Netflix Movie: కంజూస్ మొగుడు.. రూ.5 వేల టోస్టర్.. నెట్‌ఫ్లిక్స్‌లోకి నేరుగా వస్తున్న సూపర్ ఫన్ మూవీ.. స్ట్రీమింగ్ ఆరోజే
Netflix Movie: నెట్‌ఫ్లిక్స్ లోకి ఓ సూపర్ ఫన్ మూవీ వస్తోంది. ఈ సినిమా పేరు టోస్టర్. ఈ సినిమా ఏప్రిల్ 15 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చెబుతూ నెట్‌ఫ్లిక్స్ ఓ ఫన్నీ డేట్ అనౌన్స్‌మెంట్ వీడియోను రిలీజ్ చేసింది.
పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు సరదాగా బహుమతులు ఇచ్చి రావడం మనందరికీ అలవాటే. కానీ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఆ పెళ్లి కాస్తా ఆగిపోతే.. ఆ ఇచ్చిన బహుమతిని ఎలాగైనా వెనక్కి తెచ్చుకోవాలని ఎవరైనా పట్టుబడితే ఎలా ఉంటుంది? వినడానికే చాలా క్రేజీగా ఉంది కదా. సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌తో నెట్‌ఫ్లిక్స్ మన ముందుకు 'టోస్టర్' అనే ఒక ఇంట్రెస్టింగ్ డార్క్ కామెడీ సినిమాను తీసుకురాబోతోంది. ఏప్రిల్ 15, 2026న స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమాలో.. మనం రోజూ ఇంట్లో వాడే ఒక చిన్న వస్తువు చుట్టూ ఎలాంటి ఊహించని సంఘటనలు జరిగాయన్నది చాలా ఫన్నీగా చూపించబోతున్నారు.

టోస్టర్ సినిమా ఓటీటీ వివరాలు ఇవే
సినిమా పేరు: టోస్టర్
ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్
స్ట్రీమింగ్ తేదీ: ఏప్రిల్ 15, 2026
దర్శకుడు: వివేక్ దాస్ చౌదరి
నటీనటులు: రాజ్‌కుమార్ రావ్, సాన్యా మల్హోత్రా, అర్చన పూరన్ సింగ్, అభిషేక్ బెనర్జీ, ఫరా ఖాన్, సీమా పహ్వా తదితరులు.
టోస్టర్.. అసలు ఈ మహా కంజూస్ కథేంటి?
ఈ టోస్టర్ సినిమాలో రమాకాంత్ అనే ఒక మహా పిసినారి (కంజూస్) క్యారెక్టర్‌లో రాజ్‌కుమార్ రావ్ నటిస్తున్నాడు. ఈ పిసినారితనం అనేది కేవలం అతని క్యారెక్టర్‌లో ఒక చిన్న లక్షణం మాత్రమే కాదు, అతని జీవితాన్ని నడిపించే మెయిన్ ఫోర్స్. ఒక పెళ్లికి వెళ్లిన రమాకాంత్, సాన్యా మల్హోత్రాలు కొత్త జంటకు రూ.5 వేలు విలువ చేసే ఒక టోస్టర్ బహుమతిగా ఇస్తారు.
అయితే ఆ పెళ్లి ఆగిపోవడంతో తను ఇచ్చిన టోస్టర్‌ను ఎలాగైనా తిరిగి లాక్కోవాలని రమాకాంత్ పడే ఆరాటం అంతా ఇంతా కాదు. ఆ చిన్న వస్తువు కోసం అతను చేసే ప్రయత్నాలు చివరికి ఊహించని మర్డర్ మిస్టరీలు, ప్రమాదాలు, దాగి ఉన్న రహస్యాలు బయటపడే స్థాయికి వెళ్తాయి.
ప్రోమో వీడియోలో రాజ్‌కుమార్ రావ్ మ్యాజిక్..
మేకర్స్ రిలీజ్ చేసిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వీడియోలో రాజ్‌కుమార్ రావ్ తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. కెమెరా వంక చూస్తూ.. బాబోయ్ నాకు ఈ పెద్ద పెద్ద మోనోలాగ్స్ (పొడవైన డైలాగులు) చెప్పి చెప్పి బాగా విసుగొచ్చేసింది అని అంటాడు.
అంతేకాదు తాను మోనోలాగ్స్ చెప్పనని మొండికేస్తూనే సినిమా పేరు, నటీనటులు, ఏప్రిల్ 15న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అనే డీటెయిల్స్ అన్నీ ఆడియన్స్‌కు చెప్పేస్తాడు. ఇందులో తన క్యారెక్టర్ పేరు ఆర్కే.. అంటే రాజ్‌కుమార్ కాదు, రమాకాంత్ అని చాలా ఫన్నీగా ఇంట్రడ్యూస్ చేశాడు.
నిర్మాతగా మారుతున్న నటి పత్రలేఖ..
ఈ ప్రాజెక్టుకు ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. రాజ్‌కుమార్ రావ్ భార్య, నటి పత్రలేఖ ఈ సినిమాతోనే నిర్మాతగా మారుతోంది. కంపా ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆమె ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కథలో ఉన్న ఆ ఊహించని కామెడీ తనను ఎంతగానో ఆకట్టుకుందని, అందుకే ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నానని ఆమె సంతోషంగా చెప్పింది.
లూడో, హిట్ ద ఫస్ట్ కేస్ లాంటి సినిమాల తర్వాత రాజ్‌కుమార్, సాన్యా మల్హోత్రా మళ్లీ ఈ సినిమా కోసం జతకట్టారు. వివేక్ దాస్ చౌదరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అర్చన పూరన్ సింగ్, ఫరా ఖాన్ లాంటి సీనియర్లు తమదైన టైమింగ్‌తో నవ్వించబోతున్నారు. స్త్రీ సినిమాలో రాజ్‌కుమార్‌తో కలిసి అదరగొట్టిన అభిషేక్ బెనర్జీ కూడా ఇందులో ఒక స్పెషల్ క్యామియో చేస్తున్నాడు. మొత్తానికి ఏప్రిల్ 15న నెట్‌ఫ్లిక్స్‌లోకి రాబోతున్న ఈ డార్క్ కామెడీ మర్డర్ మిస్టరీ కచ్చితంగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


