బంగారు కిరీటం ఉన్న కేకు కట్ చేసిన షారుక్ ఖాన్.. ఘనంగా 60వ పుట్టినరోజు వేడుకలు.. 300 మంది అభిమానుల మధ్య..

షారుక్ ఖాన్ ఆదివారం (నవంబర్ 2) తన 60వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అతడు ఓ బంగారు కిరీటం ఉన్న ఓ మూడంచెల కేకును కట్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో షారుక్.. డాషింగ్ లుక్ లో కనిపించాడు.

Published on: Nov 3, 2025, 13:41:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ బాద్‌షా, సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ నవంబర్ 2న తన 60వ పుట్టినరోజును కింగ్-సైజ్ స్టైల్‌లో జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ముంబైలోని బాంద్రాలో ఉన్న బాల గంధర్వ రంగ్ మందిర్ ఆడిటోరియంలో అభిమానుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏంటంటే ఈ స్టార్ నటుడు బంగారు కిరీటంతో అలంకరించిన అద్భుతమైన మూడు అంచెల కేక్‌ను కట్ చేశాడు.

బంగారు కిరీటం ఉన్న కేకు కట్ చేసిన షారుక్ ఖాన్.. ఘనంగా 60వ పుట్టినరోజు వేడుకలు.. 300 మంది అభిమానుల మధ్య..
బంగారు కిరీటం ఉన్న కేకు కట్ చేసిన షారుక్ ఖాన్.. ఘనంగా 60వ పుట్టినరోజు వేడుకలు.. 300 మంది అభిమానుల మధ్య..

షారుక్, కేక్.. స్పెషల్ అట్రాక్షన్

షారుక్ ఖాన్ తన పుట్టినరోజును అభిమానుల పండుగగా మార్చేశాడు. ఈ ఆడిటోరియంలో 300 మందికి పైగా ఫ్యాన్స్‌ను కలిసిన అతడు వాళ్లను ఉద్దేశించి మాట్లాడాడు. ఈ ఫ్యాన్ ఈవెంట్‌కు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో కింగ్ ఖాన్ డాషింగ్ లుక్ లో కనిపించాడు. ప్రస్తుతం కింగ్ అనే మూవీలో నటిస్తున్న అతడు.. ఆ కింగ్ లాగానే కనిపిస్తున్నాడు.

ఇక ఈ ఈవెంట్లో షారుక్ ఖాన్ ఓ బంగారు కిరీటంతో ఉన్న మూడు అంచెల కేక్‌ను కట్ చేయడం ప్రత్యేకంగా నిలిచింది. ఆయనతో పాటు అదే రోజు పుట్టినరోజును జరుపుకునే అతని మేనేజర్ పూజా దద్లానీ కూడా కేక్ కట్ చేయడంలో పాలు పంచుకుంది. ఈ సందర్భంగా 'SRK డే' అనే మెసేజ్ ఉన్న బ్లాక్ కేక్‌ను షారుఖ్ కట్ చేశాడు.

అభిమానులకు షారుక్ థ్యాంక్స్

కేక్ కటింగ్ తర్వాత షారుక్ ఖాన్ తన అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. వారే 'ప్రతి సెలబ్రేషన్ కు కారణం' అని పేర్కొంటూ ఇన్నేళ్లుగా వారు చూపించిన అంతులేని ప్రేమ, విధేయతకు ధన్యవాదాలు చెప్పాడు.

అంతకంటే ముందు షారుక్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్ ఈవెంట్‌కు సంబంధించిన ఒక వీడియోను పంచుకున్నాడు. అభిమానులకు కృతజ్ఞత తెలియజేస్త.. "ఎప్పటిలాగే నా పుట్టినరోజును ప్రత్యేకంగా మార్చినందుకు ధన్యవాదాలు. చాలా కృతజ్ఞుడిని.. నేను కలవలేని వారిని త్వరలోనే కలుస్తాను. థియేటర్లలో, అలాగే వచ్చే పుట్టినరోజున కలుద్దాం. లవ్ యూ" అని పోస్ట్ చేశాడు.

అభిమానులకు అభివాదం

అభిమానుల వేడుక తర్వాత షారుక్.. తన ఇంటి బయట భారీగా గుమిగూడిన జనసందోహానికి అభివాదం చేయడానికి కూడా బయటకు వచ్చాడు. ఈ క్షణానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులకు అభివాదం చేయడానికి అతడు గేటుపైకి ఎక్కాడు. ఈ సమయంలో కొందరు అభిమానులు అతనికి దగ్గరగా వెళ్లడానికి అత్యుత్సాహం ప్రదర్శించారు. అయితే సెక్యూరిటీ వాళ్లను అడ్డుకున్నారు.

'కింగ్' ఫస్ట్‌లుక్ విడుదల

షారుక్ ఖాన్ 60వ పుట్టినరోజును అలీబాగ్‌లో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వేడుకలో స్నేహితులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కరణ్ జోహార్, ఫరా ఖాన్, రాణీ ముఖర్జీ వంటి అతని సన్నిహిత స్నేహితులు ఈ ప్రైవేట్ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి.

ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ.. షారుక్ తదుపరి సినిమా 'కింగ్' మేకర్స్ పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, మార్‌ఫ్లిక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ 2026లో విడుదల కానుంది. ఇందులో షారుక్ కుమార్తె సుహానా ఖాన్, దీపికా పడుకోణ్, జాకీ ష్రాఫ్, అనిల్ కపూర్, అర్షద్ వార్సీ, రాణీ ముఖర్జీ, అభిషేక్ బచ్చన్, జైదీప్ అహ్లావత్, అభయ్ వర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More