నిలిచిపోయిన లవ్ అండ్ వార్ షూటింగ్- రణ్‌బీర్ కపూర్ అలియా భట్ విక్కీ కౌశల్ మధ్య గొడవలే కారణం- ఇదిగో క్లారిటీ!
సంజయ్ లీలా భన్సాలీ క్రేజీ ప్రాజెక్ట్ ‘లవ్ అండ్ వార్’ వాయిదా పడిందనే వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ మధ్య గొడవలు అయ్యాయని, అందుకే లవ్ అండ్ వార్ షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై తాజాగా చిత్ర యూనిట్ స్పందించింది.
బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘లవ్ అండ్ వార్’ (Love & War) గురించి గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నటిస్తున్న రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే షూటింగ్ ఆలస్యమవుతోందనే వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి.
నిలిచిపోయిన లవ్ అండ్ వార్ షూటింగ్- రణ్‌బీర్ కపూర్ అలియా భట్ విక్కీ కౌశల్ మధ్య గొడవలే కారణం- ఇదిగో క్లారిటీ!
షూటింగ్ ఆగలేదు.. కేవలం బ్రేక్ మాత్రమే!
అయితే, ఈ పుకార్లపై చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన సన్నిహిత వర్గాలు తాజాగా స్పష్టతనిచ్చాయి. "సినిమా యూనిట్ ప్రస్తుతం ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఇయర్-ఎండ్ బ్రేక్‌లో ఉంది. భన్సాలీ సినిమాలు చాలా భారీ స్థాయిలో ఉంటాయి కాబట్టి, చిన్న విరామం వచ్చినా అది వాయిదా పడినట్లుగా కనిపిస్తుంది" అని చిత్ర బృందానికి చెందిన ఒక ప్రతినిధి పేర్కొన్నారు.
పీరియాడిక్ ఫిల్మ్ కావడంతో
లవ్ అండ్ వార్ పీరియాడిక్ ఫిల్మ్ కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ (VFX), ప్యాచ్ వర్క్, కొన్ని కీలకమైన సన్నివేశాలు, పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని ఆయన వివరించారు.
నటీనటుల మధ్య గొడవలా? నిజం ఇదీ!
రణ్‌బీర్, ఆలియా, విక్కీ మధ్య గొడవలు వచ్చాయనే వార్తలను చిత్ర యూనిట్ పూర్తిగా ఖండించింది. "వారి మధ్య ఎటువంటి విభేదాలు లేవు. ఇవి చాలా సుదీర్ఘమైన, శ్రమతో కూడిన షూటింగ్ షెడ్యూల్స్. నటీనటులందరూ ఈ ప్రాజెక్ట్ పట్ల పూర్తి నిబద్ధతతో ఉన్నారు. జనవరి మధ్యలో మళ్లీ షూటింగ్ మొదలై మార్చి వరకు సాగుతుంది" అని ఇన్‌సైడర్ సమాచారం.
విడుదల ఎప్పుడు?
నిజానికి ఈ లవ్ అండ్ వార్ సినిమా 2025 క్రిస్మస్ కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ, షూటింగ్ ఆలస్యం కావడంతో 2026 మార్చి 20కి వాయిదా పడినట్లు గతంలో వార్తలు వచ్చాయి. మరికొన్ని నివేదికల ప్రకారం 75 రోజుల షూటింగ్ ఇంకా మిగిలి ఉందని, అందుకే 2026 ద్వితీయార్థంలోనే సినిమా వచ్చే అవకాశం ఉందని బాలీవుడ్ హంగామా పేర్కొంది.
రణ్‌బీర్ కపూర్ ప్రాజెక్ట్
అయితే చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా కొత్త తేదీని ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే, లవ్ అండ్ వార్ సినిమాతో పాటు రణ్‌బీర్ కపూర్ రామాయణ పార్ట్ 1లో చేస్తున్నాడు. నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్ రాముడిగా నటిస్తున్న విషయం తెలిసిందే.
అలియా భట్ సినిమా
సాయి పల్లవి, యశ్ వంటి స్టార్లతో రూపొందుతున్న రామాయణ పార్ట్ 1 చిత్రం 2026 దీపావళికి విడుదల కానుంది. ఇక అలియా భట్ విషయానికొస్తే.. వైఆర్ఎఫ్ (YRF) స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’లో నటిస్తోంది. 2026లో రాబోతున్న ఈ మూవీలో ఆలియా సరికొత్త యాక్షన్ అవతారంలో కనిపించబోతోంది.