S Janaki: గానకోకిల ఎస్.జానకి కన్నుమూత-60 ఏళ్ల సంగీత ప్రస్థానానికి ముగింపు- పద్మభూషణ్‌ను తిరస్కరించిన ఆమె ప్రయాణం ఇదీ!

S Janaki: దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన గాత్రంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ‘గానకోకిల’, లెజెండరీ సింగర్ ఎస్.జానకి ఇక లేరు. ఆరు దశాబ్దాల పాటు సాగిన ఆమె మ్యాజికల్ మ్యూజికల్ జర్నీ, పద్మభూషణ్ ను తిరస్కరించిన ధీరత్వం, ఆమె కుటుంబ నేపథ్యంపై హెచ్‌టీ తెలుగు ప్రత్యేక ఎడిటోరియల్ ట్రిబ్యూట్.

Published on: Jul 11, 2026, 20:31:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

S Janaki: భారతీయ సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. ‘నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా’గా, ‘జానకమ్మ’గా కీర్తి పొందిన వెటరన్ ప్లేబ్యాక్ సింగర్ ఎస్.జానకి తన 88వ ఏట తుదిశ్వాస విడిచారు. ఇవాళ (జూలై 11) మైసూర్ లో కన్నమూశారు.

ఎస్.జానకమ్మ కన్నుమూత (x)
ఎస్.జానకమ్మ కన్నుమూత (x)

లోకాన్ని వదిలిన జానకమ్మ

కొన్ని వేల పాటలతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న లెజండరీ సింగర్ ఎస్.జానకి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు అప్సర ఇన్ స్టాగ్రామ్ పోస్టు ద్వారా వెల్లడించింది. ఫ్యామిలీ ప్రేమ మధ్య జానకమ్మ ప్రశాంతంగా కన్నుమూశారని ఆమె పేర్కొంది.

పద్మభూషణ్‌ను తిరస్కరించిన ధీరత్వం

జానకమ్మ కేవలం సింగర్ మాత్రమే కాదు.. ఆమె ఓ ధీర వనిత కూడా. 2013లో కేంద్ర ప్రభుత్వం ఎస్.జానకికి దేశంలోనే మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మభూషణ్’ (Padma Bhushan) అవార్డును ప్రకటించింది. అయితే, ఆమె ఆ అవార్డును స్వీకరించడానికి నిరాకరించి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు.

సాధారణంగా అవార్డులు వస్తే ఎగబడే ఈ రోజుల్లో, జానకమ్మ దానిని తిరస్కరించడం వెనుక ఒక బలమైన ఆత్మగౌరవ పోరాటం ఉంది. భారతీయ సంగీతానికి తాను అందించిన సుదీర్ఘ సేవలకు గాను, తనకు దేశంలోనే అత్యున్నత పురస్కారమైన ‘భారత రత్న’ (Bharat Ratna) దక్కాలని, ఈ గుర్తింపు చాలా ఆలస్యంగా వచ్చిందని ఆమె బహిరంగంగానే పేర్కొన్నారు.

ఈ అవార్డులు

దక్షిణాది కళాకారులకు కేంద్ర అవార్డుల ఎంపికలో జరిగే పక్షపాతాన్ని ప్రశ్నించిన తొలి గొంతుకగా జానకమ్మ నిలిచారు. తన కెరీర్‌లో ఆమె ఏకంగా 4 జాతీయ చలనచిత్ర అవార్డులను (National Film Awards), వివిధ రాష్ట్రాల నుంచి 33 స్టేట్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నారు.

ఆరు దశాబ్దాల సామ్రాజ్యం!

జానకమ్మ ఏప్రిల్ 23, 1938న బ్రిటిష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీ (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్) పరిధిలోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా ‘పల్లాపట్ల’ గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి శిస్ట్లా శ్రీరామమూర్తి ఆయుర్వేద వైద్యుడిగా, ఉపాధ్యాయుడిగా పనిచేశారు.

ఆమె బాల్యమంతా సిరిసిల్లలో గడిచింది. కేవలం 9 ఏళ్ల వయసులోనే ఆమె తొలిసారిగా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.

ట్విస్ట్ ఏంటంటే

జానకమ్మ ఎప్పుడూ శాస్త్రీయ సంగీతంలో ఎలాంటి అధికారిక శిక్షణ తీసుకోలేదు. పైడిస్వామి అనే నాదస్వరం విద్వాంసుడి వద్ద కేవలం సంగీత ప్రాథమిక సూత్రాలు మాత్రమే నేర్చుకున్నారు. అయినప్పటికీ, ఆమె గొంతులో ఉన్న దైవిక శక్తే ఆమెను లెజెండ్‌గా మార్చింది.

తెలుగు ఆమె మాతృభాష అయినప్పటికీ, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలను అనర్గళంగా మాట్లాడటమే కాకుండా అద్భుతంగా రాసేవారు.

ప్లేబ్యాక్ కెరీర్

తన 19వ ఏట ‘విధియిన్ విలయాత్తు’ (1957) అనే తమిళ చిత్రంతో ప్రస్థానాన్ని ప్రారంభించిన జానకమ్మ.. ఆ ఒక్క సంవత్సరంలోనే ఆరు విభిన్న భాషల్లో పాటలు పాడి రికార్డు సృష్టించారు. 1959లో వి.రాంప్రసాద్‌ను వివాహం చేసుకోగా, ఆయన ఆమె కెరీర్‌కు ఎంతో సపోర్ట్ ఇచ్చారు (ఆయన 1997లో కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు).

2016లో జానకమ్మ లైవ్ స్టేజ్ షోలు, ఫిల్మ్ రికార్డింగుల నుండి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, మళ్లీ 2018లో ‘పన్నాడి’ అనే తమిళ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక పాట పాడి, తన 60 ఏళ్ల సుదీర్ఘ సంగీత లెగసీకి పర్ఫెక్ట్ ఎండ్ కార్డ్ వేశారు. ఆమె తన ఆరు దశాబ్దాల సంగీత ప్రయాణంలో 20 భాషల్లో 48 వేలకు పైగా పాటలు పాడారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More