Ram Charan: పెద్దిలో ట్విస్ట్ ఉప్పెన కంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుంది.. రాజమౌళి దారి చూపారు.. 12 ఏళ్ల కల తీరింది:రామ్ చరణ్
Ram Charan: బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను చరణ్ పంచుకున్నారు. తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్, కోవిడ్ టైంలో రాజమౌళి ఇచ్చిన సలహా, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ గురించి వివరించారు.
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ పెద్దిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ జూన్ 4న రిలీజ్ కానుండగా.. తాజాగా ఈ సినిమా షూటింగ్, క్యారెక్టర్ కోసం పడ్డ కష్టం, ఆర్ఆర్ఆర్ టైంలో తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ లాంటి ఎన్నో విషయాలను రామ్ చరణ్ అభిమానులతో పంచుకున్నారు. దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి ఓ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న ఆయన సినిమాకు సంబంధించిన కొన్ని కీలక అప్డేట్స్ ఇచ్చారు.

ఆ ట్విస్ట్ ఉప్పెన కంటే 100 రెట్లు ఎక్కువ
ఈ స్పెషల్ డ్రైవ్ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. మూవీలో తనకు ఢిల్లీ ఎపిసోడ్ చాలా చాలా నచ్చిందని చెప్పారు. అసలు అందులో వచ్చే ట్విస్ట్.. ఉప్పెనలో వచ్చిన దాని కంటే వంద రెట్లు ఎక్కువ ఉంటుందని, అసలు దానిని ఎలా రాశావంటూ బుచ్చిబాబును చరణ్ అడిగారు. నిజానికి అలాంటి పరిస్థితుల్లో హీరోయిజం పడిపోతుందని, కానీ ఇక్కడ మాత్రం 50 రెట్లు పెరిగిందని బుచ్చిబాబు బదులుగా చెప్పారు.
ఒకే సినిమా.. మూడు వేరియేషన్స్
ఈ సినిమాలో తన పాత్ర కోసం రామ్ చరణ్ అక్షరాలా ప్రాణం పెట్టి పనిచేశారు. "ముందుగా ఒక క్రికెటర్ బాడీ అడిగావు.. ఆ తర్వాత అడవి కుర్రాడిలా కరుకుగా ఉండే బాడీ కావాలన్నావు.. ఆపై కుస్తీ వీరుడి లుక్ అడిగావు" అని చరణ్ బుచ్చిబాబుతో అన్నారు. ఈ మూడు వేరియేషన్స్ కోసం చరణ్ తీవ్రంగా శ్రమించారు.
ముఖ్యంగా కుస్తీ సన్నివేశాల కోసం నిజమైన పహెల్వాన్లతోనే ఫైట్స్ చేశారు. "చివరి 65 నుంచి 75 రోజుల పాటు ఎలాంటి బ్రేక్ లేకుండా హెవీ యాక్షన్ ఎపిసోడ్స్, సాంగ్స్, కుస్తీ ఫైట్స్ తీశాం. దేవుడి దయ వల్ల ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ మధ్యే నేను నటించిన చాలా సినిమాల్లో గాయపడ్డాను. కానీ ఈ పెద్ది కథలో ఉన్న మ్యాజిక్ వల్ల అలాంటిదేమీ జరగకుండా సాఫీగా సాగిపోయింది" అని చరణ్ వివరించారు. కష్టంగా అనిపించినా ఈ ప్రయాణాన్ని తాను పూర్తిగా ఆస్వాదించానని స్పష్టం చేశారు.
కోవిడ్ ఒంటరితనం.. దారి చూపిన రాజమౌళి
కోవిడ్ సమయంలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఆగిపోయినప్పుడు తాను మానసికంగా చాలా కుంగిపోయానని చరణ్ గుర్తుచేసుకున్నారు. అప్పుడు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇచ్చిన సలహా తనను ఎంతగానో మార్చేసిందని తెలిపారు.
