OTT Review: పరువుకు ఉన్న విలువెంత? ఓటీటీలోకి ఈరోజు తెలుగులో వచ్చిన తమిళ లీగల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

OTT Review: ఓటీటీలోకి గురువారం (అక్టోబర్ 15) స్ట్రీమింగ్ కు వచ్చిన తమిళ లీగల్ థ్రిల్లర్ మూవీ ఎన్న విలై (Enna Vilai) మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూడండి. ఓ పేదవాడి పరువుకు ఈ దేశంలో ఉన్న విలువ ఎంత అన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది.

Published on: Oct 15, 2026, 18:37:20 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Review: నిజాయతీకి ఓ పేదవాడు చెల్లించుకునే మూల్యం.. అతని పరువుకు ఈ దేశం ఇచ్చే విలువ.. ఈ వ్యవస్థలో న్యాయం కోసం ఓ డబ్బు లేని వాడు చేసే పోరాటం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించిన మూవీ ఎన్న విలై (Enna Vilai). ఈ తమిళ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో సంచలనం సృష్టిస్తోంది.

OTT Review: పరువుకు ఉన్న విలువెంత? ఓటీటీలోకి ఈరోజు తెలుగులో వచ్చిన తమిళ లీగల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
OTT Review: పరువుకు ఉన్న విలువెంత? ఓటీటీలోకి ఈరోజు తెలుగులో వచ్చిన తమిళ లీగల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

రామేశ్వరం బ్యాక్‌డ్రాప్‌లో..

సాధారణంగా సముద్రంలో దొరికిన నిధి ఒక పేదవాడి జీవితాన్ని మారుస్తుందని అనుకుంటాం. కానీ ఆ బంగారమే అతని మెడకు ఉరితాడై, పోలీస్ వ్యవస్థ కుట్రలో బలిపశువును చేస్తే పరిస్థితి ఏంటి? రామేశ్వరం సముద్ర తీర నేపథ్యంలో తెరకెక్కిన భావోద్వేగపూరిత కోర్టు రూమ్ డ్రామా ‘ఎన్న విలై’ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.

'తొండిముత్త దృక్షాక్షితియుమ్' వంటి క్లాసిక్ థ్రిల్లర్‌కు కథ అందించిన జాతీయ అవార్డు గ్రహీత రచయిత సజీవ్ పళూర్ అందించిన కథతో వచ్చిన ఈ చిత్రం, ఒక అమాయక మత్స్యకారుడి ఆత్మగౌరవ పోరాటాన్ని ఎంతో సహజంగా ఆవిష్కరించింది.

ఎన్న విలై స్టోరీ ఏంటంటే?

తవశి (కరుణాస్) రామేశ్వరం సముద్ర తీరంలో భక్తులు విసిరే నాణేలను నీటిలోకి దూకి సేకరిస్తూ జీవనం సాగించే ఒక సాధారణ మత్స్యకారుడు. తన పిల్లలను బాగా చదివించి మంచి స్థాయిలో చూడాలనేదే అతని ఏకైక ఆశయం. ఒకరోజు సముద్రంలోకి వెళ్లి నాణేలు వెతుకుతున్న సమయంలో అతనికి ఒక అత్యంత విలువైన బంగారు లాకెట్ ఒకటి దొరుకుతుంది. అయితే దానిపై ఆశ పడకుండా నిజాయితీగా పోలీసులకు అప్పగించడానికి వెళ్తాడు.

అక్కడే అతని జీవితం మలుపు తిరుగుతుంది. ఆ ఆభరణంలోని ఖరీదైన రత్నాన్ని నొక్కేసిన ఒక అవినీతి పోలీస్ అధికారి.. తవశిపైనే దొంగతనం కేసు మోపి జైలుకు పంపుతాడు. ఈ క్లిష్ట సమయంలో అడ్వకేట్ కాంచన (నిమిషా సజయన్) తవశి తరఫున వాదించడానికి రంగంలోకి దిగుతుంది. నిధి హక్కులు, ప్రభుత్వ అధికారం, పోలీస్ కస్టడీ చుట్టూ కోర్టులో జరిగే సుదీర్ఘమైన వాదనలు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చాయనేది మిగిలిన కథ.

కరుణాస్, నిమిష.. నెక్ట్స్ లెవెల్

తవశి పాత్రలో సీనియర్ నటుడు కరుణాస్ తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్‌లో, సమాజంలో ఎదురయ్యే అవమానాలను భరిస్తూ, తన ఆత్మగౌరవం కోసం పరితపించే ఒక సగటు తండ్రి వేదనను ఆయన కళ్లలో అద్భుతంగా పలికించారు. లాయర్ కాంచనగా నిమిషా సజయన్ మరోసారి తన గంభీరమైన నటనతో ఆకట్టుకున్నారు. కోర్టు రూమ్‌లో ఆమె వినిపించే వాదనలు, వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపే తీరు ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది.

సామ్ సీఎస్ (Sam C.S.) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను, ఎమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. ముఖ్యంగా క్లైమాక్స్ వైపు వెళ్లేకొద్దీ సంగీతం ఇచ్చే హై ఫీల్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్‌లో కేసు నమోదు చేసే కొన్ని సన్నివేశాలు కాస్త వేగంగా అనిపించినప్పటికీ, సెకండ్ హాఫ్‌లో సాగే డ్రామా సినిమాను నిలబెట్టింది.

వ్యవస్థ చేసిన తప్పును అదే వ్యవస్థతో అంగీకరింపజేయడానికి ఒక సాధారణ పౌరుడు ఎంతటి మానసిక వేదన అనుభవించాలో ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపించింది. సోషల్ డ్రామాలు, లీగల్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఓటీటీ ప్రియులకు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న 'ఎన్న విలై' ఒక పర్ఫెక్ట్ అండ్ హార్ట్ టచింగ్ మూవీ. తెలుగులోనూ ఈ సినిమాను చూసే వీలుంది. ఈ వీకెండ్ ఓ లుక్కేయండి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More