జన నాయగన్ కాదని పరాశక్తి ఎలా వేస్తారు? థియేట‌ర్ ఓన‌ర్‌పై విజ‌య్ ఫ్యాన్స్ ఫైర్‌-బూతుల‌తో దాడి

కోయంబత్తూరులోని వాసు సినిమాస్.. విజయ్ 'జన నాయగన్' ను కాదని శివకార్తికేయన్ 'పరాశక్తి'ని ప్రదర్శించాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయంపై విజయ్ అభిమానులు తమపై దుర్భాషలాడుతూ, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని థియేటర్ యాజమాన్యం ఆరోపించించడం హాట్ టాపిక్ గా మారింది. 

Published on: Jan 06, 2026 1:44 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ వారం తమిళ సినిమాలో పెద్ద పండుగ. సంక్రాంతి సందర్భంగా అక్కడ దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్', శివకార్తికేయన్ 'పరాశక్తి' మధ్య పోటీ నెలకొంది. అయితే తమిళనాడులోని ఒక థియేటర్ 'జన నాయగన్' కాకుండా 'పరాశక్తి'ని ప్రదర్శించాలని నిర్ణయించుకుంది. దీంతో విజయ్ అభిమానులు ఆ థియేటర్ ఓనర్ పై బూతులతో దాడికి దిగారు. విజయ్ ఫ్యాన్స్ తమను వేధిస్తున్నారని, దుర్భాషలాడుతున్నారని ఓనర్ ఆరోపించారు.

విజయ్ వర్సెస్ శివ కార్తికేయన్
విజయ్ వర్సెస్ శివ కార్తికేయన్

థియేటర్ యాజమాన్యం పోస్ట్

థియేటర్ యాజమాన్యం సోషల్ మీడియాలో దళపతి విజయ్ అభిమానుల తీరుపై మండిపడింది. కోయంబత్తూరులోని వాసు సినిమాస్ ఈ సంక్రాంతికి 'జన నాయగన్' కంటే 'పరాశక్తి'ని ప్రదర్శించాలని అనేక కారణాల వల్ల నిర్ణయించుకున్నామని ఎక్స్ లో స్పష్టం చేసింది. 15 సంవత్సరాలుగా తమ థియేటర్లలో కొన్ని తప్ప విజయ్ చిత్రాలన్నింటినీ ప్రదర్శించామని కూడా వారు గుర్తు చేశారు. 'పరాశక్తి'ని ఎంచుకోవడం అంటే విజయ్‌ను తక్కువగా గౌరవించినట్లు కాదని తెలిపారు.

ఇలాంటి తిట్లా?

పరాశక్తి కోసం సంతకం చేశామని పోస్ట్ చేసిన తర్వాత, ట్విట్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లలో తమకు వచ్చిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని, వాటిని స్వయంగా చదివి.. అవి ఏమాత్రం న్యాయంగా లేదా సమర్థనీయంగా ఉన్నాయో లేదో ఆలోచించమని వారు కోరారు. ‘‘వేధింపులు, అసభ్యత, తిట్లు ఎంత దూరం వెళ్ళాయంటే మా మానసిక ప్రశాంతతను తీవ్రంగా దెబ్బతీశాయి. దయచేసి ఒక్క క్షణం ఆలోచించండి’’ అని పేర్కొన్నారు.

చివరి సినిమా

విజయ్ కేవలం ఒక స్టార్ మాత్రమే కాదు, ఆయన ఒక అద్భుతమైన మానవతావాది అని కూడా థియేటర్ యాజమాన్యం అభిమానులను శాంతపరిచింది. ‘‘మీ అభిమాన నటుడి సినిమాను మీకు ఇష్టమైన థియేటర్‌లో చూడలేకపోతున్నారనే నిరాశను నేను నిజంగా అర్థం చేసుకోగలను. అది బాధాకరమైనదని నాకు తెలుసు. కానీ ఇది ఆయన చివరి చిత్రం అని రాసి వేధింపులు, దాడి చేయడం కంటే దయచేసి థియేటర్‌కి వెళ్లి సినిమాను ఆస్వాదించండి’’ అని పోస్టులో తెలిపారు.

ఫ్యాన్స్ రియాక్షన్

మరోవైపు విజయ్ అభిమానులు తమ వైఖరిని మార్చుకోలేదు. తమ వాదనను మరింత బలంగా వినిపించారు. 'కోవిడ్ సమయంలో థియేటర్లను పునరుద్ధరించడంలో ఆయన (విజయ్) సహాయం చేశారు. అయినా 'జన నాయగన్'ను ఎందుకు ప్రదర్శించలేకపోతున్నారో థియేటర్ యజమానుల నుండి వివరణలు చదవాల్సి వస్తోంది' అని ఒక అభిమాని వ్యాఖ్యానించారు. 'ఇకపై ఈ థియేటర్‌కి వెళ్ళను. సింపుల్' అని మరో అభిమాని కోపంగా రాశారు.

ఒక అభిమాని ఏమో 'మీకు నచ్చింది ప్రదర్శించండి.. మాకు ఇక పట్టదు.. మీకు గౌరవం ఉంటే ఆయన చివరి సినిమాను తీసుకునేవారు. కానీ మీరు తీసుకోలేదు. గెట్ లాస్ట్’’ అని మండిపడ్డారు.

రిలీజ్ డేట్లు

హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన 'జన నాయగన్'.. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం. తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించనున్నారు. మమితా బైజు, పూజా హెగ్డే, బాబీ డియోల్ నటిస్తున్న ఈ చిత్రం 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇది జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్, శ్రీలీల, రవి మోహన్ నటించిన 'పరాశక్తి' జనవరి 10న థియేటర్లలో విడుదల కానుంది.