యానిమల్ మూవీ రెండు కాదు మూడు భాగాలు.. యానిమల్ పార్క్ షూటింగ్ ఎప్పుడో చెప్పిన రణ్‌బీర్ కపూర్.. సీక్వెల్లో డ్యుయల్ రోల్

రణ్‍బీర్ కపూర్ తన బ్లాక్ బస్టర్ సినిమా 'యానిమల్' సీక్వెల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం 'స్పిరిట్' సినిమాతో బిజీగా ఉన్నందున.. 'యానిమల్ పార్క్' మొదలవడానికి ఇంకా సమయం పడుతుందని తెలిపాడు. ఇందులో తాను హీరో, విలన్ రెండు పాత్రలు పోషిస్తున్నట్లు కూడా ధృవీకరించాడు.

Published on: Jan 27, 2026, 17:48:25 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో పనితో బిజీగా ఉన్నాడు. 2023లో విడుదలై సంచలన విజయం సాధించిన తన సినిమా 'యానిమల్'కు రాబోతున్న సీక్వెల్ 'యానిమల్ పార్క్' గురించి అతడు ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా చాలా సమయం పడుతుందని అతడు వెల్లడించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ 'స్పిరిట్' పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడని, అందుకే ఈ సీక్వెల్ నిర్మాణం ఆలస్యం అవుతోందని చెప్పాడు.

యానిమల్ మూవీ రెండు కాదు మూడు భాగాలు.. యానిమల్ పార్క్ షూటింగ్ ఎప్పుడో చెప్పిన రణ్‌బీర్ కపూర్.. సీక్వెల్లో డ్యుయల్ రోల్
యానిమల్ మూవీ రెండు కాదు మూడు భాగాలు.. యానిమల్ పార్క్ షూటింగ్ ఎప్పుడో చెప్పిన రణ్‌బీర్ కపూర్.. సీక్వెల్లో డ్యుయల్ రోల్

యానిమల్ పార్క్ ఎప్పుడు మొదలవుతుందంటే?

'డెడ్‌లైన్' అనే పత్రికతో రణ్‌బీర్ కపూర్ మాట్లాడాడు. యానిమల్ పార్క్ నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదని అతడు చెప్పాడు. మీరు స్క్రిప్ట్ చదివారా అని అడిగినప్పుడు.. సందీప్ రెడ్డి వంగా సీక్వెల్ ఎలా ఉండబోతుందో తనకు కేవలం హింట్ మాత్రమే ఇచ్చారని రణ్‍బీర్ చెప్పాడు.

"ఆయన ఈ సినిమాతో అసలు ఏం చేయాలనుకుంటున్నారో నాకు క్లుప్తంగా చెప్పారు. ఆయన ఈ కథను మూడు భాగాలుగా తీయాలనుకుంటున్నారు. రెండో భాగానికి 'యానిమల్ పార్క్' అని పేరు పెట్టారు. దర్శకుడు ప్రస్తుతం వేరే సినిమా తీస్తున్నారు. కాబట్టి మేము 2027లో ఈ సినిమాను ప్రారంభించే అవకాశం ఉంది. అంటే దీనికి ఇంకాస్త సమయం ఉంది" అని రణ్‍బీర్ వివరించాడు.

హీరో, విలన్ రెండూ నేనే..

ఈ సీక్వెల్ చాలా ఆసక్తికరంగా, భారీ స్థాయిలో ఉండబోతోందని రణ్‍బీర్ చెప్పాడు. ఇందులో తాను డ్యూయల్ రోల్ చేయబోతున్నట్లు వెల్లడించాడు. "మొదటి సినిమా నుంచే కథను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై మేమిద్దరం ఆలోచనలు పంచుకుంటూనే ఉన్నాం. ఇది చాలా ఎక్సైటింగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇందులో రెండు పాత్రలు పోషించబోతున్నాను. హీరో, విలన్ రెండు పాత్రలూ నేనే చేస్తాను" అని సందీప్ రెడ్డి వంగా కొత్త ఆలోచనల గురించి చెబుతూ రణ్‍బీర్ మెచ్చుకున్నాడు.

'యానిమల్' సినిమా చూడని వారి కోసం ఈ డ్యూయల్ రోల్ గురించి వివరిస్తూ రణ్‍బీర్ ఒక ఆసక్తికర విషయం చెప్పాడు. ఇందులో విలన్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటాడని, అచ్చం హీరోలాగే మారిపోతాడని తెలిపాడు. చివరికి అతను హీరోకి నకిలీ రూపంలా తయారవుతాడని వివరించారు.

యానిమల్ విజయం..

2023లో విడుదలైన 'యానిమల్' సినిమా తండ్రీ కొడుకుల మధ్య ఉండే బంధాన్ని, విపరీతమైన యాక్షన్‌తో చూపించింది. చిన్నతనంలో తండ్రి ప్రేమకు దూరమై, మానసిక సంఘర్షణకు గురైన రణ్‍విజయ్ సింగ్ పాత్రలో రణ్‍బీర్ నటించగా.. అనిల్ కపూర్ అతని తండ్రిగా నటించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించి, ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లకు పైగా వసూలు చేసింది.

రణ్‍బీర్ రాబోయే సినిమాలు..

ఇక రణ్‍బీర్ కపూర్ ప్రస్తుతం చాలా పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నాడు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'లవ్ అండ్ వార్' అనే సినిమాలో నటిస్తున్నాడు. 1960ల కాలం నాటి కథతో వస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, విక్కీ కౌశల్ కూడా నటిస్తున్నారు. ఇది ఈ ఏడాది జూన్‌లో విడుదల కానుంది. అలాగే ఈ ఏడాది చివర్లో రాబోయే నితేష్ తివారీ మూవీ 'రామాయణం: పార్ట్ వన్'లో రణ్‍బీర్.. శ్రీరాముడిగా కనిపించనున్నాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More