ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు.. ఆ సీన్ చూసి మా అమ్మ ఏడ్చేసింది: రాఖ్ సిరీస్ విలన్

Raakh Web Series: ప్రైమ్ వీడియోలో వచ్చిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాఖ్ లో విలన్ బాబు పాత్ర పోషించిన ఆకాశ్ మఖీజా తనకు ఇప్పుడు వస్తున్న బెదిరింపుల గురించి మాట్లాడాడు. ఈ సిరీస్ లో అద్భుతంగా నటించిన అతడు.. తన పాత్రను ఎంతలా ద్వేషిస్తున్నారో చెప్పుకొచ్చాడు.

Published on: Jun 19, 2026, 17:05:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Raakh Web Series: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతూ గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ సృష్టిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'రాఖ్' (Raakh) ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్‌లో అత్యంత క్రూరమైన విలన్ 'బాబు' పాత్రలో నటించిన యంగ్ యాక్టర్ ఆకాష్ మఖిజా తన నటనతో దేశవ్యాప్తంగా అందరినీ భయపెడుతున్నాడు.

ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు.. ఇన్‌స్టా ఓపెన్ చేస్తే అన్నీ అవే: రాఖ్ సిరీస్ విలన్
ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు.. ఇన్‌స్టా ఓపెన్ చేస్తే అన్నీ అవే: రాఖ్ సిరీస్ విలన్

అయితే ఈ క్యారెక్టర్‌కు వస్తున్న విపరీతమైన రెస్పాన్స్ కారణంగా ఆకాష్ మఖిజాకు ఇప్పుడు నిజ జీవితంలో ఊహించని తలనొప్పులు మొదలయ్యాయి. ప్రేక్షకులు ఈ పాత్రను ఎంతలా అసహ్యించుకుంటున్నారంటే, ఏకంగా నటుడికి చంపేస్తామంటూ బెదిరింపు సందేశాలు పంపిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆకాష్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించి అందరినీ షాక్‌కు గురిచేశాడు.

ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌బాక్స్ నిండా అవే మెసేజ్‌లు!

రీసెంట్‌గా జూమ్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆకాష్ మఖిజా మాట్లాడుతూ తన పాత్రకు వస్తున్న రెస్పాన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "సాధారణంగా నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నా వర్క్‌ను నేనే ఎక్కువగా విమర్శించుకుంటాను. నన్ను నేను సరిగ్గా అంచనా వేసుకోలేను, పైగా నాకు ఇప్పటివరకు ఈ సిరీస్ పూర్తిగా చూసే టైమ్ కూడా దొరకలేదు. కానీ ఆడియన్స్ ఇస్తున్న రివ్యూలు నాకు పెద్ద వాలిడేషన్ లాంటివి. ప్రస్తుతం నేను ఎప్పుడు నా ఇన్‌స్టాగ్రామ్ డీఎమ్ (Direct Message) ఓపెన్ చేసినా, అక్కడ జనాలు నన్ను చంపేస్తామంటూ మెసేజ్‌లు పెడుతున్నారు. నన్ను అంతలా ద్వేషిస్తున్నారు" అని చెప్పుకొచ్చాడు.

హీరో నన్ను కొడుతుంటే చప్పట్లు!

ప్రేక్షకులు కథతో, తన పాత్రతో అంతలా కనెక్ట్ అవ్వడం వల్లే ఈ రేంజ్ నెగెటివిటీ వస్తోందని ఆకాష్ భావిస్తున్నాడు.

"చంపుతామన్న బెదిరింపులు మాత్రమే కాదు, ఇంకా ఏదేదో మెసేజ్‌లు వస్తున్నాయి. కానీ ఆడియన్స్ బాబు పాత్రను యాక్సెప్ట్ చేశారనడానికి ఇదే నిదర్శనం. ప్రస్తుతం దేశంలోనే అత్యంత అసహ్యించుకునే క్యారెక్టర్ నాదేనని నాకు అర్థమైంది. కొందరైతే.. స్క్రీన్ మీద ఎస్ఐ జయప్రకాష్ (అలీ ఫజల్) నిన్ను పట్టుకుని చితక్కొడుతుంటే మేము ఇళ్లల్లో చప్పట్లు కొట్టి సెలబ్రేట్ చేసుకున్నాం అని మెసేజ్ చేశారు.

