క్యూఆర్ కోడ్ ఇన్విటేషన్లు, అచ్చ తెలుగు ఆచారాలు.. అల్లు శిరీష్-నయనిక పెళ్లి వెనుక ఇన్ని విశేషాలా!

మెగా హీరో అల్లు శిరీష్, నయనికా రెడ్డిల వివాహం సంప్రదాయం, ఆధునికత కలబోతగా జరిగింది. కేవలం ఆడంబరాలకే పరిమితం కాకుండా, ప్రతి ఆచారాన్ని గౌరవిస్తూ సాగిన ఈ వేడుక విశేషాలను వెడ్డింగ్ ప్లానర్ దేవాన్షి పటేల్ ప్రత్యేకంగా పంచుకున్నారు.

Published on: Mar 11, 2026 4:51 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుమారుడు, నటుడు అల్లు శిరీష్ తన చిరకాల ప్రియురాలు నయనికా రెడ్డిని వివాహం చేసుకున్నారు. మార్చి 6న హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా, అచ్చమైన తెలుగు సంప్రదాయ పద్ధతిలో వీరి కల్యాణం జరిగింది. హార్దిక్ పాండ్యా, అనంత్ అంబానీ వంటి ప్రముఖుల వేడుకలను నిర్వహించిన ‘శ్రీమ్ ఈవెంట్స్’ వ్యవస్థాపకురాలు దేవాన్షి పటేల్ ఈ వివాహానికి వెడ్డింగ్ ప్లానర్‌గా వ్యవహరించారు. ఈ వేడుకలో దాగిన ఆసక్తికర విశేషాలను ఆమె పంచుకున్నారు.

క్యూఆర్ కోడ్ ఇన్విటేషన్లు, అచ్చ తెలుగు ఆచారాలు.. అల్లు శిరీష్-నయనిక పెళ్లి (Pic credit: Cupcake Productions)
క్యూఆర్ కోడ్ ఇన్విటేషన్లు, అచ్చ తెలుగు ఆచారాలు.. అల్లు శిరీష్-నయనిక పెళ్లి (Pic credit: Cupcake Productions)

ఆడంబరం కంటే అనుబంధానికే ప్రాధాన్యం

పెళ్లికి మూడు నెలల ముందే శిరీష్, నయనికలు తనను కలిశారని దేవాన్షి తెలిపారు. “కేవలం కంటికి కనిపించే హంగులు, ట్రెండీ డెకరేషన్ల కంటే.. పెళ్లికి వచ్చే ప్రతి అతిథికి ఒక ఆత్మీయ అనుభూతి కలగాలని వారు కోరుకున్నారు. శిరీష్, నయనిక ఇద్దరూ చాలా ప్రశాంతమైన స్వభావం కలవారు. అందుకే వారి వేడుకలు కూడా మూలాలను మరిచిపోకుండా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ప్లాన్ చేశాం” అని ఆమె వివరించారు.

టెక్నాలజీతో కూడిన భద్రత

ఈ హైప్రొఫైల్ వెడ్డింగ్‌కు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వీఐపీలు భారీగా తరలివచ్చారు. దుబాయ్‌లో జరిగిన ప్రీ-వెడ్డింగ్ బాష్ తర్వాత హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించారు. ఇంతమంది ప్రముఖులు వస్తున్నప్పుడు భద్రత, గోప్యత చాలా కీలకం. “అతిథుల రాకపోకలు సులభతరం చేసేందుకు ‘క్యూఆర్ కోడ్’ (QR-based) ఆధారిత ఆహ్వాన పత్రికలను రూపొందించాం. అల్లు అరవింద్, అల్లు స్నేహారెడ్డి స్వయంగా ఈ ఆలోచన చేశారు” అని దేవాన్షి పేర్కొన్నారు.

అల్లు శిరీష్, నయనిక రెడ్డి వివాహ వేడుకలు (Pic credit: Cupcake Productions)
అల్లు శిరీష్, నయనిక రెడ్డి వివాహ వేడుకలు (Pic credit: Cupcake Productions)

మల్లెపూల పరిమళాలు.. పంక్తి భోజనాలు

తెలుగు వారి పెళ్లి అంటే మల్లెపూలు, పంక్తి భోజనాలు ఉండాల్సిందే. ఈ పెళ్లిలోనూ అవే హైలైట్‌గా నిలిచాయి. అతిథులకు స్వాగతం పలికేందుకు ప్రత్యేకంగా ‘గజ్రా’ (మల్లెపూల మాలలు) స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇక భోజనాల విషయానికొస్తే.. అందరూ కలిసి కూర్చుని తినేలా సంప్రదాయ ‘బంతి భోజనం’ ఏర్పాటు చేయడం విశేషం.

తలంబ్రాల వేడుక (Pic credit: Cupcake Productions)
తలంబ్రాల వేడుక (Pic credit: Cupcake Productions)

ఆచారాలకు పెద్దపీట

నేటి కాలంలో పెళ్లి ఆచారాలను చాలామంది క్లుప్తంగా ముగించేస్తుంటారు. కానీ శిరీష్ మాత్రం ఏ ఒక్క సంప్రదాయాన్ని వదలకూడదని నిశ్చయించుకున్నారు. “గణేష్ పూజ నుంచి జీలకర్ర బెల్లం, తలంబ్రాలు, పాణిగ్రహణం, మెట్టు, సప్తపది.. ఇలా ఉంగరాల బిందె వరకు ప్రతి క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించాం” అని ప్లానర్ వెల్లడించారు.

శిరీష్ చేతిపై నయనిక పేరు.. తిరుమల నామం

పెళ్లిలో మరో ఆకర్షణ శిరీష్ మెహందీ. సాధారణంగా వరుడు మెహందీకి దూరంగా ఉంటారు, కానీ శిరీష్ తన సంప్రదాయంపై ఉన్న గౌరవంతో చేతిపై తిరుమల శ్రీవారి ‘నామం’ వేయించుకున్నారు. దాంతో పాటు నయనిక పేరును కూడా మెహందీలో చేర్చుకుని తన ప్రేమను చాటుకున్నారు.

అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అభినవ్, ప్రవల్లిక.. ఇలా కుటుంబ సభ్యులంతా ఒక్కటై ఈ వేడుకను విజయవంతం చేశారని దేవాన్షి పటేల్ తెలిపారు. భారీగా తరలివచ్చే అభిమానులను కంట్రోల్ చేస్తూ, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సెక్యూరిటీ టీమ్స్ సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ వేడుక సాఫీగా సాగిందని ఆమె ముగించారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More