రాజా సాబ్ అందుకే దారుణంగా ఫ్లాపయింది.. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం చేసి ఉంటే బాగుండేది: ప్రొడ్యూసర్ కామెంట్స్
ప్రభాస్ సినిమా ‘ది రాజా సాబ్’ భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచింది. ఈ సినిమా పరాజయంపై సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాన్ ఇండియా మోజులో పడి సినిమా తన సహజత్వాన్ని కోల్పోయిందని అతడు విశ్లేషించాడు.
ప్రభాస్ నటించిన హారర్ కామెడీ మూవీ ‘ది రాజా సాబ్’ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు వసూలు చేసి ఘనంగా ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత మిశ్రమ స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. అభిమానులు, విమర్శకుల నుంచి నెగెటివ్ టాక్ రావడంతో వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. చివరికి ఈ సినిమా ప్రభాస్ గత చిత్రాలైన ‘ఆదిపురుష్’, ‘సాహో’ వసూళ్లను కూడా దాటలేక ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ సినిమా వైఫల్యంపై తనదైన శైలిలో స్పందించాడు.

చిన్న సినిమాగానే అనుకొని..
ది రాజా సాబ్ సినిమాను పాన్ ఇండియా మూవీగా మార్చడం వల్లే అసలు సమస్య వచ్చిందని తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయపడ్డాడు. సుమన్ టీవీ విజయవాడతో అతడు మాట్లాడుతూ.. "నాకు తెలిసినంత వరకు రాజా సాబ్ సినిమాను మొదట తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఒక చిన్న, చక్కని సినిమాగా అనుకున్నారు. అందుకే మారుతిని దర్శకుడిగా తీసుకున్నారు. మారుతికి భారీ కమర్షియల్ సినిమాలు తీసిన అనుభవం లేదు. పరిమిత బడ్జెట్‌లో సాధారణ సినిమా తీస్తారనే ఉద్దేశంతోనే ఆయనకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. కానీ ఆ ఆలోచనకు ఎందుకు కట్టుబడి ఉండలేకపోయారో నాకు అర్థం కావడం లేదు" అని అన్నాడు.
పాన్ ఇండియా మోజులో..
సినిమా తీస్తున్న కొద్దీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచన నిర్మాతలకు వచ్చిందని, అందుకే కథలో అనేక మార్పులు చేశారని తమ్మారెడ్డి చెప్పాడు. దాదాపు రెండేళ్ల పాటు రీషూట్లు, మార్పులు చేయడం వల్ల సినిమా బడ్జెట్ పెరిగిపోయిందని, అసలు కథ పక్కదారి పట్టిందని అతడు విశ్లేషించాడు. ఎప్పుడైతే అనవసరమైన హంగులు జోడిస్తారో, అప్పుడే సినిమా తన లక్ష్యం నుంచి పక్కకు వెళ్లిపోతుందని, దీనివల్ల బడ్జెట్, సమయం వృథా అవుతాయని అతడు అభిప్రాయపడ్డాడు. చివరకు అది సినిమాకు నష్టమే చేస్తుందని తెలిపాడు.
బడ్జెట్ అదుపులో ఉంటే లాభమే..
ఒకవేళ ఈ సినిమాను రూ. 100 కోట్ల బడ్జెట్‌లో తీసి ఉంటే కచ్చితంగా లాభాలు వచ్చేవని అతడు చెప్పాడు. "ఈ సినిమా ఎలాగూ సుమారు రూ. 100 కోట్లు వసూలు చేసింది. రూ.200 కోట్లు కూడా చేస్తుంది. బడ్జెట్ అదుపులో ఉండి ఉంటే నిర్మాతలకు లాభం వచ్చేది. కానీ ఈ రోజుల్లో నిర్మాతలు భారీ బడ్జెట్ సినిమాలపైనే దృష్టి పెడుతున్నారు తప్ప, గుర్తుండిపోయే సినిమాలు తీయడం మర్చిపోతున్నారు" అని తమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రేక్షకులదే తప్పు: మారుతి
మరోవైపు దర్శకుడు మారుతి ఈ సినిమా పరాజయంపై స్పందిస్తూ ప్రేక్షకులే కారణమని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. పండుగ సమయంలో ఉండటం వల్ల ప్రేక్షకులు సినిమాలోని లోతైన కథను అర్థం చేసుకోలేకపోయారని అతడు అన్నాడు. కేవలం వినోదాన్ని ఆశించి రావడం వల్ల సినిమా అసలు కథ వారికి కనెక్ట్ కాలేదని ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మారుతి చెప్పుకొచ్చాడు. పండుగ మూడ్‌లో తేలికపాటి వినోదాన్ని కోరుకోవడం వల్ల సినిమాలోని లేయర్స్ గమనించలేకపోయారని అతడు అభిప్రాయపడ్డాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


