వంట గది పనులు క్షణాల్లో పూర్తి: చెఫ్ చెప్పిన 5 మేజిక్ కిచెన్ హాక్స్ ఇవే

వంటగదిలో శ్రమ తగ్గించి, సమయాన్ని ఆదా చేసే 5 ఉపయోగకరమైన చిట్కాలను హ్యామిల్టన్‌కు చెందిన ప్రముఖ చెఫ్ ఫావ్రా మార్క్ పంచుకున్నారు. బ్లెండర్ శుభ్రం చేయడం నుంచి బియ్యంలో పురుగులు పడకుండా చూడటం వరకు ఈ కిచెన్ ట్రిక్స్ ఎంతో ఉపయోగపడతాయి.

Published on: Sep 29, 2026, 16:25:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

వంటగదిలో గంటల తరబడి శ్రమించకుండా కొన్ని చిన్న చిన్న మార్పులతో పనులను సులభంగా, వేగంగా పూర్తి చేసుకోవచ్చని ప్రముఖ చెఫ్ ఫావ్రా మార్క్ చెబుతున్నారు. కెనడాలోని హ్యామిల్టన్‌కు చెందిన ఈ ఫుడ్ అండ్ లైఫ్‌స్టైల్ క్రియేటర్, తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా రోజువారీ వంట, క్లీనింగ్ పనులను సులభతరం చేసే 5 అద్భుతమైన కిచెన్ హ్యాక్స్‌ను పంచుకున్నారు. ఆ వివరాలు ఇవే:

వంట గది పనులు క్షణాల్లో పూర్తి: చెఫ్ చెప్పిన 5 మేజిక్ కిచెన్ హాక్స్ ఇవే
వంట గది పనులు క్షణాల్లో పూర్తి: చెఫ్ చెప్పిన 5 మేజిక్ కిచెన్ హాక్స్ ఇవే

1. బ్లెండర్ క్లీనింగ్ కేవలం 10 సెకన్లలో

బ్లేడ్ల కింద మిరప గింజలు, చట్నీలు లేదా స్మూతీ ముక్కలు ఇరుక్కుపోయినప్పుడు బ్లెండర్‌ను శుభ్రం చేయడం కాస్త విసుగుతో కూడుకున్న పని. "బ్లెండర్‌ను సగం వరకు గోరువెచ్చని నీటితో నింపి, ఒక చుక్క డిష్ వాష్ సోప్ వేయాలి. ఆపై 10 సెకన్ల పాటు బ్లెండ్ చేసి, సాధారణ నీటితో కడిగేస్తే సరిపోతుంది" అని ఫావ్రా వివరించారు. ఈ పద్ధతి వల్ల బ్లేడ్ల కింద ఉన్న మొండి మరకలు రుద్దే పనిలేకుండా తేలిగ్గా వదిలిపోతాయి.

2. నూనెలో మసాలాలు ముందుగా వేయడం

కూరలు వండేటప్పుడు నేరుగా పదార్థాలలో మసాలాలు వేసే కంటే, నూనెలో ముందుగా మసాలాలు వేయించాలని ఫావ్రా సూచిస్తున్నారు. "గుడ్లు ఫ్రై చేసేప్పుడు, లేదా సూప్‌లు, సాస్‌లు తయారు చేసేముందు నూనెను వేడి చేసి వెల్లుల్లి, కరివేపాకు, బిర్యానీ ఆకు వంటి మసాలా దినుసులను 30 సెకన్ల పాటు వేయించాలి" అని ఆమె పేర్కొన్నారు. ఈ పద్ధతి వల్ల నూనెలోకి మసాలా సువాసనలు బాగా ఇంకి, వంటకానికి అదనపు రుచి వస్తుంది.

3. నిమ్మకాయతో మైక్రోవేవ్ డీప్ క్లీనింగ్

మైక్రోవేవ్‌లో పేరుకుపోయిన మొండి జిడ్డు మరకలు, ఆహార వాసనలను పోగొట్టడానికి ఆవిరి, నిమ్మకాయ కలయిక అద్భుతంగా పనిచేస్తుంది. "ఒక గిన్నె నీటిలో కోసిన నిమ్మకాయ ముక్కలను వేసి, ఒక నిమిషం పాటు మైక్రోవేవ్ చేయాలి. ఆవిరి వల్ల జిడ్డు మరకలు సడలిపోతాయి. నిమ్మకాయ దుర్వాసనను దూరం చేస్తుంది. ఆ తర్వాత తుడిచేస్తే మైక్రోవేవ్ శుభ్రమవుతుంది" అని ఫావ్రా వెల్లడించారు. ఘాటైన కెమికల్స్ వాడకుండా మైక్రోవేవ్‌ను శుభ్రం చేయడానికి ఇది సులువైన మార్గం.

4. పీనట్ బటర్ జార్‌ను తిరగేసి ఉంచడం

పీనట్ బటర్ జార్ తెరిచినప్పుడు నూనె పైకి తేలి, కింద భాగం గట్టిపడటం చాలామంది చూసే ఉంటారు. దీన్ని నివారించడానికి జార్‌ను తిరగేసి (బోర్లా) ఉంచాలని మార్క్ సలహా ఇస్తున్నారు. "పీనట్ బటర్ జార్‌ను తలకిందులుగా నిల్వ చేయడం వల్ల నూనె వేరుపడకుండా ఉంటుంది, ప్రతిసారీ సాఫ్ట్‌గా లభిస్తుంది" అని ఆమె చెప్పారు. వాడుకునే ముందు జార్‌ను మామూలుగా తిప్పి, అవసరమైతే ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది.

5. బియ్యంలో బిర్యానీ ఆకులు

బియ్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచినప్పుడు పురుగులు పట్టే అవకాశం ఉంటుంది. దీన్ని అరికట్టేందుకు బియ్యం డబ్బాలో 2 నుంచి 3 బిర్యానీ ఆకులను వేయాలని చెఫ్ సూచిస్తున్నారు. బిర్యానీ ఆకుల ఘాటైన సువాసన పురుగులను దూరంగా ఉంచుతుంది. అయితే బియ్యం పాడవకుండా ఉండటానికి గాలి చొరబడని, పొడి డబ్బాలోనే నిల్వ చేయడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

ఈ చిన్న చిన్న మెళకువలను పాటించడం ద్వారా వంటగది పనులను వేగంగా పూర్తి చేయడమే కాకుండా పదార్థాలను ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవచ్చు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More