Bonnie Tyler: సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం- లెజెండరీ సింగర్ బోనీ టైలర్ కన్నుమూత- కిరాణా షాపు నుంచి గ్లోబల్ స్టార్‌గా!
Singer Bonnie Tyler Passed Away: 'టోటల్ ఎలిప్స్ ఆఫ్ ది హార్ట్' వంటి ఆల్‌టైమ్ క్లాసిక్ సాంగ్స్‌తో ప్రపంచాన్ని ఊపేసిన అంతర్జాతీయ పాప్ సింగర్ బోనీ టైలర్ (75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పోర్చుగల్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Singer Bonnie Tyler Passed Away: అంతర్జాతీయ సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. పాప్ విప్లవానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచి, తమ విలక్షణమైన గొంతుతో దశాబ్దాల పాటు కోట్ల మంది అభిమానులను ఓలలాడించిన వెల్ష్ పాప్ లెజెండ్ బోనీ టైలర్ ఇక లేరు.

75 ఏళ్ల వయసులో మరణం
75 ఏళ్ల వయసులో లెజెండరీ సింగర్ బోనీ టైలర్ కన్నుమూశారు. ఈ విషాద వార్తను ఆమె కుటుంబ సభ్యులు అధికారిక ఫేస్‌బుక్ పేజీ ద్వారా పంచుకున్నారు. పోర్చుగల్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచినట్లు ప్రకటించారు.
గత కొన్ని నెలలుగా బోనీ టైలర్ తీవ్ర అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఈ ఏడాది మే నెలలో పోర్చుగల్‌లోని ఫారో నగరానికి సమీపంలో ఉన్న ఆసుపత్రిలో ఆమెకు అత్యవసర ప్రేగు శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ తర్వాత ఆమె త్వరగా కోలుకోవడానికి వైద్యులు కొన్నాళ్ల పాటు కోమాలో ఉంచారు.
కోమాలోనుంచి బయటకు వచ్చినప్పటికీ
ఆ తర్వాత కోమాలోంచి బయటకు వచ్చినప్పటికీ, ఆరోగ్యం ఆశించిన స్థాయిలో మెరుగుపడలేదు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) లోనే ఉంచి చికిత్స అందిస్తున్నప్పటికీ బుధవారం జూలై రాత్రి బోనీ టైలర్ పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచారు.
"మా సోదరి అనారోగ్యంతో చేసిన పోరాటంలో ఓడిపోయింది. కుటుంబంగా మేమంతా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాం. ఆమె ఎంతో ప్రేమగల, అద్భుతమైన మనిషి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానుల కోసం ఆమె ఎప్పుడూ సమయాన్ని కేటాయించేది. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను" అని బోనీ టైలర్ సోదరుడు పాల్ హాప్కిన్స్ ఫేస్‌బుక్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
కిరాణా షాపు ఉద్యోగి నుంచి గ్లోబల్ స్టార్‌గా..
బోనీ టైలర్ అసలు పేరు గైనోర్ హాప్కిన్స్. బ్రిటన్‌లోని వేల్స్ ప్రాంతంలో ఉన్న స్వాన్సీ సమీపంలోని స్కూవెన్ గ్రామంలో బోనీ జన్మించారు. సంగీతంపై ఉన్న ఇష్టంతో చిన్న వయసులోనే స్థానిక క్లబ్బుల్లో పాటలు పాడటం ప్రారంభించారు.
ఆ సమయంలో జీవనోపాధి కోసం ఆమె ఒక కిరాణా దుకాణంలో పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేసేవారు. ఒకసారి టాలెంట్ స్కౌట్ ఆమెలోని అద్భుతమైన ప్రతిభను గుర్తించి ఆర్‌సీఏ (RCA) రికార్డ్స్‌తో ఒప్పందం కుదుర్చుకునేలా చేశారు. ఆ తర్వాతే ఆమె తన పేరును 'బోనీ టైలర్'గా మార్చుకున్నారు.
1977లో విడుదలైన 'ఇట్స్ ఎ హార్ట్‌ఏక్' పాటతో బోనీకి మొదటి బ్రేక్ వచ్చింది. 1983లో వచ్చిన 'టోటల్ ఎలిప్స్ ఆఫ్ ది హార్ట్' సాంగ్ ఆమెను రాత్రికి రాత్రే అంతర్జాతీయ స్టార్‌ను చేసింది. జిమ్ స్టెయిన్‌మాన్ రాసి, నిర్మించిన ఈ పవర్‌ఫుల్ మెలోడీ పాట అమెరికా, బ్రిటన్ మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచింది.
మన దేశంలోని ఇంగ్లీష్ మ్యూజిక్ లవర్స్, ముఖ్యంగా 80, 90ల తరం వారు ఈ పాటను ఎంతో ఇష్టపడతారు. ఆ తర్వాత 1984లో వచ్చిన 'ఫుట్‌లూజ్' సినిమా సౌండ్‌ట్రాక్ కోసం పాడిన 'హోల్డింగ్ అవుట్ ఫర్ ఎ హీరో' పాట ఆమెను అగ్రశ్రేణి పాప్ స్టార్ల సరసన నిలబెట్టింది. గ్లోబల్ పాప్ హిస్టరీలో ఈ పాటలు మైలురాళ్లుగా నిలిచిపోయాయి.
బ్రిటన్ ప్రధానమంత్రి సంతాపం
బోనీ టైలర్ మృతి పట్ల బ్రిటన్ ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బ్రిటన్ అందించిన అత్యంత గొప్ప రికార్డింగ్ ఆర్టిస్టులలో ఆమె ఒకరని కొనియాడారు.
"బోనీ టైలర్ మరణవార్త వినడం ప్రధానమంత్రిని తీవ్రంగా కలచివేసింది. బ్రిటన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఆమె ఒక ఐకానిక్ ఫిగర్. ఆమె మనకు అందించిన ఎన్నో పాటలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. అవి డ్యాన్స్ ఫ్లోర్‌లను ఊపేస్తూ, కచేరీలను నింపుతూ ప్రజల జీవితాలను స్పృశిస్తూనే ఉంటాయి" అని ప్రధానమంత్రి అధికారిక ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బోనీ టైలర్ 2013లో జరిగిన ప్రతిష్టాత్మక 'యూరోవిజన్ సాంగ్ కాంటెస్ట్' లో బ్రిటన్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. వయసు పైబడినప్పటికీ ఆమె చివరి వరకు కొత్త అల్బమ్‌లు రికార్డ్ చేస్తూ, వరల్డ్ టూర్లు చేస్తూనే ఉన్నారు.
చివరి ఆల్బమ్
బోనీ టైలర్ కెరీర్‌లో చివరి స్టూడియో ఆల్బమ్ 'ది బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్' 2021లో విడుదలైంది. వెస్ట్రన్ మ్యూజిక్ హిస్టరీలో తనదైన ముద్ర వేసిన బోనీ టైలర్ మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది పాప్ సంగీత ప్రియులకు తీరని లోటు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


