ఈ సినిమాను అస్సలు మిస్ కావద్దు: వివాదాస్పద మూవీకి శోభిత రివ్యూ.. ఈ ఓటీటీలో చూడండి
ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చిన ఓ వివాదాస్పద మూవీని అస్సలు మిస్ కాకుండా చూడాలంటూ అక్కినేని ఇంటి కోడలు, నటి శోభితా ధూళిపాళ రివ్యూ ఇవ్వడం విశేషం. ముఖ్యంగా అమ్మాయిలు ఈ సినిమాను కచ్చితంగా చూడాలని ఆమె చెప్పింది.
తమిళంలో విడుదలైన 'బ్యాడ్ గర్ల్' (Bad Girl) సినిమాపై నటి శోభిత ధూళిపాళ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ట్రైలర్ విడుదలైనప్పుడు వివాదంలో చిక్కుకున్న ఈ మూవీపై శోభిత ప్రశంసల వర్షం కురిపించింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

'బ్యాడ్ గర్ల్' చూసి కన్నీళ్లు పెట్టుకున్న శోభిత
శోభిత ధూళిపాళ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో 'బ్యాడ్ గర్ల్' సినిమా పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ఈ సినిమా చూసిన తర్వాత తాను కన్నీళ్లు పెట్టుకున్నానని, తన మనసులోని భావాలు వ్యక్తమైనట్లుగా అనిపించిందని రాసింది. తన రివ్యూలో ఆమె ఇలా రాసింది. "బ్యాడ్ గర్ల్ నన్ను నవ్వించింది. కన్నీళ్లు కూడా పెట్టించింది. నా మనసులోని భావాలు వ్యక్తమయ్యాయి. ఆవిష్కృతమయ్యాయి. ప్రతి నిమిషం మరింత పరిణతి చెందే సినిమా ఇది. ఈ సినిమాను అందరూ,
ముఖ్యంగా అమ్మాయిలు తప్పకుండా చూడాలని గట్టిగా సిఫారసు చేస్తున్నాను. ఈ సినిమా మనందరి కోసం! వర్ష భరత్ (దర్శకురాలు), అంజలి శివరామన్‌లకు (నటి) ప్రత్యేక అభినందనలు. మీరిద్దరూ అసాధారణమైనవారు. దీన్ని జియోహాట్‌స్టార్ లో చూడండి" అని శోభిత చెప్పింది. శోభిత ఇచ్చిన ఈ రివ్యూను దర్శకురాలు వర్ష, నటి అంజలి తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రీషేర్ చేశారు.
'బ్యాడ్ గర్ల్' చుట్టూ వివాదం
ఈ ఏడాది జనవరిలో 'బ్యాడ్ గర్ల్' ట్రైలర్ విడుదలైన తర్వాత దర్శకుడు జి. మోహన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. బ్రాహ్మణులను ప్రతికూల కోణంలో చూపించారని ఆరోపిస్తూ, ఈ సినిమా నిర్మాతలు వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్‌లపై అతడు విమర్శలు గుప్పించాడు.
"ఒక బ్రాహ్మణ అమ్మాయి వ్యక్తిగత జీవితాన్ని చూపించడం ఈ వర్గానికి ఎప్పుడూ బోల్డ్, రిఫ్రెష్ సినిమానే. వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ అండ్ కో. నుంచి ఇంతకు మించి ఏం ఆశించగలం. బ్రాహ్మణ తండ్రి, తల్లిని విమర్శించడం పాత ఫ్యాషన్ అయింది. కొత్తగా లేదు.. మీ సొంత కుల అమ్మాయిలతో ప్రయత్నించి ముందు మీ కుటుంబానికి చూపించండి" అని అతడు ఎక్స్ లో రాసుకొచ్చాడు.
రమ్య అనే టీనేజ్ బ్రాహ్మణ అమ్మాయి లైంగిక కోరికలు, సంప్రదాయవాద కుటుంబం, సమాజం అంచనాలకు వ్యతిరేకంగా ఆమె చేసే ప్రయాణం ఈ వివాదానికి ప్రధాన కారణం.
'బ్యాడ్ గర్ల్' చిత్రం గురించి..
'బ్యాడ్ గర్ల్' అనేది ఒక కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా. దీనికి వర్ష భరత్ కథ రాసి దర్శకత్వం వహించింది. ఈ చిత్రంలో అంజలి శివరామన్ ప్రధాన పాత్ర (రమ్య) పోషించగా.. శాంతిప్రియ, హ్రిదు హరూన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డామ్ లో ప్రదర్శించిన తర్వాత సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఇది జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


