...
...
Next Story

Malayalam Web Series: ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కోర్టు ఆవరణలో ఆత్మహత్య, మిస్టరీ.. సత్యమేవ ఎలా ఉందంటే?

Malayalam Web Series: జీ5లో ఈరోజు (శుక్రవారం, నవంబర్ 27) నుంచి స్ట్రీమింగ్ అవుతున్న మలయాళ కోర్ట్‌రూమ్ ఎమోషనల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'సత్యమేవ' (Sathyameva) ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ 6 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ కోర్టు ఆవరణలో ఓ వ్యక్తి ఆత్మహత్య, దాని వెనుక మిస్టరీ చుట్టూ తిరుగుతుంది.

Published on: Nov 27, 2026, 12:35:41 IST
Advertisement

Malayalam Web Series: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే కోర్ట్‌రూమ్ డ్రామాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. గతంలో 'ముత్తశ్శి' వంటి ఆసక్తికర సిరీస్‌ను అందించిన ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (ZEE5).. తాజాగా 'సత్యమేవ' (Sathyameva) అనే సరికొత్త కోర్ట్‌రూమ్ ఎమోషనల్ డ్రామా వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది.

Malayalam Web Series: ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కోర్టు ఆవరణలో ఆత్మహత్య, మిస్టరీ.. సత్యమేవ ఎలా ఉందంటే?
Malayalam Web Series: ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కోర్టు ఆవరణలో ఆత్మహత్య, మిస్టరీ.. సత్యమేవ ఎలా ఉందంటే?

విలక్షణ నటుడు రోనీ డేవిడ్ రాజ్ ప్రధాన పాత్రలో, దీపు కరుణాకరన్ దర్శకత్వంలో అరోమా బాబు ఈ సిరీస్‌ను నిర్మించారు. కేఎస్ అరవింద్ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ 6 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.

సత్యమేవ స్టోరీ ఏంటంటే?

సాధారణంగా కోర్ట్‌రూమ్ డ్రామాలు అనగానే లాయర్ల మధ్య జరిగే హోరాహోరీ వాదనలు, పదునైన డైలాగులు గుర్తుకువస్తాయి. కానీ 'సత్యమేవ' కేవలం మాటల గారడీ కాకుండా, మనిషి జీవితంలోని నిస్సహాయత, భావోద్వేగాల చుట్టూ అల్లుకున్న ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.

కోర్టు ఆవరణలో అత్యంత నిస్సహాయ స్థితిలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో కథ మొదలవుతుంది. అసలు పేరు, ఊరు కూడా తెలియని ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? అతను కోర్టు ప్రాంగణంలోనే ఎందుకు ప్రాణాలు తీసుకున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానం వెతికే క్రమంలో కథ ముందుకు సాగుతుంది.

ఈ దర్యాప్తు ప్రయాణంలో అతనికి సంబంధించిన పలువురి జీవితాలు, వారి కష్టాలు, దాగి ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఆ ఆరు ఎపిసోడ్ల ప్రయాణం ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుంది.

రోనీ డేవిడ్ రాజ్, జయరాజ్, బిన్నీ అద్భుత నటన

ఈ వెబ్ సిరీస్‌లో అత్యంత ఆకట్టుకునే పాత్రలు జయరాజ్ కోజికోడ్ పోషించిన 'విజయన్', బిన్నీ సెబాస్టియన్ నటించిన 'అమృత'. ఒక తండ్రి నిస్సహాయతను జయరాజ్ అలవోకగా పండించగా, అమృత పాత్రలో బిన్నీ సెబాస్టియన్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ నటనను కనబరిచారు.

దర్శకుడు దీపు కరుణాకరన్ స్వయంగా ఒక కీలక పాత్రలో మెరవగా.. సోహన్ సీనులాల్, మీనాక్షి ఉన్నికృష్ణన్, మీరా నాయర్, రమ్య సురేష్, అజిత్ ధన్వంతరి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సత్యమేవ వెబ్ సిరీస్.. ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే

ప్లస్ పాయింట్స్: కథలోని ఎమోషనల్ డెప్త్ ఈ వెబ్ సిరీస్‌కు అతిపెద్ద ప్లస్. ముఖ్యంగా ప్రకాష్ రాణా సినిమాటోగ్రఫీ, అక్షయ్ కుమార్ ఎంజే ఎడిటింగ్ బాగున్నాయి. కథలో ఐదేళ్ల ముందు, ఐదేళ్ల తర్వాతి కాలాన్ని మార్చి చూపించే సన్నివేశాలను ప్రేక్షకులకు ఎక్కడా గందరగోళం కలగకుండా ఎడిటర్ అద్భుతంగా బ్లెండ్ చేశారు.

మైనస్ పాయింట్స్: జొనాథన్ బ్రూస్ అందించిన బీజీఎం వెబ్ సిరీస్‌కు థ్రిల్లింగ్ ఎనర్జీని ఇచ్చినప్పటికీ, కొన్ని సున్నితమైన ఎమోషనల్ సన్నివేశాల్లో ఆ థ్రిల్లర్ మ్యూజిక్ కాస్త అసందర్భంగా అనిపిస్తుంది. అలాగే తొలి ఎపిసోడ్లలో కథ నెమ్మదిగా సాగడం కొంత ల్యాగ్‌గా అనిపించవచ్చు. క్లైమాక్స్‌లో కొన్ని అంశాలు కాస్త అసహజంగా అనిపించినా, వాటికి సరైన వివరణ ఇస్తూ ముగించడం ఊరటనిస్తుంది.

అనవసరమైన పోలికలకు వెళ్లకుండా చూస్తే.. 'సత్యమేవ' ఒక హృదయాన్ని హత్తుకునే చక్కటి కోర్ట్‌రూమ్ డ్రామా. వీకెండ్‌లో ఆలోచింపజేసే, భావోద్వేగభరితమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూడాలనుకునే వారు జీ5లో దీనిని తప్పకుండా ప్రయత్నించవచ్చు. అయితే ఇది కేవలం మలయాళం ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో మాత్రమే అందుబాటులో ఉంది.

 

ABOUT THE AUTHOR

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks