Raghava Lawrence: వీధి కుక్క కూడా కరుస్తుంది.. విజయ్ టీవీకే పాలనపై రాఘవ లారెన్స్ కామెంట్స్.. వివాదం రేగడంతో వివరణ
Raghava Lawrence: రాజకీయ ఎంట్రీపై ప్రెస్ మీట్ పెట్టిన కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీకి సపోర్ట్ గా ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో పెను తుఫాను సృష్టించాయి.
Raghava Lawrence: ఇటీవలే పాలిటిక్స్ లోకి వస్తున్నట్లు ఒక వీడియో ద్వారా ప్రకటించిన రాఘవ లారెన్స్.. ఆదివారం (జూన్ 14) రాఘవేంద్ర స్వామి ఆలయం దగ్గర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తమిళనాడులో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని 'టీవీకే' (TVK) ప్రభుత్వం పనితీరుపై జర్నలిస్టులు ఆయనను ప్రశ్నించారు. దానికి లారెన్స్ స్పందిస్తూ.. కొత్త ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలని కోరారు. ఆ విషయాన్ని వివరించడానికి ఆయన చెప్పిన ఒక ఉదాహరణే ఈ పెద్ద రచ్చకు కారణమైంది.

Raghava Lawrence | అసలు ప్రెస్ మీట్‌లో ఏం జరిగింది?
ప్రభుత్వ పరిపాలనను వివరిస్తూ లారెన్స్.. "మనం ఒక కొత్త ఇల్లు కొనే ముందు ఒకటో రెండో సార్లు చూసి లోపలికి వెళ్తాం. కానీ ఆ ఇంట్లో కాపురం పెట్టాకే ఎక్కడ పైపులు లీక్ అవుతున్నాయి, ఏ ఫ్యాన్ తిరగడం లేదు వంటి లోపాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. పరిపాలన కూడా అంతే" అని పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా ఆయన ఆ ఉదాహరణను కొనసాగిస్తూ..
"మనం కొత్తగా వెళ్లిన వీధిలో ఉండే కుక్క కూడా మనల్ని చూసి మొదట్లో మొరుగుతుంది. దానికి బిస్కెట్లో లేదా బిర్యానీ ముక్కలో వేసి, అది మనతో అలవాటు పడేలా చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఒక ఇల్లు, ఒక కుక్క విషయంలోనే అంత టైమ్ పడితే.. ఒక రాష్ట్రాన్ని పాలించే బాధ్యతను ఒక పార్టీకి అప్పగించినప్పుడు వారికి ఇంకెంత సమయం ఇవ్వాలి? మార్పు కావాలని మీరే కోరుకున్నారు, ఇప్పుడు మార్పు వచ్చింది. కాబట్టి కాస్త పాజిటివ్‌గా ఆలోచించి వారికి సమయం ఇవ్వండి" అని వ్యాఖ్యానించారు.
లారెన్స్ ప్రెస్ మీట్ ముగిసిన కొద్దిసేపటికే, ఆయన మాట్లాడిన వీడియోలోని 'కుక్కల' ప్రస్తావన ఉన్న క్లిప్పింగ్ ను మాత్రమే కొందరు కట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో లారెన్స్ ప్రజలను వీధి కుక్కలతో పోల్చారంటూ నెటిజన్లు, ప్రతిపక్షాల మద్దతుదారులు విమర్శల దాడి ప్రారంభించారు. 'అధికార అహంకారం' అంటూ ఘాటుగా ట్రోల్స్ చేశారు.
నాకు అంత సంస్కారహీనత లేదు
తనపై వస్తున్న విమర్శలపై రాఘవ లారెన్స్ వెంటనే స్పందించారు. పూర్తి ప్రెస్ మీట్ వీడియోను ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ క్లారిటీ ఇచ్చారు.
"నా మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నా అభిమానులు, సామాన్య ప్రజలు నాకు అమ్మతో సమానం. నేను ప్రజలను కుక్కలని అన్నట్లుగా కొందరు తప్పుడు ప్రచారాన్ని వేగంగా వ్యాప్తి చేస్తున్నారు. ఇది పూర్తిగా అబద్ధం. నేను చెప్పింది ఒక్కటే.. కొత్త వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి ఎలా సమయం పడుతుందో, సరికొత్త ప్రభుత్వానికి కూడా పరిపాలనపై పట్టు సాధించడానికి అంతే సమయం పడుతుందని చెప్పడమే నా ఉద్దేశం. అంతేకానీ నా కన్నతల్లిలా భావించే ప్రజలను కుక్కలతో పోల్చేంత నిర్దయుడిని, సంస్కారహీనుడిని కాను. దయచేసి అరకొర క్లిప్పింగులు చూడకుండా, పూర్తి వీడియో చూసి నా నిజాయితీని అర్థం చేసుకోండి" అని లారెన్స్ విజ్ఞప్తి చేశారు.
Kanchana 4, Benz | సినిమాల్లోనూ ఫుల్ బిజీ
రాజకీయ ప్రకటనలతో హాట్ టాపిక్‌గా మారిన లారెన్స్.. సినిమాల పరంగానూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో, సొంత నిర్మాణంలో హారర్ కామెడీ ఫ్రాంచైజీలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కాంచన 4' షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
ఈ సినిమాలో నయనతార, పూజా హెగ్డే కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనితో పాటు లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లో భాగంగా తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బెంజ్' (Benz) చిత్రంలోనూ లారెన్స్ నటిస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


