రిలీజ్‌కు అంత తొందరేంటని అడిగిన మద్రాస్ హైకోర్టు.. విజయ్ చివరి సినిమాకు తొలగని అడ్డంకులు.. రూ.500 కోట్ల నష్టం తప్పదా?
దళపతి విజయ్ చివరి సినిమా జన నాయగన్ కు అడ్డంకులు తొలగడం లేదు. జనవరి 9న రిలీజ్ ఉన్నా ఇప్పటికీ సినిమాకు సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ రాకపోవడంతో మేకర్స్ మద్రాస్ హైకోర్టుకెక్కారు. అక్కడా వాళ్లకు ఇంకా ఊరట కలగలేదు.
దళపతి విజయ్ రాజకీయాల్లోకి వెళ్లేముందు చేస్తున్న చివరి సినిమా 'జన నాయగన్' (Jana Nayagan) విడుదలకు చివరి నిమిషంలో భారీ అడ్డంకులు ఏర్పడ్డాయి. జనవరి 9న రిలీజ్ కావాల్సి ఉన్నా.. ఇప్పటివరకు సెన్సార్ బోర్డ్ (CBFC) నుంచి సర్టిఫికెట్ రాలేదు. దీంతో నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
హైకోర్టులో ఏం జరిగింది?
కేవీఎన్ ప్రొడక్షన్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం (జనవరి 6) విచారణ జరిగింది. దీనికి సంబంధించిన కీలక పరిణామాలు ఇలా ఉన్నాయి. జన నాయగన్ మూవీ నిర్మాతల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వట్లేదని కోర్టుకు తెలిపారు. దీనిపై జస్టిస్ పి.టి. ఆశా స్పందించారు.
"రిలీజ్ విషయంలో అంత అత్యవసరం ఏముంది? జనవరి 10 నుంచి రిలీజ్ వాయిదా వేసుకోవచ్చు కదా? సంక్రాంతి వస్తే మంచి జరుగుతుంది అనే సామెత ఉంది కదా" అని వ్యాఖ్యానించారు.
అయితే సినిమాపై వచ్చిన ఫిర్యాదు కాపీని బుధవారం (జనవరి 7) నాటికి కోర్టుకు సమర్పించాలని సెన్సార్ బోర్డును (CBFC) ఆదేశించారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
అసలు గొడవ ఏంటి?
నిర్మాతలు కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సమస్య మొదలైన తీరు ఇలా ఉంది. గతేడాది డిసెంబర్ 18న సెన్సార్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 22న సినిమా చూసిన ఎగ్జామినింగ్ కమిటీ.. హింసాత్మక దృశ్యాలు, మతపరమైన రిఫరెన్సులు ఉన్నాయని చెబుతూ.. కొన్ని కట్స్ సూచించి UA 16+ సర్టిఫికెట్ ఇవ్వడానికి సిఫార్సు చేసింది.
డిసెంబర్ 24న బోర్డు చెప్పిన మార్పులు చేసి నిర్మాతలు సినిమాను మళ్లీ సబ్మిట్ చేశారు. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో జనవరి 5న నిర్మాతలకు ఒక ఈమెయిల్ వచ్చింది. సినిమాపై ఒక ఫిర్యాదు వచ్చిందని, అందుకే రూల్ 24 ప్రకారం సినిమాను ‘రివైజింగ్ కమిటీ’కి పంపిస్తున్నామని CBFC తెలిపింది.
రూ. 500 కోట్లు రిస్క్ లో..
ఎవరో గుర్తు తెలియని వ్యక్తి.. ఈ సినిమాలో మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆర్మీని తప్పుగా చూపించారని ఫిర్యాదు చేశారట. సినిమా ఇంకా పబ్లిక్ లోకి రాకుండానే, ఎవరికీ చూపించకుండానే ఫిర్యాదు ఎలా చేస్తారని నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 5000 స్క్రీన్లలో రిలీజ్ ప్లాన్ చేశామని, దాదాపు రూ. 500 కోట్లు పెట్టుబడి రిస్క్‌లో పడిందని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 24 దేశాల్లో సెన్సార్ క్లియరెన్స్ వచ్చింది కానీ.. ఇండియాలోనే సమస్య వచ్చింది. బుధవారం కోర్టు ఇచ్చే తీర్పుపైనే విజయ్ సినిమా రిలీజ్ ఆధారపడి ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


