Giri Babu Death: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. పాపులర్ సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత.. 600కు పైగా సినిమాలు.. హీరో, విలన్!

Giri Babu Death: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు, విలక్షణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గిరిబాబు (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

Published on: Nov 14, 2026, 16:19:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Giri Babu Death: టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. విలక్షణమైన పాత్రలతో అలరించిన సీనియర్ నటుడు గిరిబాబు ఇక లేరు. ఆయన ఇవాళ (నవంబర్ 14) కన్నుమూశారు. 1973లో 'జగమే మాయ' చిత్రంతో కెరీర్ ప్రారంభించి సుమారు 600కు పైగా సినిమాల్లో నటించారు. ఆయన కుమారుడు రఘుబాబు టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. గిరిబాబు మరణ వార్త విని సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. పాపులర్ సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత.. 600కు పైగా సినిమాలు!
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. పాపులర్ సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత.. 600కు పైగా సినిమాలు!

ప్రకాశం జిల్లా నుంచి మద్రాస్ ప్రయాణం

గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. ఆయన 1946 జూన్ 8న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలోని ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే కళారంగం, నాటకాలపై ఉన్న ఆసక్తితో సినీ రంగం వైపు అడుగులు వేశారు. ఎన్నో కలలతో అవకాశాల కోసం అప్పటి మద్రాస్ (ప్రస్తుత చెన్నై) నగరానికి వెళ్లి చాలా కష్టాలు పడ్డారు.

సుదీర్ఘ పోరాటం తర్వాత 1973లో వచ్చిన 'జగమే మాయ' సినిమాతో విలన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తన మొదటి సినిమాతోనే నటుడిగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు.

600కు పైగా సినిమాల్లో..

తన కెరీర్ ప్రారంభంలో క్రూరమైన విలన్ పాత్రలతో మెప్పించిన గిరిబాబు, ఆ తర్వాత రోజుల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా విభిన్న పాత్రలు పోషించారు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో సుమారు 600కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. ఏ పాత్ర ఇచ్చినా తన సహజ నటనతో దానికి ప్రాణం పోసేవారు. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ, ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ అప్పటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

నిర్మాతగా, దర్శకుడిగా తనదైన మార్క్

గిరిబాబు కేవలం నటుడిగానే పరిమితం కాలేదు. నిర్మాతగా, దర్శకుడిగా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని దక్కించుకున్నారు. అభిరుచి గల నిర్మాతగా మారి 'దేవతలారా దీవించండి', 'సింహగర్జన', 'మెరుపు దాడి' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అలాగే డైరెక్టర్‌గా మెగాఫోన్ పట్టి 'రణరంగం', 'ఇంద్రజీత్', 'నీ సుఖమే నే కోరుకున్నా' లాంటి సినిమాలకు దర్శకత్వం వహించి తన బహుముఖ ప్రతిభను చాటుకున్నారు.

వారసుడిగా రఘుబాబు

గిరిబాబు సతీమణి శ్రీదేవి 2016లో మూత్రపిండాల వ్యాధితో పోరాడుతూ మరణించారు. ఈ దంపతులకు రఘుబాబు, బోసుబాబు అని ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి అడుగుజాడల్లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రఘుబాబు.. దశాబ్దాలుగా టాలీవుడ్‌లో తనదైన కామెడీ టైమింగ్‌తో అగ్ర హాస్యనటుల్లో ఒకరిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

గిరిబాబు నటించి విడుదలైన చివరి చిత్రం 2023లో వచ్చిన 'అన్నీ మంచి శకునములే'. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More