OTT Horror Thriller: రక్తపిశాచితో లవ్.. 1000 ఏళ్ల కిందటి మిస్టరీ.. ఓటీటీలొ వచ్చిన తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Immortal Review: తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్, కయాదు లోహర్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ 'ఇమ్మోర్టల్' (Immortal). తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? 1000 ఏళ్ల కిందటి ఆ మిస్టరీ ఏంటి? అసలు చూడొచ్చా అన్నది ఈ రివ్యూలో చూడండి.
Immortal Review: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో 'వ్యాంపైర్' (రక్తపిశాచి) నేపథ్యంతో వచ్చే సినిమాలు చాలా అరుదు. ఆ మధ్య మలయాళంలో కళ్యాణి ప్రియదర్శన్ నటించిన 'లోకా: చాప్టర్ 1' మూవీ భారీ వసూళ్లతో బ్లాక్‌బస్టర్ అయిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి కాన్సెప్ట్ తోనే వచ్చిన తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ ఇమ్మోర్టల్. ప్రస్తుతం ఈ మూవీ సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్గా మరియప్పన్ చిన్న ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కయాదు అందానికి తోడు భయపెట్టే సీన్లతో సాగిన ఈ సినిమా ఎలా ఉంది? అసలు కథేంటి? చూడొచ్చా లేదా అన్నది తెలుసుకోండి.
ఇమ్మోర్టల్ కథాంశం ఏమిటంటే?
ఇమ్మోర్టల్ మూవీ కథ ఒక గిరిజన తెగను చూపిస్తూ ఓ ఫ్లాష్‌బ్యాక్ సీన్ తో ప్రారంభమవుతుంది. అక్కడి గిరిజన మహిళ మనుషులకు కాకుండా వింత రూపాంతరం చెందిన శిశువుకు జన్మనిస్తుంది. ఆ వింత జీవిని భర్త అడవిలో తోడేలు ముందు వదిలివేస్తాడు. కట్ చేస్తే వర్తమానంలో.. ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసే మాగి (జీవీ ప్రకాష్ కుమార్) అనే సాధారణ యువకుడు అద్దె ఇల్లు కోసం వెతుకుతుంటాడు.
ఆ సమయంలో సింధు (కయాదు లోహర్) అనే అత్యంత అందమైన యువతి నుంచి వచ్చిన పిలుపుతో ఆమె అపార్ట్‌మెంట్‌కు వెళ్తాడు. సింధు అందానికి ముగ్ధుడైన మాగి వెంటనే ఆ ఇంట్లోకి అద్దెకు దిగుతాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారుతున్న సమయంలో.. సింధు సాధారణ మనిషి కాదని, 1,000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక రక్తపిశాచి (Vampire) అని మాగికి తెలుస్తుంది.
తన రక్త దాహం తీర్చుకోవడానికి మాగిని ఒక వింతయిన మాయా ప్రపంచంలో బంధిస్తుంది. ఆ దెయ్యాల వల నుంచి మాగి తప్పించుకోగలిగాడా? అసలు సింధు వెనుక ఉన్న 1,000 ఏళ్ల మిస్టరీ ఏమిటి? అనేది మిగతా కథ.
డార్క్ లవ్ స్టోరీ.. కళ్లు చెదిరే కయాదు లోహర్
దర్శకుడు మరియప్పన్ చిన్న రాసుకున్న కథ, వ్యాంపైర్ బ్యాక్‌స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రక్తపిశాచి బ్యాక్‌డ్రాప్ లో లవ్ స్టోరీ, అందులో భాగంగా వచ్చే సీన్స్ ప్రేక్షకులను రెండు గంటల నిడివిలో స్క్రీన్ కు అతుక్కుపోయేలా చేస్తాయి. ముఖ్యంగా హీరోయిన్ కయాదు లోహర్ తన అందంతో, మత్తెక్కించే చూపులు, నటనతో స్క్రీన్ పై మ్యాజిక్ చేసింది. ప్రతి సీన్లోనూ ఆమె ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
హీరో జీవీ ప్రకాష్ కుమార్ ఫస్టాఫ్ లో కాస్త నెమ్మదిగా అనిపించినా, సెకండాఫ్ లో తను ఎదుర్కొంటున్న ఓ భయంకరమైన వాతావరణాన్ని, భయాన్ని ఎంతో పరిణతితో పండించారు. ఇతర నటులు ఎల్.ఎస్. మారన్, టి.ఎమ్. కార్తీక్ తమ పాత్రల పరిధి మేర నటించారు.
క్లైమ్యాక్స్ పెద్ద మైనస్
సినిమాకు కథాబలం ఉన్నప్పటికీ, సాంకేతిక లోపాలు సినిమా స్థాయిని తగ్గించాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ (VFX), దెయ్యం డిజైన్ చాలా సాధారణంగా, అవుట్‌డేటెడ్‌గా ఉన్నాయి. క్లైమాక్స్‌లో ఒక సాధారణ మనిషికి, భారీ గబ్బిలంలాంటి రాక్షసుడికి మధ్య జరిగే ఫైట్ సీన్ ఆకట్టుకోవడానికి బదులు నవ్వు తెప్పించేలా ఉంది. రక్త పిశాచి మెడపై కొరికి రక్తం తాగే సీన్లో కూడా మెడపై కనీసం గాయం కనిపించకపోవడం వంటి లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.
సామ్ సి.ఎస్ (Sam C.S.) అందించిన సంగీతం సన్నివేశాలకు తగినట్లుగా ఉందే తప్ప ప్రత్యేకంగా గుర్తుండిపోదు. ఎడిటింగ్ పర్వాలేదనిపించినా, క్లైమాక్స్ సీన్‌ను ఇంకా జాగ్రత్తగా డిజైన్ చేసి ఉంటే 'ఇమ్మోర్టల్' వ్యాంపైర్ జానర్లో ఒక క్లాసిక్ థ్రిల్లర్‌గా నిలిచేది.
మొత్తం చూస్తే సాధారణ వీఎఫ్ఎక్స్ లోపాలను పక్కనబెడితే.. రొమాంటిక్ హారర్ థ్రిల్లర్స్, వ్యాంపైర్ కథలను ఇష్టపడే వారికి 'ఇమ్మోర్టల్' ఒకసారి చూడదగ్గ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుండటంతో ఈ వీకెండ్ చూసేయండి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


