Virat Kohli: విరాట్ కోహ్లి, అనుష్క శర్మ రూ.32 కోట్ల విలువైన అలీబాగ్ విల్లా లోపల ఎలా ఉందో చూస్తారా? ఆ ఇంద్ర భవనం వీడియో

విరాట్ కోహ్లి, అనుష్క శర్మ అలీబాగ్ లో రూ.32 కోట్లతో కట్టుకున్న లగ్జరీ విల్లా చూశారా? దీని లోపలి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లియే తన లగ్జరీ విల్లా లోపల ఎలా ఉందో చూపించడం విశేషం. మరి ఆ ఇంద్ర భవనం ఎలా ఉందో చూడండి.

Published on: Feb 26, 2026, 17:13:59 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల అలీబాగ్ హాలిడే హోమ్ కొత్త, పాత కలయికలు, పచ్చని ప్రకృతి మధ్య ఓ ఇంద్రభవనంలా అనిపించడం ఖాయం. ప్రముఖ గుడ్ హోమ్స్ మ్యాగజైన్ ఫిబ్రవరి 24న ఒక పోస్ట్‌ను పంచుకుంటూ.. ఈ దంపతుల అందమైన ఇంటికి సంబంధించిన వీడియోను అభిమానులకు చూపించింది. ఆ ఇంటి లోపలి విశేషాలు ఇక్కడ వివరంగా చూద్దాం.

Virat Kohli: విరాట్ కోహ్లి, అనుష్క శర్మ రూ.32 కోట్ల విలువైన అలీబాగ్ విల్లా లోపల ఎలా ఉందో చూస్తారా? ఆ ఇంద్ర భవనం వీడియో (AD India)
Virat Kohli: విరాట్ కోహ్లి, అనుష్క శర్మ రూ.32 కోట్ల విలువైన అలీబాగ్ విల్లా లోపల ఎలా ఉందో చూస్తారా? ఆ ఇంద్ర భవనం వీడియో (AD India)

విరాట్, అనుష్కల అలీబాగ్ ఇంటి వీడియో టూర్

ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ ఇండియా కథనం ప్రకారం.. విరాట్ కోహ్లీ, అనుష్కల ఈ హాలిడే హోమ్‌ను ఎస్.ఏ.ఓ.టి.ఏ డిజైన్ చేసింది. పది వేల చదరపు అడుగుల సువిశాల స్థలంలో నిర్మించిన ఈ విల్లా విలువ సుమారు రూ.32 కోట్లు ఉంటుందని గతేడాది జనవరిలో వచ్చిన మింట్ నివేదిక అంచనా వేసింది.

ఈ భారీ భవనంలో లెక్కలేనన్ని విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. ఇందులో ఖరీదైన ఇంటీరియర్, టెంపరేచర్ ను నియంత్రించే స్విమ్మింగ్ పూల్, ప్రత్యేకమైన కిచెన్, నాలుగు బాత్‌రూమ్‌లు, విశాలమైన పచ్చని తోట, కవర్డ్ పార్కింగ్, సిబ్బంది కోసం ప్రత్యేక క్వార్టర్స్ ఉన్నాయి. స్వచ్ఛమైన రాళ్లు, విదేశాల నుంచి తెప్పించిన ఇటాలియన్ మార్బుల్స్, రా ట్రావెర్టైన్, టర్కిష్ లైమ్‌స్టోన్‌తో ఈ ఇంటిని ఎంతో ఆకర్షణీయంగా నిర్మించడం విశేషం.

ఇంటి లోపలి అద్భుతమైన డిజైన్

ఈ దంపతుల ఇంటి లోపలికి అడుగుపెడితే, సహజమైన కలపతో డిజైన్ చేసిన డబుల్-హైట్ కట్-అవుట్ సీలింగ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇల్లు మొత్తం ఎంతో విశాలమైన ఓపెన్ లేఅవుట్‌ను కలిగి ఉంటుంది. వీటికి తోడు పెద్ద కిటికీలు, అద్దాలతో కూడిన గోడల గుండా సహజమైన సూర్యరశ్మి ఇంటి లోపలికి బాగా వస్తుంది.

గదులకు ఉన్న విశాలమైన బాల్కనీల నుంచి చూస్తే సహ్యాద్రి పర్వత శ్రేణుల అందాలను కనులారా ఆస్వాదించవచ్చు. ఎంతో నైపుణ్యంతో ఎంపిక చేసిన ఫర్నిచర్, బయోఫిలిక్ ఇంటీరియర్స్ ఈ విల్లాకు ఉన్న ఖరీదైన, మినిమలిస్ట్ వాతావరణాన్ని మరింత ఇనుమడింపజేస్తాయి.

ఇంటి చుట్టూ ఉన్న సువిశాలమైన తోట, అందులో ఆహ్లాదకరంగా భోజనం చేసేందుకు ఏర్పాటు చేసిన ఆల్ ఫ్రెస్కో డైనింగ్ ఏరియా విల్లా అందానికి సరిగ్గా సరిపోతాయి. ఆధునిక ఆర్కిటెక్చర్, ప్రకృతికి మధ్య సమతుల్యతను పాటిస్తూ ఇది ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని పంచుతుంది.

ఇతర ఫీచర్లు.. విరాట్ మాటల్లో విల్లా విశేషాలు

ఈ విల్లాలో సిర్కాడియన్ లైటింగ్, గ్యాస్ లీక్ డిటెక్టర్లు, అత్యాధునిక గాలి, నీటి వడపోత వ్యవస్థలు తదితర ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ విల్లా గురించి విరాట్ ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ ఇండియాతో మాట్లాడుతూ.. "నేను ఎప్పుడూ సెలవుల్లో ఉన్నట్లుగా అనిపించదు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడూ ఒకే రకమైన డైట్, ఒకే రకమైన ట్రైనింగ్ రొటీన్‌ను పాటిస్తుంటాను. కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఉదయం నిద్రలేచి, రిలాక్స్ అవుతాను. నిమ్మకాయ నీళ్లు, ఒక కప్పు కాఫీ తాగుతూ ప్రశాంతంగా రోజును సరికొత్తగా ప్రారంభిస్తాను" అని వివరించాడు.

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల గురించి..

విరాట్ కోహ్లీ భారత క్రికెట్ జట్టులో అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్ కాగా, అనుష్క శర్మ ఎన్నో అవార్డులు గెలుచుకున్న గొప్ప నటి, నిర్మాత. 2013లో ఒక యాడ్ షూటింగ్ సమయంలో వీరి పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత డిసెంబర్ 11, 2017న ఇటలీలో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. కూతురు వామిక జనవరి 11, 2021న జన్మించగా.. కుమారుడు అకాయ్ ఫిబ్రవరి 15, 2024న జన్మించాడు.

అలీబాగ్ విల్లాతో పాటుగా విరాట్, అనుష్కలు ముంబైలో 7171 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రూ.34 కోట్ల విలువైన లగ్జరీ ఇంట్లో కూడా నివసిస్తున్నారని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అలాగే గురుగ్రామ్‌లో ఈ క్రికెటర్‌కు రూ.80 కోట్ల విలువైన మరో భారీ బంగ్లా కూడా ఉంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More