ఈ సినిమా ఎవరూ చూడటం లేదన్న రాహుల్ గాంధీ.. ఇంట్లో కూర్చొని మాట్లాడొద్దంటూ బీజేపీ ఎంపీ భార్య కౌంటర్
ది కేరళ స్టోరీ 2 మూవీపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ సినిమాను ఎవరూ చూడటం లేదని రాహుల్ గాంధీ అన్నారు. దీనికి బీజేపీ ఎంపీ భార్య కాస్త గట్టిగానే కౌంటర్ ఇవ్వడం గమనార్హం.
దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్, నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా కలయికలో తెరకెక్కిన 'ది కేరళ స్టోరీ 2' ఫిబ్రవరిలో విడుదలై దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ సినిమాపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ సినిమాకు విమర్శించగా, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ భార్య సురభి తివారీ దీనిని సమాజానికి అద్దం పట్టే చిత్రమని అభివర్ణించారు.

రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ అధికారిక 'ఎక్స్' ఖాతా ది కేరళ స్టోరీ 2 మూవీపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ను షేర్ చేసింది. "ఈ సినిమాను ఎవరూ చూడటం లేదు. కేరళ సంస్కృతి, సంప్రదాయాలు ఏమిటో ఈ దేశ ప్రజలకు తెలుసని ఇది నిరూపిస్తోంది" అని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా మీడియా, సినిమాలను కొన్ని వర్గాలను కించపరచడానికి, సమాజంలో విద్వేషాలు పెంచడానికి ఆయుధాలుగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. "కొన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా, ఇతరులకు హాని కలిగించేలా కథనాలను ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా నిజం మాట్లాడాలని చూస్తే వారిపై దాడులు జరుగుతున్నాయి. నేను నిత్యం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాను" అని రాహుల్ గాంధీ ఆ వీడియోలో అనడం చూడొచ్చు.
మనోజ్ తివారీ భార్య కౌంటర్
రాహుల్ గాంధీ, ఇతర విమర్శకులపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ భార్య సురభి తివారీ మండిపడ్డారు. ఏఎన్ఐ (ANI) వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. "లోకం అన్నాక రకరకాలుగా మాట్లాడుతుంటారు. కానీ ఇంట్లో కూర్చుని విమర్శించే వారు ఒక్కసారి థియేటర్లకు వచ్చి సినిమా చూడండి. ఆ తర్వాత నిజమైన డాక్యుమెంట్లు, కేసులను చదవండి. అప్పుడు ఇది తప్పుడు ప్రచారమా లేదా సమాజానికి అద్దం పట్టే చిత్రమా అనేది మీకే అర్థమవుతుంది" అని హితవు పలికారు.
ఏ హిందూ అమ్మాయి కూడా ఈ సినిమాలో చూపించిన బాధితుల్లాంటి పరిస్థితులను ఎదుర్కోకూడదని, మనం ఒక సమాజంగా ఎక్కడున్నామో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ది కేరళ స్టోరీ 2 సినిమా నేపథ్యం, వివాదం
2023లో వచ్చిన 'ది కేరళ స్టోరీ'కి ఇది సీక్వెల్. ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించారు. మతం మారి పెళ్లి చేసుకున్న ముగ్గురు యువతులు ఏ విధంగా మోసపోయారు, వారు అనుభవించిన నరకం ఏమిటనేది ఈ సినిమా కథ.
ఈ సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తొలుత సింగిల్ బెంచ్ స్టే ఇచ్చినప్పటికీ, తదుపరి విచారణలో ధర్మాసనం స్టేను ఎత్తివేస్తూ విడుదలకు పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఈ సినిమా రాజకీయ రంగు పులుముకుని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper












