Vijay Antony: కూతురు చనిపోయినప్పటి నుంచీ చెప్పులు వేసుకోవడం మానేసిన స్టార్ హీరో.. ఆమె వాచే పెట్టుకుంటూ.. భార్య ఎమోషనల్
Vijay Antony: నటుడు విజయ్ ఆంటోనీ తన పెద్ద కూతురు మీరా మరణం తర్వాత ఎదుర్కొంటున్న మౌన వేదన గురించి ఆయన భార్య ఫాతిమా కన్నీటి పర్యంతమయ్యారు. 2023 సెప్టెంబర్‌లో 16 ఏళ్ల మీరా మరణించినప్పటి నుంచి ఇంట్లో ఆమె కోసం కొన్న చెప్పులను చూసి తట్టుకోలేక విజయ్ ఆంటోనీ చెప్పులు వేసుకోవడమే మానేశారని ఫాతిమా వెల్లడించారు.
Vijay Antony: 'బిచ్చగాడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువైన ప్రముఖ తమిళ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ బయటకు ఎంతో ప్రశాంతంగా, నిబ్బరంగా కనిపిస్తుంటారు. కానీ ఆయన మనసు లోపల దాగి ఉన్న తండ్రి గుండెకోత ఎంత లోతైనదో ఆయన భార్య ఫాతిమా విజయ్ ఆంటోనీ తాజాగా ప్రపంచానికి తెలియజేశారు.

2023 సెప్టెంబర్‌లో తమ 16 ఏళ్ల పెద్ద కుమార్తె మీరా ఆకస్మిక మరణం తర్వాత, విజయ్ ఆంటోనీ జీవితం పూర్తిగా మారిపోయిందని ఆమె వెల్లడించారు. నవంబర్ 20న విడుదలైన తండ్రీకూతుళ్ల ఎమోషనల్ డ్రామా 'అప్ప కుట్టి' (Appa Kutty) ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఫాతిమా చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి.
ఇంట్లో కూతురి చెప్పులు చూసి.. చెప్పులు వేసుకోవడమే మానేశారు
మూడేళ్ల క్రితం కూతురు మీరా మరణించిన తర్వాత ఫాతిమా తొలిసారిగా ఒక సినిమా వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన భర్త పడుతున్న మౌన వేదనను ఆమె వివరించారు. “మేము లండన్, అమెరికా వంటి విదేశాలకు వెళ్లినప్పుడల్లా మా కూతురు మీరా కోసం ఎన్నో జతల ఖరీదైన షూస్, చెప్పులు కొన్నాము. ఇప్పటికీ మా ఇంట్లో ఒక గది నిండా మీరా చెప్పులే ఉన్నాయి. వాటిని చూసినప్పుడల్లా విజయ్ తట్టుకోలేకపోయారు. మీరా మరణించినప్పటి నుంచి ఆయన అసలు చెప్పులు వేసుకోవడమే మానేశారు” అని ఫాతిమా వెల్లడించారు.
కేవలం విదేశాల్లో మ్యూజిక్ కాన్సర్ట్స్లో ప్రదర్శన ఇచ్చేటప్పుడు తప్ప, మిగిలిన అన్ని సందర్భాల్లోనూ విజయ్ ఆంటోనీ చెప్పులు లేకుండానే నడుస్తున్నారని ఆమె తెలిపారు.
ఆ పాత వాచీని ఒక్క క్షణం కూడా వదలడం లేదు
విజయ్ ఆంటోనీ తన కూతురి జ్ఞాపకాలను ఎంతగా గుండెల్లో దాచుకున్నారో చెబుతూ ఫాతిమా మరో హృదయవిదారక విషయాన్ని పంచుకున్నారు.
“విజయ్ వద్ద ఎన్నో ఖరీదైన బ్రాండెడ్ వాచీలు ఉన్నాయి. కానీ ఆయన వాటిని ముట్టుకోవడం లేదు. మీరా మరణించడానికి ముందు, ఆయన చివరిసారిగా ఆమెను చూసినప్పుడు మీరా చేతికి ఒక పాత వాచీ ఉంది. ఆమె చనిపోయినప్పటి నుంచి ఇప్పటివరకు విజయ్ ఆ వాచీని తన చేతికి పెట్టుకునే ఉన్నారు.. ఒక్క క్షణం కూడా దానిని తీయలేదు” అని ఫాతిమా భావోద్వేగానికి గురయ్యారు.
అంతేకాకుండా తన చిన్నతనంలో ఏడేళ్ల వయసులోనే తండ్రి తమ కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయారని, ఆ తర్వాత తన జీవితంలో లోటుగా ఉన్న ఆ ప్రేమను, అండను విజయ్ ఆంటోనీయే ఇచ్చారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఈ వేడుకకు విజయ్ చిన్న కుమార్తె లారా కూడా హాజరైంది.
'అప్ప కుట్టి'తో తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ..
2023 సెప్టెంబర్ 19న చెన్నైలోని నివాసంలో మీరా మరణించినప్పుడు.. “నాలో ఒక భాగం నా కూతురితో పాటే చనిపోయింది.. కానీ ఆమె ఆత్మరూపంలో నాతోనే ఉంది” అంటూ విజయ్ ఆంటోనీ రాసిన లేఖ అందరినీ కదిలించింది. అప్పటి నుంచి తమ నిర్మాణ సంస్థ 'విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్' నిర్మించే ప్రతి సినిమా టైటిల్ కార్డ్స్‌లో మీరా పేరును వేస్తూ ఆమెకు నివాళులర్పిస్తున్నారు.
ఇక ము మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ, ప్రీతి అస్రానీ ప్రధాన పాత్రల్లో నటించిన తండ్రీకూతుళ్ల భావోద్వేగభరిత చిత్రం ‘అప్ప కుట్టి’ నవంబర్ 20న (ధనుష్ 'ఓం', దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' చిత్రాలకు పోటీగా) థియేటర్లలో విడుదలైంది. నిజ జీవితంలో కూతురిని కోల్పోయిన బాధను దిగమింగుకుంటూ విజయ్ ఆంటోనీ నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


