మలయాళం సినిమా ఇండస్ట్రీకి గ్యాస్ సిలిండర్ల దెబ్బ.. ఆగిపోనున్న 18 సినిమాల షూటింగ్.. రూ.5 కోట్ల నష్టం

మలయాళం సినిమా ఇండస్ట్రీకి ఎల్పీజీ సిలిండర్ల కొరత గట్టిగానే తగులుతోంది. దీని కారణంగా ఏకంగా 18 సినిమాల షూటింగ్ రిస్క్ లో పడింది. ఏకంగా రూ.5 కోట్ల నష్టం తలెత్తే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది.

Published on: Mar 14, 2026, 11:01:23 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మిడిల్ ఈస్ట్ లో అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు నేరుగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్ 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్'ను దిగ్బంధించడంతో ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడి, దేశంలో ఎల్‌పీజీ (LPG) సిలిండర్ల కొరత తీవ్రమైంది. ఈ సంక్షోభం సినీ సెట్‌లకు పాకడంతో షూటింగ్‌లు సజావుగా సాగడం కష్టతరంగా మారింది.

మలయాళం సినిమా ఇండస్ట్రీకి గ్యాస్ సిలిండర్ల దెబ్బ.. ఆగిపోనున్న 18 సినిమాల షూటింగ్.. రూ.5 కోట్ల నష్టం (HT_PRINT)
మలయాళం సినిమా ఇండస్ట్రీకి గ్యాస్ సిలిండర్ల దెబ్బ.. ఆగిపోనున్న 18 సినిమాల షూటింగ్.. రూ.5 కోట్ల నష్టం (HT_PRINT)

కేరళలో 18 సినిమాల షూటింగ్‌లకు బ్రేక్?

ఎల్‌పీజీ కొరత వల్ల కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (KFPA) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సుమారు 18 మలయాళ సినిమాలు నిలిచిపోయే ప్రమాదంలో ఉన్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు బి. రాకేశ్ తెలిపారు. సెట్స్‌లో పనిచేసే వందలాది మంది సిబ్బందికి భోజన వసతి కల్పించడం ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్‌లకు పెద్ద సవాలుగా మారింది.

"మా దగ్గర మరో రెండు రోజులకు సరిపడా స్టాక్ మాత్రమే ఉంది. ఈ లోపు సరఫరా పునరుద్ధరించబడకపోతే షూటింగ్‌లు ఆపేయడం తప్ప మరో మార్గం లేదు. దీనివల్ల నిర్మాతలకు సుమారు రూ. 5 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంది" అని రాకేశ్ వివరించారు. ఒక్కసారి షూటింగ్ మధ్యలో ఆగిపోతే, మళ్లీ అందరి కాల్షీట్లు సర్దుబాటు చేయడం, లాజిస్టిక్స్ చూసుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పని.

కట్టెల పొయ్యిలే దిక్కు..

గ్యాస్ సిలిండర్ల కొరతను అధిగమించేందుకు ప్రస్తుతం కొన్ని సెట్లలో వంటవారు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. సాధారణంగా సినిమా సెట్స్‌లో తెల్లవారుజామున 3 గంటలకే వంట పనులు మొదలైతేనే, ఉదయం 7:30 కల్లా సిబ్బందికి బ్రేక్‌ఫాస్ట్ అందుతుంది. ప్రాజెక్ట్ స్థాయిని బట్టి రోజుకు 100 నుండి 250 మందికి భోజనాలు సిద్ధం చేయాల్సి ఉంటుంది.

మలయాళ చిత్రాలే కాకుండా తిరువనంతపురంలో షూటింగ్ జరుపుకుంటున్న ఒక హిందీ సినిమా, ఎడకొచ్చిలో జరుగుతున్న ఒక తమిళ సినిమా కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి.

సినిమా సెట్ మెనూ ఎలా ఉంటుంది?

సినిమా సెట్లలో అందించే భోజనం గురించి క్యాటరర్ రోహిత్ యాదవ్ గతంలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సాధారణంగా సెట్లలో వడ్డించే మెనూలో ఇవి ఉంటాయి. అన్నం, ఖిచిడీ, చపాతీ, పాపడ్, ఆలూ గోబీ, బటర్ చికెన్, పెరుగు, సలాడ్, ఫ్రూట్ కస్టర్డ్ లాంటివి ఉంటాయి.

పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని భాషల సినిమాల షూటింగ్‌లపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఏటా 2,000కు పైగా సినిమాలను నిర్మించే భారతీయ సినీ పరిశ్రమకు ఈ ఎల్‌పీజీ సంక్షోభం పెను సవాలుగా మారింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More