Actress Suicide: భర్తతో గొడవ పడి ఆత్మహత్య చేసుకున్న నటి.. ఆమె చివరి పోస్ట్ చూసి కంటతడి పెడుతున్న ఫ్యాన్స్
Actress Suicide: తమిళ నటి సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం (36) చెన్నైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. వైవాహిక జీవితంలో తలెత్తిన మనస్పర్థలే ఈ ఘాతుకానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏప్రిల్ 12న ఆమె 37వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉండగా అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.
Actress Suicide: తమిళ టెలివిజన్, సినీ రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటి సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం (36) మంగళవారం చెన్నైలోని అయ్యప్పన్‌తాంగల్‌లో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించింది. ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. శ్రీలంకకు చెందిన సుభాషిణి.. తమిళ సీరియల్ 'కయల్' ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

భర్తతో గొడవే కారణమా?
పోలీసుల విచారణ ప్రకారం.. సుభాషిణి తన భర్త బిబిన్ చంద్రతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న సమయంలో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. కుటుంబ సమస్యల కారణంగా ఆమె గత కొంతకాలంగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, ఆ మనస్తాపంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని అధికారులు భావిస్తున్నారు. విచారణ కొనసాగుతోంది, పూర్తి వివరాలు పోస్ట్‌మార్టం నివేదిక తర్వాత వెల్లడి కానున్నాయి.
పుట్టినరోజు, పెళ్లి రోజు ముందే విషాదం
సుభాషిణి మరణం ఆమె కుటుంబ సభ్యులను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏప్రిల్ 12న ఆమె 37వ పుట్టినరోజు, అలాగే ఏప్రిల్ 21న వారి రెండో పెళ్లి రోజు ఉంది. ఈ వేడుకల కోసం సిద్ధమవుతున్న తరుణంలోనే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
భర్త బిబిన్ చంద్ర సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకుంటూ.. "నా బుబ్బా.. నన్ను నీకంటే ఎక్కువగా ఎవరూ ప్రేమించలేదు. మన బిడ్డ గురించి, మన ప్రయాణాల గురించి ఎన్నో కలలు కన్నాం. నన్ను వదిలి ఎందుకు వెళ్లావు?" అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
ఒక్కరోజు ముందే హ్యాపీ వీడియో.. ఇప్పుడు మౌనం
ఆమె మరణానికి ఒక్కరోజు ముందు కూడా సుభాషిణి తన కెన్యా పర్యటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అందులో ఆమె ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపించింది.
"జీవితం అంచనాలకు అందదు.. నిన్నటి వరకు అంత సంతోషంగా ఉన్న మనిషికి ఏమైంది?" అంటూ అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. 2012లో 'ఇని అవన్' అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన సుభాషిణి.. హోస్ట్‌గా కూడా తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగించింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం ఏ సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యారు?
జవాబు: ఆమె తమిళంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'కయల్' (Kayal) సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
ప్రశ్న: ఆమె స్వస్థలం ఎక్కడ?
జవాబు: సుభాషిణి శ్రీలంకకు చెందినవారు. అక్కడ 'వసంతం టీవీ'లో మ్యూజిక్ ప్రోగ్రామ్ హోస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు.
ప్రశ్న: మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారు ఎవరిని సంప్రదించాలి?
జవాబు: మీకు ఆత్మహత్య ఆలోచనలు కలిగినా లేదా మానసిక ఒత్తిడితో ఉన్నా దయచేసి నిపుణులను సంప్రదించండి. సహాయం కోసం ఆసరా (022 2754 6669) లేదా స్నేహ ఇండియా ఫౌండేషన్ (+91 44 2464 0050) వంటి హెల్ప్‌లైన్లను సంప్రదించవచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


