రూ.50 లక్షల బడ్జెట్.. రూ.120 కోట్ల వసూళ్లు.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..

ఓటీటీలోకి ఓ బ్లాక్‌బస్టర్ మూవీ వస్తోంది. ఈ సినిమా పేరు లాలో: కృష్ణ సహా సహాయతే (laalo krishna sada sahaayate). ఈ గుజరాతీ మూవీ గతేడాది అత్యధిక లాభాలు గడించిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.

Mar 2, 2026, 16:57:47 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండియన్ సినిమాలో హిందీ, తెలుగు, తమిళం వంటి ఇండస్ట్రీలదే హవా. కానీ వాటన్నింటినీ తలదన్నుతూ గతేడాది వచ్చిన ఓ చిన్న గుజరాతీ మూవీ రికార్డులు తిరగరాసింది. లాలో: కృష్ణ సదా సహాయతే అనే ఆ మూవీ మొత్తానికి ఓటీటీలోకి వస్తోంది. థియేటర్లలో రిలీజైన ఐదు నెలల తర్వాత స్ట్రీమింగ్ కానుండటం విశేషం.

రూ.50 లక్షల బడ్జెట్.. రూ.120 కోట్ల వసూళ్లు.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..
రూ.50 లక్షల బడ్జెట్.. రూ.120 కోట్ల వసూళ్లు.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..

లాలో: కృష్ణ సదా సహాయతే ఓటీటీ స్ట్రీమింగ్

గుజరాతీ మూవీ లాలో: కృష్ణ సదా సహాయతే సినిమాను సోనీ లివ్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ శుక్రవారం అంటే మార్చి 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఒరిజినల్ గుజరాతీతోపాటు హిందీలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీ లివ్ వెల్లడించింది. “ఎక్కడైతే నమ్మకం తిరిగి వస్తుందో, భక్తి మనల్ని నయం చేస్తుందో, ప్రతి మార్గంలోనూ గైడ్ చేసే దైవిక శక్తి ఉంటుందో ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టండి. లాలో: కృష్ణ సదా సహాయతే మార్చి 6 నుంచి సోనీ లివ్ ఓ స్ట్రీమింగ్ అవుతుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

'లాలో: కృష్ణ సదా సహాయతే' విశేషాలు

అంకిత్ సఖియా దర్శకత్వం వహించిన 'లాలో' ఒక రిక్షా పుల్లర్ కథ. ఒక ఫామ్‌హౌస్‌లో చిక్కుకున్న ఈ డ్రైవర్.. గతంలోని బాధలను తలుచుకుంటూ ఉంటాడు. అదే సమయంలో శ్రీకృష్ణుడు అతనికి కనిపిస్తూ ఉంటాడు. అలా ఓ కొత్త జీవితం వైపు అతడు వెళ్లేలా ఎలా మార్గనిర్దేశం చేస్తాడన్నదే ఈ మూవీ కథ.

విడుదలైన మూడు వారాల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన గుజరాతీ చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ సినిమా విజయ పరంపర కొనసాగుతోంది. థియేటర్లలో రిలీజైన కొన్ని వారాల తర్వాత కూడా మూవీ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తూ వెళ్లింది. 'లాలో' మూవీలో రీవా రాచ్, శ్రుహద్ గోస్వామి, కరణ్ జోషి, మిష్టీ కడేచా ప్రధాన పాత్రల్లో నటించారు.

అసలేంటీ మూవీ?

1975లో 'షోలే' థియేటర్లలో విడుదలై దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలుసు కదా. దేశవ్యాప్తంగా 50కి పైగా నగరాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ రికార్డులను సృష్టించింది. అయినప్పటికీ ఆ సమయంలో విడుదలైన ఓ తక్కువ బడ్జెట్ భక్తి సినిమా 'జై సంతోషి మా' కొన్ని ప్రాంతాల్లో 'షోలే' కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. 'జై సంతోషి మా' మూవీ 100 రెట్లకు పైగా లాభాలు ఆర్జించి, భారతీయ సినిమా చరిత్రలో ఒక కేస్ స్టడీగా మారింది.

దాదాపు అరవై ఏళ్లలో ఏ సినిమా కూడా ఆ రికార్డును అధిగమించలేదు. అయితే ఈ ఏడాది ఎలాంటి సూపర్ స్టార్స్ లేని ఒక సాదాసీదా గుజరాతీ మూవీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఈ సినిమా 225 రెట్లకు పైగా లాభాలను నమోదు చేసి గతేడాది అత్యధిక లాభాలను ఆర్జించిన మూవీగా నిలిచింది.

రూ.50 లక్షల బడ్జెట్‌.. రూ.120 కోట్ల వసూళ్లు

గతేడాది అక్టోబర్‌లో విడుదలైన గుజరాతీ మూవీ 'లాలో: కృష్ణ సదా సహాయతే' (Laalo: Krishna Sada Sahaayate) అతిపెద్ద థియేట్రికల్ సక్సెస్ స్టోరీలలో ఒకటిగా నిలిచింది. కేవలం రూ.50 లక్షల బడ్జెట్‌తో రూపొందించిన ఈ భక్తి ప్రధాన మూవీ.. ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్ల వసూళ్లు రాబట్టింది. అంటే పెట్టిన పెట్టుబడిపై ఏకంగా 225 రెట్లు రాబడిని అందించింది. దీంతో ఇది గతేడాది అత్యధిక లాభదాయకమైన భారతీయ చిత్రంగా నిలిచింది.

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడు సినిమాలు కూడా లాభం విషయంలో దీనికి సాటి రాలేకపోయాయి. కాంతార: ఛాప్టర్ వన్ రూ.125 కోట్ల బడ్జెట్‌తో రూపొందగా.. రూ.850 కోట్లు వసూలు చేసింది. అంటే 7 రెట్లు లాభం.

ఇక ఛావా మూవీని రూ.90 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తే.. రూ.808 కోట్లు వసూలు చేసింది. అంటే సుమారు 9 రెట్లు లాభం. సయ్యారా రూ.45 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన సినిమా కాగా.. రూ.500 కోట్లకుపైగా అంటే 13 రెట్లు లాభం ఆర్జించింది.