Ramayana Box Office Collection: రూ.1000 కోట్ల క్లబ్‌లో రామాయణ.. పుష్ప 2 తర్వాత అత్యంత వేగంగా ఈ మైల్ స్టోన్
Ramayana Box Office Collection: ‘రామాయణం’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన కేవలం 8 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును అధిగమించింది. ఈ ఘనత సాధించిన 11వ ఇండియన్ మూవీగా, అత్యంత వేగంగా ఈ క్లబ్‌లో చేరిన మూడో ఇండియన్ సినిమాగానూ నిలిచింది.
Ramayana Box Office Collection: దీపావళి కానుకగా నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదలైన 'రామాయణం' మొదటి భాగం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే ఈ చిత్రం బాక్సాఫీస్ లెక్కలను తారుమారు చేస్తూ ఆల్-టైమ్ రికార్డులను తిరగరాస్తోంది.

ఎక్స్‌టెండెడ్ ఓపెనింగ్ వీకెండ్‌లోనే రూ. 1000 కోట్ల మైలురాయిని తాకిన మూడో భారతీయ చిత్రంగా 'రామాయణం' నిలిచింది. విదేశాల్లో ఈ సినిమాకు వస్తున్న అపూర్వ ఆదరణ, దేశీయంగా సెలవు దినాలు కలిసిరావడం ఈ భారీ వసూళ్లకు ప్రధాన కారణమయ్యాయి.
8 రోజుల కలెక్షన్ల సునామీ సాగిందిలా..
'రామాయణం' వెయ్యి కోట్ల ప్రయాణం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రోజువారీ వసూళ్ల గణాంకాలను పరిశీలిస్తే..
తొలి రోజు (నవంబర్ 5): దీపావళికి మూడు రోజుల ముందు విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 128 కోట్ల గ్రాస్‌తో డీసెంట్ ఓపెనింగ్ రాబట్టింది.
4 రోజుల వీకెండ్: పాజిటివ్ మౌత్ టాక్ తోడవడంతో ఓవర్సీస్‌లో వసూళ్లు అమాంతం పెరిగాయి. దేశీయంగా దీపావళి పండుగ ప్రభావం ఉన్నప్పటికీ, 4 రోజుల ఓపెనింగ్ వీకెండ్‌లో రూ. 507 కోట్లు వసూలు చేసింది.
వీక్‌డేస్‌లో అసలైన జాతర: సోమవారం గోవర్ధన పూజ, మంగళవారం భాయ్ దూజ్ సెలవులను ఈ చిత్రం పూర్తిస్థాయిలో వాడుకుంది. ఈ రెండు రోజుల్లోనూ వరుసగా రూ. 150 కోట్ల చొప్పున వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
7 రోజుల మొత్తం: బుధవారం నాటికి అద్భుతమైన హోల్డ్ కనబరుస్తూ 7 రోజుల్లోనే రూ. 935 కోట్ల మార్కును చేరుకుంది.
8వ రోజు (గురువారం) రికార్డు: గురువారం ఇండియా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రూ. 29 కోట్లు, ఓవర్సీస్‌లో సుమారు $1.5 మిలియన్లు రావడంతో ఉదయానికే మొత్తం వసూళ్లు రూ. 980 కోట్లకు చేరాయి. మధ్యాహ్నం స్పాట్ బుకింగ్స్ జోరుతో 8వ రోజు ముగియకముందే రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది.
'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' రికార్డులు గల్లంతు: టాప్ జాబితా ఇదే!
భారతీయ సినీ చరిత్రలో 2017 మే నెలలో 'బాహుబలి 2' తొలిసారిగా రూ. 1000 కోట్ల క్లబ్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత చైనా వసూళ్లతో 'దంగల్' ఆ జాబితాలో చేరింది. ఇప్పటివరకు మొత్తం 11 భారతీయ చిత్రాలు ఈ ఘనత సాధించగా, అందులో 'రామాయణం' అత్యంత వేగంగా (8 రోజుల్లో) ఈ ఫీట్ సాధించిన మూడో సినిమాగా నిలిచింది.
గణాంకాలను బట్టి చూస్తే రాజమౌళి దిగ్గజ చిత్రాలైన 'బాహుబలి 2' (10 రోజులు), 'ఆర్ఆర్ఆర్' (16 రోజులు) రికార్డులను 'రామాయణం' సునాయాసంగా దాటేసింది.
భారీ తారాగణం.. 2028 దీపావళికి రెండో భాగం!
నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఆస్కార్ విన్నింగ్ వీఎఫ్ఎక్స్ సంస్థ డీనెగ్ (DNEG), యశ్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ ఇతిహాసాన్ని నిర్మించాయి.
రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా యశ్, లక్ష్మణుడిగా రవి దూబే తమ అద్భుత నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ప్రస్తుతం మొదటి భాగం థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుండగా, రెండో భాగాన్ని 2028 దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు.
| రూ.1000 కోట్ల క్లబ్‌లో అత్యంత వేగంగా చేరిన ఇండియన్ సినిమాలు | ||
|---|---|---|
| సినిమా | రూ.1000 కోట్లకు తీసుకున్న రోజులు | మొత్తం వసూళ్లు |
| పుష్ప 2 ద రూల్ | 7 | ₹1742 crore |
| ధురంధర్: ది రివేంజ్ | 7 | ₹1853 crore |
| రామాయణ పార్ట్ 1 | 8 | ₹1000+ crore |
| బాహుబలి: ది కన్‌క్లూజన్ | 10 | ₹1788 crore |
| ఆర్ఆర్ఆర్ | 16 | ₹1230 crore |
| కేజీఎఫ్ ఛాప్టర్ 2 | 18 | ₹1204 crore |
| జవాన్ | 18 | ₹1148 crore |
| ధురంధర్ | 21 | ₹1307 crore |
| కల్కి 2898 ఏడీ | 25 | ₹1042 crore |
| పఠాన్ | 27 | ₹1050 crore |
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


