Sobhita Dhulipala: నాకు గాడ్ ఫాదర్ లేడు.. సినిమా ప్రపంచం ఓ సర్కస్.. ఆ గెలుపే శాపమైంది: శోభిత షాకింగ్ కామెంట్స్

Sobhita Dhulipala: సినిమా ఇండస్ట్రీపై ఓ అవుట్ సైడర్ గా, గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేకపోవడం వల్ల తాను పడిన ఇబ్బందులపై శోభితా ధూళిపాళ్ల షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ ఇండస్ట్రీ ఓ సర్కస్ లాంటిదని అనడం గమనార్హం.

Published on: Nov 5, 2026, 19:14:28 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Sobhita Dhulipala: సినిమా పరిశ్రమలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, గాడ్‌ఫాదర్ సపోర్ట్ లేకుండా నిలదొక్కుకోవడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఎంతటి ప్రతిభ ఉన్నా, ప్రతీ అడుగులోనూ అవమానాలు, అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి.

శోభితా ధూళిపాళ్ల షాకింగ్ కామెంట్స్
శోభితా ధూళిపాళ్ల షాకింగ్ కామెంట్స్

వైజాగ్ నుంచి వచ్చి బాలీవుడ్, హాలీవుడ్ స్థాయి వరకు ఎదిగిన తెలుగు అందం శోభితా ధూళిపాళ్ల తాజాగా ఇండస్ట్రీలో 'అవుట్‌సైడర్'గా తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటపెట్టింది. జీక్యూ ఇండియా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో పడ్డ కష్టాలను ఎమోషనల్‌గా పంచుకుంది.

మోడలింగ్ గెలిచినా దక్కని గుర్తింపు.. అవే శాపంగా మారాయి

విశాఖపట్నంలో పుట్టి పెరిగిన శోభితా ధూళిపాళ్ల.. ఉన్నత చదువుల కోసం ముంబైకి వెళ్లింది. అక్కడ మోడలింగ్‌పై ఉన్న ఆసక్తితో ప్రయత్నాలు మొదలుపెట్టి 2013లో 'మిస్ ఇండియా ఎర్త్' కిరీటాన్ని కైవసం చేసుకుంది. అందాల పోటీల్లో గెలిస్తే సినీ అవకాశాలు సులభంగా వస్తాయని భావించిన ఆమెకు తీరా అక్కడే తీవ్ర నిరాశ ఎదురైంది.

“మిస్ ఇండియా టైటిల్ గెలవడం నా కెరీర్‌కు ప్లస్ అవుతుందని అనుకున్నాను. కానీ చిత్రంగా అదే నా అవకాశాలను దెబ్బతీసింది. రన్ వే మోడలింగ్ ఆడిషన్లకు వెళితే పీజెంట్ (అందాల పోటీల) బ్యాక్‌గ్రౌండ్ ఉందంటూ పక్కన పెట్టేవారు. తీరా సినిమాలకు ఆడిషన్లు ఇస్తుంటే.. 'ఈమె మోడల్' అని ముద్ర వేసి నటిగా అవకాశాలు ఇవ్వడానికి వెనుకాడేవారు” అని శోభితా ఆవేదన వ్యక్తం చేసింది.

"మాకు గాడ్‌ఫాదర్లు లేరు.. ఇదొక సర్కస్!"

సినీ పరిశ్రమలో ఎలాంటి మార్గదర్శకత్వం లేకపోవడం ఎంతటి భయానక వాతావరణాన్ని సృష్టిస్తుందో చెబుతూ శోభితా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

“కాలేజీ రోజుల్లో ప్రముఖ మ్యాగజైన్ల కవర్ పేజీలు చూసినప్పుడు.. నాలాంటి సాధారణ అమ్మాయికి అలాంటి ప్రపంచంలో చోటు దక్కుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నన్ను కాపాడటానికి లేదా నా వెన్నుతట్టి నడిపించడానికి ఇక్కడ ఏ గాడ్‌ఫాదర్ లేదా గాడ్‌మదర్ లేరు. అవుట్‌సైడర్‌గా వచ్చినప్పుడు ఇక్కడ విషయాలను అర్థం చేసుకోవడమే పెద్ద సవాలు. ఎవరూ గైడెన్స్ ఇవ్వరు. ఆ వాతావరణం నిజంగా చాలా భయపెడుతుంది.” అని చెప్పింది.

ఎన్నో ఆడిషన్ల తర్వాత అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'రామన్ రాఘవ్ 2.0' (2016) చిత్రంతో ఆమెకు నటిగా తొలి బ్రేక్ లభించింది. ఆ సినిమాతో ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అడుగుపెట్టే అవకాశం ఆమెకు దక్కింది.

“ఎన్నో ఆడిషన్లు ఇచ్చిన తర్వాతే తొలి అవకాశం వచ్చింది. కేన్స్ కి వెళ్లాను, తెలివైన వ్యక్తులను కలిశాను. ఈ సినీ ప్రపంచం ఒక సర్కస్ లాంటిది. మేమంతా ఇక్కడ పిచ్చి క్రియేటివిటీ ఉన్న వ్యక్తులం. ఇతరుల ప్రశంసలు, వాలిడేషన్ మనకు అవసరం లేదని గ్రహించిన రోజు నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది” అని ఆమె పేర్కొంది.

వైజాగ్ నుంచి హాలీవుడ్ దాకా.. శోభితా సక్సెస్ గ్రాఫ్

తొలినాళ్లలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, శోభితా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది. విలక్షణమైన కథలను ఎంచుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ‘మేడ్ ఇన్ హెవెన్’ (Made in Heaven) వెబ్ సిరీస్‌లో 'తార ఖన్నా' పాత్ర శోభితా కెరీర్‌ను మలుపు తిప్పింది. అడవి శేష్‌తో నటించిన ‘గూఢచారి’ (Goodachari), ‘మేజర్’ (Major) చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు ఆమెను బాగా దగ్గర చేశాయి.

మలయాళంలో ‘మూథోన్’, ‘కురుప్’, మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్ 1 & 2’ చిత్రాల్లో కీలక పాత్రల్లో మెరిసింది. దేవ్‌పటేల్ దర్శకత్వం వహించిన 'మంకీ మ్యాన్' (Monkey Man) చిత్రం ద్వారా హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి తన సత్తా చాటుకుంది.

ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో విశాఖపట్నం నుంచి హాలీవుడ్ స్థాయి వరకు ఎదిగిన శోభితా ధూళిపాళ్ల ప్రయాణం.. సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఎంతోమంది యువతీయువకులకు గొప్ప స్ఫూర్తిదాయకం.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More