Podarillu October 14 Episode: పొదరిల్లు.. మహాకు రెండో భర్తతో దొరికిపోయిన జమున.. చూసిన చక్రి.. మాధవకు మనీషా గాజులు
Podarillu October Serial 14th Episode: పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 14 ఎపిసోడ్ లో రెండో భర్తతో మాట్లాడుతూ మహాకు అడ్డంగా దొరికిపోతుంది జమున. మరోవైపు కేశవ కోసం మాధవ, చక్రి అడ్వాన్స్ సంపాదించగా.. ఇటు కొడుకు ఇచ్చిన గిఫ్ట్ చూసి జమున షాక్ తింటుంది.
Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో కేశవ కోసం మాధవ, చక్రి డబ్బు కూడబెట్టే ప్రయత్నంలో ఉండగా.. అటు జమున మాత్రం రెండో భర్త అప్పుల కోసం ఇంట్లో డబ్బు దొంగతనం చేయాలని చూస్తూ ఉంటుంది. కన్న కొడుకు ఇచ్చిన గిఫ్ట్ ను కూడా ఆమె లైట్ తీసుకుంటుంది. అయితే చివరికి మహాకు దొరికిపోతుంది.

మహా ఫోన్.. చక్రి షాక్
చక్రికి మహా ఫోన్ చేసే సీన్ తో సీరియల్ బుధవారం (అక్టోబర్ 14) ఎపిసోడ్ మొదలైంది. భోజనం చేశావా అని భార్య అడగడంతో చక్రి తెగ సంతోషపడతాడు. ఇంకా తినలేదని చెప్పడంతో మహా క్లాస్ పీకుతుంది. టైమ్ రెండున్నర అవుతున్నా ఎందుకు తినలేదని అడుగుతుంది. తన ఆరోగ్యం కోసం ఎంత టెన్షన్ పడుతుందో అని చక్రి మనసులో మురిసిపోతాడు. కానీ అసలు విషయం తెలిసి షాక్ తింటాడు.
మీరు భోజనం చేయడానికి ఇంటికి వెళ్తారు కదా.. అసలు ఆ సుపుత్ర ఆమెతో ఎలా ఉన్నాడో తెలుసుకొని చెబుతారని అనుకున్నాను.. ఉదయం ఆమెపై తెగ అరిచాడు కదా.. ఇప్పుడెలా ఉన్నారో తెలుసుకుందామని అని మహా అనడంతో చక్రి ఉసూరుమంటాడు. అందుకే ఇంత ఆలస్యం ఎందుకు చేశారని అడిగినట్లు చెబుతుంది. అది విన్న చక్రి తాను వెళ్లనని, భోజనం చేయనని అంటాడు. సరే మీ ఇష్టం అని చెప్పి మహా ఫోన్ పెట్టేయడంతో చక్రికి మరింత కుంగిపోతాడు.
మాధవకు సాయం చేయడానికి ఇంజినీర్ హామీ
మరోవైపు మాధవకు మనీషా భోజనం వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడే బన్సీ వచ్చి ఇంజినీర్ పిలుస్తున్నాడని చెప్పడంతో అతడు వెళ్తాడు. పనులు ఎలా జరుగుతున్నాయని అడిగిన తర్వాత.. అడ్వాన్స్ అడిగావట ఎందుకు అని ఇంజినీర్ అడుగుతాడు.
తన తమ్ముడు మెకానిక్ అని, తాను లీజుకు తీసుకున్న స్థలాన్ని కొనడానికి డబ్బు కావాలని అంటాడు. ఎంత కావాలి అంటే.. రూ.7 లక్షల వరకు అవసరమవుతాయని మాధవ అంటాడు. అంత అయితే కష్టం కానీ.. నాకు సాధ్యమైనంత వరకు ఇస్తానని ఇంజినీర్ హామీ ఇచ్చి వెళ్తాడు.
మాధవకు గాజులు ఇచ్చిన మనీషా
అప్పుడే మాధవ దగ్గరికి వచ్చిన మనీషా తన గాజులు తీసి ఇస్తుంది. వీటిని అమ్మి డబ్బు తీసుకోండి అని చెబుతుంది. అది విని మాధవ షాక్ తింటాడు. నీకెలా తెలుసు అని అడిగితే.. ఇంజినీర్ తో మాట్లాడుతుంటే విన్నానని, తీసుకోండి అని మనీషా అంటుంది. మాధవ మాత్రం వద్దని వారిస్తాడు. డబ్బు సర్దుబాటు అవుతుందిలే అంటాడు. అయినా ఇన్నాళ్లూ తన తమ్ముళ్లకు ఎలాంటి వదిన వస్తుందో అని టెన్షన్ పడ్డానని, అమ్మే వస్తుందని అనడంతో మనీషా మురిసిపోతుంది.
జమున విషయం శైలుకి చెప్పిన కేశవ
అటు బుస్సుతో కలిసి ముంగిస బైకుపై వెళ్తుంటాడు. అతడు చాలా ఆనందంగా ఉండటంతో నా వల్లే ఇంత సంతోషంగా ఉన్నావా అని అడుగుతుంది. కాదు.. మా ఇంటికి ఆమె వచ్చిన తర్వాతే ఇలా ఉన్నానని కేశవ అంటాడు. ఆమె అంటే మరొకరిని చూసుకున్నావా.. ఇంటికే తెచ్చుకున్నావా అని శైలు అంటుంది. దీంతో జమున విషయం చెబుతాడు. కన్నా వాళ్ల అమ్మ ఇంటికి వచ్చిందని, ఆమె వల్లే తామందరం సంతోషంగా ఉన్నామని అంటాడు. కన్నా వాళ్ల అమ్మ ఏంటి.. మీ అమ్మ కూడా కదా అని శైలు అడుగుతుంది.
