Vijay Antony: 'బిచ్చగాడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువైన ప్రముఖ తమిళ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ బయటకు ఎంతో ప్రశాంతంగా, నిబ్బరంగా కనిపిస్తుంటారు. కానీ ఆయన మనసు లోపల దాగి ఉన్న తండ్రి గుండెకోత ఎంత లోతైనదో ఆయన భార్య ఫాతిమా విజయ్ ఆంటోనీ తాజాగా ప్రపంచానికి తెలియజేశారు.

2023 సెప్టెంబర్‌లో తమ 16 ఏళ్ల పెద్ద కుమార్తె మీరా ఆకస్మిక మరణం తర్వాత, విజయ్ ఆంటోనీ జీవితం పూర్తిగా మారిపోయిందని ఆమె వెల్లడించారు. నవంబర్ 20న విడుదలైన తండ్రీకూతుళ్ల ఎమోషనల్ డ్రామా 'అప్ప కుట్టి' (Appa Kutty) ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఫాతిమా చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి.
ఇంట్లో కూతురి చెప్పులు చూసి.. చెప్పులు వేసుకోవడమే మానేశారు
మూడేళ్ల క్రితం కూతురు మీరా మరణించిన తర్వాత ఫాతిమా తొలిసారిగా ఒక సినిమా వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన భర్త పడుతున్న మౌన వేదనను ఆమె వివరించారు. “మేము లండన్, అమెరికా వంటి విదేశాలకు వెళ్లినప్పుడల్లా మా కూతురు మీరా కోసం ఎన్నో జతల ఖరీదైన షూస్, చెప్పులు కొన్నాము. ఇప్పటికీ మా ఇంట్లో ఒక గది నిండా మీరా చెప్పులే ఉన్నాయి. వాటిని చూసినప్పుడల్లా విజయ్ తట్టుకోలేకపోయారు. మీరా మరణించినప్పటి నుంచి ఆయన అసలు చెప్పులు వేసుకోవడమే మానేశారు” అని ఫాతిమా వెల్లడించారు.
కేవలం విదేశాల్లో మ్యూజిక్ కాన్సర్ట్స్‌లో ప్రదర్శన ఇచ్చేటప్పుడు తప్ప, మిగిలిన అన్ని సందర్భాల్లోనూ విజయ్ ఆంటోనీ చెప్పులు లేకుండానే నడుస్తున్నారని ఆమె తెలిపారు.
ఆ పాత వాచీని ఒక్క క్షణం కూడా వదలడం లేదు
విజయ్ ఆంటోనీ తన కూతురి జ్ఞాపకాలను ఎంతగా గుండెల్లో దాచుకున్నారో చెబుతూ ఫాతిమా మరో హృదయవిదారక విషయాన్ని పంచుకున్నారు.
{{/usCountry}}విజయ్ ఆంటోనీ తన కూతురి జ్ఞాపకాలను ఎంతగా గుండెల్లో దాచుకున్నారో చెబుతూ ఫాతిమా మరో హృదయవిదారక విషయాన్ని పంచుకున్నారు.
{{/usCountry}}“విజయ్ వద్ద ఎన్నో ఖరీదైన బ్రాండెడ్ వాచీలు ఉన్నాయి. కానీ ఆయన వాటిని ముట్టుకోవడం లేదు. మీరా మరణించడానికి ముందు, ఆయన చివరిసారిగా ఆమెను చూసినప్పుడు మీరా చేతికి ఒక పాత వాచీ ఉంది. ఆమె చనిపోయినప్పటి నుంచి ఇప్పటివరకు విజయ్ ఆ వాచీని తన చేతికి పెట్టుకునే ఉన్నారు.. ఒక్క క్షణం కూడా దానిని తీయలేదు” అని ఫాతిమా భావోద్వేగానికి గురయ్యారు.
అంతేకాకుండా తన చిన్నతనంలో ఏడేళ్ల వయసులోనే తండ్రి తమ కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయారని, ఆ తర్వాత తన జీవితంలో లోటుగా ఉన్న ఆ ప్రేమను, అండను విజయ్ ఆంటోనీయే ఇచ్చారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఈ వేడుకకు విజయ్ చిన్న కుమార్తె లారా కూడా హాజరైంది.
'అప్ప కుట్టి'తో తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ..
2023 సెప్టెంబర్ 19న చెన్నైలోని నివాసంలో మీరా మరణించినప్పుడు.. “నాలో ఒక భాగం నా కూతురితో పాటే చనిపోయింది.. కానీ ఆమె ఆత్మరూపంలో నాతోనే ఉంది” అంటూ విజయ్ ఆంటోనీ రాసిన లేఖ అందరినీ కదిలించింది. అప్పటి నుంచి తమ నిర్మాణ సంస్థ 'విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్' నిర్మించే ప్రతి సినిమా టైటిల్ కార్డ్స్‌లో మీరా పేరును వేస్తూ ఆమెకు నివాళులర్పిస్తున్నారు.
ఇక ము మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ, ప్రీతి అస్రానీ ప్రధాన పాత్రల్లో నటించిన తండ్రీకూతుళ్ల భావోద్వేగభరిత చిత్రం ‘అప్ప కుట్టి’ నవంబర్ 20న (ధనుష్ 'ఓం', దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' చిత్రాలకు పోటీగా) థియేటర్లలో విడుదలైంది. నిజ జీవితంలో కూతురిని కోల్పోయిన బాధను దిగమింగుకుంటూ విజయ్ ఆంటోనీ నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.