Yami Gautam: సినిమా కోసం నాలుగు నెలలు కష్టపడి ఖురాన్ నేర్చుకున్న నటి.. షాజియా బానోగా జీవించేసింది
Yami Gautam: ఓ సినిమా కోసం యామీ గౌతమ్ నాలుగు నెలలు కష్టపడి ఖురాన్ నేర్చుకుందంటే నమ్మగలరా? ఈ విషయాన్ని ఆ మూవీ డైరెక్టరే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇమ్రాన్ హష్మి లీడ్ రోల్లో నటించిన హక్ మూవీలో షాజియా బానోగా ఆమె జీవించేసింది.
Yami Gautam: లీగల్ డ్రామా ‘హక్’ (Haq) లో ముస్లిం మహిళ షాజియా బానోగా మెప్పించేందుకు నటి యామీ గౌతమ్ ఏకంగా నాలుగు నెలల పాటు ఖురాన్ పఠనం నేర్చుకున్నారట. దేశ చరిత్రలోనే చరిత్రాత్మకమైన ‘షా బానో’ కేసు ఆధారంగా రూపొందిన ఈ మూవీ గురించి దర్శకుడు సుపర్ణ్ వర్మ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

నాలుగు నెలల కఠిన సాధన..
నటన పట్ల అత్యంత అంకితభావం కలిగిన నటీమణులలో యామీ గౌతమ్ ఒకరని మరోసారి నిరూపితమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘హక్’ (Haq) మూవీ గత ఏడాది థియేటర్లలో విడుదలై.. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో సినిమా దర్శకుడు సుపర్ణ్ వర్మ ఇటీవల బీబీసీ ఏషియన్ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా వెనుక జరిగిన భారీ కసరత్తు గురించి వివరించారు.
ఈ సినిమాలో షాజియా బానో పాత్రలో పరకాయ ప్రవేశం చేసేందుకు యామీ గౌతమ్ ఎంతగానో శ్రమించారు. “నేను యామీతో స్వయంగా ఖురాన్ చదవడం నేర్పించాను. ఆ పవిత్ర గ్రంథంలోని మాండలికం, అరబిక్ పదాల ఉచ్చారణను అర్థం చేసుకోవడానికి ఆమె ఏకంగా నాలుగు నెలల సమయాన్ని వెచ్చించింది” అని దర్శకుడు సుపర్ణ్ వర్మ ప్రశంసించారు.
కేవలం డైలాగులు చెప్పడం మాత్రమే కాకుండా, ఆ పాత్రలోని సాంస్కృతిక, మతపరమైన లోతును ప్రతిబింబించేందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు.
ఒకటిన్నర ఏళ్ల సుదీర్ఘ పరిశోధన..
దర్శకుడు సుపర్ణ్ వర్మ మాట్లాడుతూ కేవలం నటీనటులే కాకుండా చిత్ర బృందం మొత్తం ఈ ప్రాజెక్ట్ కోసం భారీగా పరిశోధన చేసినట్లు తెలిపారు.
“మేము ఇస్లామిక్ చట్టాన్ని, దానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు గడిపాము” అని ఆయన వెల్లడించారు.
ఈ కాలంలో సోషల్ మీడియాలో మతం గురించి తప్పుడు సమాచారం ఎక్కువగా ప్రచారమవుతున్న తరుణంలో.. ‘హక్’ సినిమా ఒక హేతుబద్ధంగా నిలవాలని తాము ఆశించినట్లు ఆయన పేర్కొన్నారు.
షా బానో కేసు స్ఫూర్తితో..
ఈ హక్ మూవీ 1985లో భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన సంచలన తీర్పు ‘మొహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షా బానో బేగం’ కేసు ఆధారంగా రూపొందింది. విడాకుల తర్వాత ముస్లిం మహిళలకు భరణం పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన ఈ కేసు భారత న్యాయ చరిత్రలో ఒక మైలురాయి.
సినిమాలో యామీ గౌతమ్ తన హక్కుల కోసం భర్తతో న్యాయపోరాటం చేసే ధైర్యవంతురాలైన మహిళగా అద్భుతంగా నటించారు. ఇందులో ఆమె భర్తగా ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో మెరిశారు.
‘ఆర్టికల్ 370’ వంటి దేశభక్తి చిత్రాలతో భారీ విజయాలను అందుకున్న యామీ గౌతమ్.. ‘హక్’ మూవీతో తన నటనలోని వైవిధ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు. మహిళా హక్కులు, సామాజిక న్యాయం, చట్టపరమైన అంశాలను మేళవించిన ఈ చిత్రం నేటి సమాజానికి కూడా ఎంతో అవసరమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