కాదు.. మా నాన్నకు ఇద్దరు భార్యలు.. కన్నా వాళ్ల అమ్మ వేరే అని కేశవ చెబుతాడు. తనకు ఇన్నాళ్లూ ఆ విషయం ఎందుకు చెప్పలేదని శైలు అడిగితే.. ఆ అవసరం రాలేదని అంటాడు. అయినా మా ఇంటికి మహాలక్ష్మి వచ్చినప్పటి నుంచీ అంతా మంచే జరుగుతోందని కేశవ అనడంతో శైలు కుళ్లుకుంటుంది. తాను వచ్చిన తర్వాత మంచి జరగడం లేదా అని నిలదీస్తుంది. సరే నువ్వు వచ్చాక కూడా నా జీవితంలో మంచి జరుగుతోందని కేశవ అంటాడు. అప్పుడే బైక్ ఆగిపోతుంది.
ఓనర్‌ను అడ్వాన్స్ అడిగిన చక్రి.. తమ్ముడిని బుట్టలో పడేసి..
మరోవైపు కేశవ కోసం ఓనర్ ను అడ్వాన్స్ అడుగుతాడు చక్రి. కానీ అక్కడ ఓనర్ ఓంకారేశ్వర్ బదులు అతని తమ్ముడు శ్రీకారేశ్వర్ ఉంటాడు. అతన్ని చిన్న కారేశ్వర్ అని పిలుస్తాడు. దీంతో అతనికి మరింత మండుతుంది. అడ్వాన్స్ విషయం అడిగితే.. నీకు తప్ప ఎవరికైనా ఇవ్వమని అన్న చెప్పి వెళ్లాడని, అస్సలు కుదరదని అంటాడు.
దీంతో చక్రి డ్రామా మొదలు పెడతాడు. నీకు యాక్సిడెంట్ జరిగినప్పుడు మీ అన్న బాధపడుతుంటే.. నా రక్త ఇచ్చాను.. నీలోనూ నా రక్తమే ఉంది.. అయినా మా తమ్ముడి షాపు కోసం అడ్వాన్స్ అడిగితే ఇవ్వరా అని చక్రి అంటాడు. ఆ సెంటిమెంట్ కు శ్రీకారేశ్వర్ కరిగిపోయి.. మా అన్న నాకోసం బిజినెస్ సెట్ చేశాడు.. నువ్వు నీ తమ్ముడి కోసం అంటున్నావు కాబట్టి ఇస్తున్నానని డబ్బు ఇస్తాడు.
నారాయణ వల్లే వెళ్లిపోయానని కన్నాకు చెప్పిన జమున
ఇటు ఇంటికి వచ్చిన కన్నా.. అమ్మా అమ్మా అని పిలుస్తాడు. జమున పలకకపోవడంతో గట్టిగా పిలుస్తాడు. దీంతో ఆమె వస్తుంది. ఏమైందని అడిగితే నువ్వు మళ్లీ వెళ్లిపోయావేమోనని అనుకున్నానని అంటాడు. తాను ఎక్కడికీ వెళ్లనని అంటుంది. చిన్నప్పుడే తనను ఎందుకు వదిలి వెళ్లావని కన్నా మరోసారి అడుగుతాడు.
దీంతో మీ నాన్న వల్లే వెళ్లిపోయానని చెబుతుంది. నారాయణ తాగి వచ్చేవాడని, కొట్టేవాడని, మొదటి భార్యను చంపేశాడని తెలిసి మరింత భయపడ్డానని, ఓసారి కత్తితో చంపడానికి వస్తే చుట్టుపక్కల వాళ్లు అడ్డుకున్నారని చెబుతుంది. దీంతో భయంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయానని, నిన్ను మాధవ బాగా చూసుకుంటాడన్న నమ్మకంతో తన వెంట తీసుకెళ్లలేదని చెబుతుంది.
తల్లికి కన్నా గిఫ్ట్.. నెత్తికేసి కొట్టువాలా అంటూ..
ఆ తర్వాత నీ కోసం ఓ గిఫ్ట్ తెచ్చానని కన్నా అంటాడు. ఆ గిఫ్ట్ ఏంటో అని జమున ఆశగా చూస్తుంది. ఓ తల్లీకొడుకుల బొమ్మను తీసుకొచ్చి ఇస్తాడు. అది చూసి దీనినేం చేసుకోవాలి.. నెత్తికేసి కొట్టుకోవాలా.. కనీసం బంగారు రింగు ఇస్తేనన్నా బాగుండేది అని మనసులో అనుకుంటుంది. ఇష్టం లేకపోయినా ఆ బొమ్మ తీసుకుంటుంది.
రెండో భర్తకు ఫోన్.. మహాకు దొరికిపోయి..
అటు రాత్రి వేళ రెండో భర్త జమునకు ఫోన్ చేస్తాడు. డబ్బు సంగతేమైందని అడుగుతాడు. ఇప్పటి వరకూ చిల్లర మాత్రమే దొరికిందని ఆమె చెబుతుంది. జమున బయటకు వెళ్లి అనుమానాస్పదంగా మాట్లాడటం చూసి మహా కిటికీలో నుంచి చూస్తుంది. డబ్బు దొరకగానే వస్తానని జమున చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. వెనక్కి తిరిగి చూసే సరికి మహా ఉంటుంది. దీంతో జమున షాక్ తింటుంది. వాళ్లను చక్రి కూడా చూస్తాడు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


