడు బెన్నిక్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో వీరిద్దరిపై అమానవీయంగా దాడి చేసి, చిత్రహింసలకు గురిచేశారు. తీవ్ర గాయాలపాలైన తండ్రీకొడుకులు జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే కొద్దిరోజుల వ్యవధిలో మరణించారు.

ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్త నిరసనలకు దారితీసింది. ప్రజల ఆగ్రహం చూసి అప్పటి ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సుదీర్ఘ విచారణ అనంతరం, ప్రత్యేక కోర్టు ఇప్పుడు తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More