Virosh Wedding Guests: ఉదయ్‌పూర్‌కు మొదలైన సెలబ్రిటీల తాకిడి.. విజయ్, రష్మిక పెళ్లికి కలిసి వచ్చిన తరుణ్, ఈషా జోడీ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (Wedding of VIROSH) పెళ్లి కోసం ఉదయ్‌పూర్ కు సెలబ్రిటీల తాకిడి మొదలైంది. మొదటగా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ కలిసి అక్కడి ఎయిర్‌పోర్టులో దిగడం విశేషం. 100 మంది అతిథుల మధ్య వీళ్ల పెళ్లి జరగనున్నట్లు సమాచారం.
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటి కావడానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఉదయ్‌పూర్‌లోని ఒక విలాసవంతమైన హోటల్‌లో వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే అతిథులు ఉదయ్‌పూర్ చేరుకోవడం ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేశారు. ఈ ఇద్దరూ రిలేషన్షిప్‌లో ఉన్నారన్న పుకార్ల నేపథ్యంలో కలిసే పెళ్లికి వెళ్లడం విశేషం.

ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో సినీ ప్రముఖుల సందడి..
మరో రెండు రోజుల్లోనే విజయ్, రష్మిక పెళ్లితో ఒక్కటవనున్నారు. అభిమానులు ఎంతో ప్రేమగా 'విరోష్' (VIROSH) అని పిలుచుకునే ఈ జంట రాయల్ వెడ్డింగ్ ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ప్రతిష్టాత్మక 'మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్'లో (Mementos by ITC Hotels) అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ పెళ్లి వేడుకల కోసం అటు ఇరు కుటుంబాలతో పాటు ఇటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ గ్రాండ్ పెళ్లికి కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులకు మాత్రమే ఆహ్వానం అందింది. పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులను పిలిచినట్లు తెలుస్తోంది. వారిలో టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, అందాల నటి ఈషా రెబ్బా కూడా ఉన్నారు. ఈ ఇద్దరూ మంగళవారం (ఫిబ్రవరి 24) ఉదయం ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం దిగి వేదిక వద్దకు వెళ్తూ కనిపించారు. వీరితో పాటు ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ కూడా ఉన్నారు. అభిమానులు ఈ ఫోటోలను షేర్ చేస్తూ పెళ్లి సందడి అప్పుడే మొదలైందని కామెంట్స్ చేస్తున్నారు.
కేవలం 100 మంది అతిథులే..
తాజాగా వస్తున్న రిపోర్టుల ప్రకారం ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు కేవలం 100 మంది అతిథులను మాత్రమే ఎంపిక చేసి ఆహ్వానించారు. విజయ్ దేవరకొండ కెరీర్‌లో మైలురాయి లాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకులు ఈ ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో ఉన్నారని సమాచారం. అందులో విజయ్‌కు 'పెళ్లి చూపులు' లాంటి హిట్ ఇచ్చిన తరుణ్ భాస్కర్, 'అర్జున్ రెడ్డి' తో స్టార్ డమ్ తెచ్చిపెట్టిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్..
ఫిబ్రవరి 26న జరగనున్న ఈ సాంప్రదాయ వివాహ వేడుకకు హాజరయ్యే ఇతర ముఖ్య అతిథుల వివరాలు, వేదిక వద్ద చేసిన విలాసవంతమైన ఏర్పాట్లు, డెకరేషన్స్ గురించి పెళ్ళికి ముందు మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది. ఉదయ్‌పూర్‌లో కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితుల మధ్య పెళ్లి ముగిసిన తర్వాత.. సినీ పరిశ్రమకు చెందిన ఇతర ప్రముఖులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం మార్చి 4న హైదరాబాద్‌లో ఒక భారీ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ఖరారైంది.

E-Paper












