Quote of the Day: న్యాయమైన వేతనం ఇవ్వండి.. లేదంటే పనే అప్పగించకండి: మ్యూజిక్ ఇండస్ట్రీలో దోపిడీపై అరిజిత్ సింగ్

నేడు అరిజిత్ సింగ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సంగీత ప్రపంచంలో కళాకారుల శ్రమకు దక్కాల్సిన గుర్తింపు, ఎదుర్కొంటున్న ఆర్థిక వివక్షపై ఆయన గతంలో చేసిన ఘాటు వ్యాఖ్యలు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Published on: Apr 25, 2026, 14:07:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ చలనచిత్ర సంగీతంలో తన గొంతుతో ఒక శకాన్ని సృష్టించిన గాయకుడు అరిజిత్ సింగ్. నేడు (ఏప్రిల్ 25) ఆయన పుట్టినరోజు. 'తుమ్ హీ హో' నుంచి మొన్నటి 'కేసరియా' వరకు ఆయన పాడిన ప్రతి పాట ఒక సంచలనం. అయితే, కేవలం వెండితెరపై వినిపించే గొంతుగానే కాకుండా, ఇండస్ట్రీలో తెరవెనుక జరిగే అన్యాయాలపై గొంతెత్తే ధైర్యవంతుడిగా కూడా అరిజిత్ సింగ్‌కు పేరుంది. ఇటీవల ప్లేబ్యాక్ సింగింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేసిన అరిజిత్, గతంలో సంగీత పరిశ్రమలోని చీకటి కోణాలను వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంగీత ప్రియుల్లో చర్చనీయాంశంగా మారాయి.

గాయకుడు అరిజిత్ సింగ్
గాయకుడు అరిజిత్ సింగ్

కళాకారుల శ్రమ.. వ్యాపారవేత్తల లాభం

డిసెంబర్ 2023లో జరిగిన ఒక పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో అరిజిత్ సింగ్ మ్యూజిక్ ఇండస్ట్రీలోని ఆర్థిక అసమానతలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే గాయకుల్లో ఒకరైనప్పటికీ, సామాన్య కళాకారుల పరిస్థితిపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

"వ్యాపారవేత్తలు వారి ఆటలో వారు కరెక్టుగానే ఉండొచ్చు. కానీ ఈ మొత్తం వ్యాపారం కళాకారుల భుజాల మీద నడుస్తోంది. ఒక బిజినెస్‌మేన్ ఉన్నంత ప్రాక్టికల్‌గా కళాకారుడు ఉండలేడు. కళాకారుడి పని మీదే వ్యాపారం ఆధారపడినప్పుడు, అక్కడ అన్యాయం జరుగుతోందని అందరూ భావిస్తే.. కచ్చితంగా ఏదో తప్పు జరుగుతున్నట్లే. దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి" అని అరిజిత్ పేర్కొన్నారు.

"పేమెంట్ లేకపోతే పనే వద్దు"

ముఖ్యంగా మ్యూజిక్ లేబుల్స్, సినీ నిర్మాతలు కళాకారులతో వ్యవహరించే తీరును ఆయన తప్పుబట్టారు. చేసే పనికి, దక్కే ప్రతిఫలానికి ఎక్కడా పొంతన ఉండటం లేదని ఆయన విశ్లేషించారు.

"ప్రతి విషయంలోనూ పారదర్శకత ఉండాలి. మీరు చేసే పనికి తగిన ప్రతిఫలాన్ని (Fair Pay) ఇవ్వండి.. లేదంటే అసలు ఆ పనే అప్పగించకండి. పడే కష్టానికి తగ్గట్లుగా వేతనం పొందని వారు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ అంతా బేరసారాల (Negotiations) మీదనే నడుస్తోంది" అని ఆయన ఘాటుగా స్పందించారు.

తెలుగు ఇండస్ట్రీకి ఇది ఒక హెచ్చరికేనా?

అరిజిత్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం బాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాదు. మన టాలీవుడ్‌లో కూడా గాయనీ గాయకులు, ముఖ్యంగా వర్ధమాన కళాకారులు రాయల్టీ విషయంలో ఇబ్బందులు పడుతుండటం చూస్తూనే ఉన్నాం. డిజిటల్ యుగంలో యూట్యూబ్, స్పాటిఫై వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ నుంచి కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ, ఆ పాటను సృష్టించిన సంగీతకారులకు లేదా పాడిన గాయకులకు అందులో సరైన వాటా దక్కడం లేదనేది బహిరంగ రహస్యం.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More