"ఆర్ఆర్ఆర్ షూటింగ్ సగం పూర్తయ్యాక కోవిడ్ లాక్ డౌన్ వచ్చింది. అప్పుడు నా చుట్టూ ఉన్నవాళ్లు దూరం కావడం, ఉపాసన ఎప్పుడూ హాస్పిటల్ కాల్స్ తో బిజీగా ఉండటంతో నేను ఇంట్లో పూర్తిగా ఒంటరినయ్యాను. మానసికంగా చాలా లో ఫేజ్ కు వెళ్లాను. ఆ సమయంలోనే రాజమౌళి గారిని కలిశాను. మళ్లీ షూటింగ్ కు వెళ్లాలనే మోటివేషన్ రావడం లేదని ఆయనతో చెప్పాను. దానికి ఆయన బదులిస్తూ.. 'ఒకేసారి పెద్ద పనులు కాకుండా చిన్న పనులతో మొదలుపెట్టు. ఉదయాన్నే లేచి నీ గదిని శుభ్రం చేసుకోవడం, గార్డెన్ బాగుచేయడం లాంటివి చెయ్' అని చెప్పారు. ఆ మాటలు నాలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి" అని చరణ్ చెప్పుకొచ్చారు.
తాను పోషిస్తున్న 'పెద్ది' క్యారెక్టర్ కూడా జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా చిన్న చిన్న లక్ష్యాలతో ముందుకు సాగే స్ఫూర్తిదాయకమైన పాత్రేనని చరణ్ వివరించారు.
12 ఏళ్ల కల తీరిందిలా..
'మెరుపు' సినిమా ఆగిపోయినప్పటి నుంచి (సుమారు 12 ఏళ్లు) ఒక మంచి స్పోర్ట్స్ డ్రామా చేయాలనేది తన డ్రీమ్ అని, అది ఈ సినిమాతో నెరవేరుతోందని చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. క్రాస్ ఓవర్ అథ్లీట్ నేపథ్యంలో సాగే ఈ కథలో కమర్షియల్ అంశాలతో పాటు దంగల్, లగాన్, స్వయంకృషి సినిమాల్లో ఉండే ఒక గొప్ప స్ఫూర్తి ఉంటుందని చెప్పారు.
మరోవైపు ఈ కథ పుట్టిన నేపథ్యాన్ని దర్శకుడు బుచ్చిబాబు పంచుకున్నారు. "కోవిడ్ వల్ల ఉప్పెన సినిమా రిలీజ్ ఆగిపోయి ఓటీటీకి వెళ్లే పరిస్థితి వచ్చినప్పుడు, ఆ టెన్షన్ లో సుకుమార్ గారికి ఫోన్ చేశాను. అప్పుడే ఆయన నన్ను కొత్త లైన్ రాసుకోమని చెప్పారు. ఆ వెంటనే రామచరణ్ గారిని హీరోగా ఊహించుకుని నేను రాసుకున్న కథే ఈ పెద్ది" అని డైరెక్టర్ తెలిపారు.
రెహమాన్ మ్యూజిక్ మ్యాజిక్.. జాన్వీలో శ్రీదేవి
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు అందిస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (ఆర్ఆర్) వేరే లెవెల్ లో ఉందని చరణ్ ప్రశంసించారు. విజువల్స్ ను ఆయన మరో స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. అలాగే సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కెమెరా వర్క్, ముఖ్యంగా ఢిల్లీ ఎపిసోడ్ ను ఆయన క్యాప్చర్ చేసిన విధానం అద్భుతంగా వచ్చిందని కితాబిచ్చారు. ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి చెబుతూ.. స్క్రీన్ మీద ఆమెకు ఒక గొప్ప ఆరా ఉందని, 'అచ్చియమ్మ' క్యారెక్టర్ లో జాన్వీని చూస్తుంటే అచ్చం శ్రీదేవి గారే గుర్తొచ్చారని చరణ్ వ్యాఖ్యానించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