ఇదంతా చూస్తుంటే నా నటన సక్సెస్ అయిందనిపిస్తోంది" అని ఆకాష్ ఆనందం వ్యక్తం చేశాడు.

కొడుకును కొడుతుంటే ఏడ్చేసిన తల్లి.. ఆ తర్వాత ట్విస్ట్!

ఈ ఇంటర్వ్యూలో ఆకాష్ తన ఇంట్లో జరిగిన ఒక ఫన్నీ అండ్ ఎమోషనల్ ఇన్సిడెంట్‌ను కూడా షేర్ చేసుకున్నాడు.

"మా అమ్మ ఈ షో చూస్తున్నప్పుడు చాలా ఎమోషనల్ అయింది. అయితే స్క్రీన్ మీద అలీ ఫజల్ నన్ను దారుణంగా కొడుతున్న సీన్ వచ్చినప్పుడు అమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి, చాలా బాధపడింది. విలన్ అయినా సరే కొడుకును కొడుతుంటే తట్టుకోలేకపోయింది. అదే అమ్మ మమకారం" అంటూ ఆకాష్ ఎమోషనల్ అయి నవ్వేశాడు.

ఎంత దారుణమైన మెసేజ్‌లు వస్తున్నా, ఒక నటుడిగా తను అనుకున్న ఇంపాక్ట్‌ను స్క్రీన్ మీద చూపించగలిగాననే తృప్తి అతనిలో కనిపిస్తోంది.

అసలు 'రాఖ్' సిరీస్ బ్యాక్‌డ్రాప్ ఏంటి?

రాఖ్ వెబ్ సిరీస్ భారతదేశ చరిత్రలోనే అత్యంత షాకింగ్, సంచలనం సృష్టించిన ఒక నిజ జీవిత క్రిమినల్ కేస్ ఆధారంగా తెరకెక్కింది. 1978లో దేశ రాజధాని ఢిల్లీని కుదిపేసిన గీతా చోప్రా, సంజయ్ చోప్రా అనే ఇద్దరు టీనేజ్ తోబుట్టువుల కిడ్నాప్ అండ్ మర్డర్ కేసు ఆధారంగా ఈ కథను రాసుకున్నారు. ఢిల్లీ నగరం అత్యంత సురక్షితంగా ఉన్న రోజుల్లో సుమన్ అరోరా, సాహిల్ అరోరా అనే ఇద్దరు అమాయక పిల్లలను కొందరు దుర్మార్గులు కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేస్తారు.

ఈ ఘోరానికి ఒడిగట్టిన ఇద్దరు కరడుగట్టిన నేరస్థులు రజ్జో (రమణ్‌దీప్ యాదవ్), బాబు (ఆకాష్ మఖిజా) ల పాత్రలు సమాజాన్ని ఎంతలా భయభ్రాంతులకు గురిచేశాయనేది ఇందులో అద్భుతంగా చూపించారు. పిల్లలను కోల్పోయి నరకం అనుభవించే తల్లిదండ్రులుగా సీనియర్ నటి సోనాలి బింద్రే, అమీర్ బషీర్ తమ నటనతో కన్నీళ్లు పెట్టిస్తారు.

ఈ కేసును ఛేదించి ఆ హంతకులను చట్టం ముందు నిలబెట్టడానికి ప్రాణాలు పణంగా పెట్టి పోరాడే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ జయప్రకాష్ పాత్రలో అలీ ఫజల్ విధ్వంసం సృష్టించాడు. అనుషా నందకుమార్, సందీప్ సాకేత్, ప్రోసిత్ రాయ్ సంయుక్తంగా క్రియేట్ చేసిన ఈ ఇంటెన్స్ వెబ్ సిరీస్ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ రికార్డు వ్యూస్ రాబడుతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More