వయసు పెరిగితే ఆస్తమా తగ్గుతుందా? ఏళ్ల తర్వాత ఎందుకు తిరగబెడుతుంది?
చిన్నతనంలో కనిపించే ఆస్తమా వయసు పెరిగేకొద్దీ తగ్గినా, అది పూర్తిగా నయం కాదని హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలోజిస్ట్ డాక్టర్ కే. యుగవీర్ గౌడ్ తెలిపారు. ఏళ్ల విరామం తర్వాత కూడా ఆస్తమా ఎందుకు వస్తుంది, దానిని సుదీర్ఘకాలం ఎలా అదుపులో ఉంచుకోవచ్చో ఆయన మాటల్లో చదవండి.
ఆస్తమా (ఉబ్బసం) అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక సమస్య. శ్వాసనాళాల్లో వాపు రావడం, అవి ఇరుకుగా మారడం వల్ల దగ్గు, ఈల కూత (Wheezing), ఛాతీలో బిగుతు, ఆయాసం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా బాల్యంలోనే ప్రారంభమయ్యే ఈ సమస్య, వయసు పెరిగే కొద్దీ క్రమంగా తగ్గుముఖం పడుతుందని చాలామంది భావిస్తుంటారు. కొన్నేళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో ఆస్తమా నయమైపోయిందని అనుకుంటారు. అయితే, సుదీర్ఘ విరామం తర్వాత కూడా ఈ సమస్య మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంది.

చిన్ననాటి ఆస్తమా కౌమారదశలో తగ్గుతుందా?
చిన్నపిల్లల్లో కనిపించే ఆస్తమా, ముఖ్యంగా స్వల్ప లక్షణాలు ఉన్నవారిలో టీనేజ్‌కి వచ్చేసరికి తగ్గినట్లు అనిపిస్తుంది. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వారి శ్వాసనాళాల పరిమాణం వెడల్పు కావడం, కొన్ని రకాల ప్రేరేపకాలు (Triggers) సమస్యగా మారకపోవడం ఇందుకు కారణం.
అయితే లక్షణాలు బయటపడనంత మాత్రాన ఆస్తమా శాశ్వతంగా నయమైందని భావించకూడదు. శ్వాస తీసుకోవడం సాధారణంగా అనిపించినప్పటికీ, శ్వాసనాళాల అంతర్గత సున్నితత్వం (Sensitivity) అలాగే ఉండిపోయే అవకాశం ఉంది. తీవ్రమైన ఆస్తమా లేదా ఇతర అలర్జీ సమస్యలు ఉన్న పిల్లల్లో ఈ లక్షణాలు సుదీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశం ఎక్కువ.
ఏళ్ల తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతుంది?
నెలలు లేదా సంవత్సరాల తరబడి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఆస్తమా లక్షణాలు మళ్లీ బయటపడవచ్చు. శ్వాసనాళాల్లో సున్నితత్వం అలాగే ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. సాధారణంగా ఈ క్రింది అంశాలు ఆస్తమాను మళ్లీ ప్రేరేపిస్తాయి.
శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు: జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు వాయునాళాల్లో వాపును పెంచి ఈల కూతకు కారణమవుతాయి.
అలర్జీ కారకాలు: ధూళి కణాలు (Dust mites), పరాగరేణువులు (Pollen), ఫంగస్/బూజు (Mould), పెంపుడు జంతువుల చర్మపు పొట్టు (Pet dander) శ్వాస సమస్యలను ప్రేరేపిస్తాయి.
వాయు కాలుష్యం, పొగ: పొగాకు పొగతో పాటు గాలిలోని కాలుష్య కారకాలు శ్వాసకోశ సున్నితత్వాన్ని మరింత పెంచుతాయి.
చల్లని గాలి, వ్యాయామం: చలిగాలిలో తిరగడం లేదా ఎక్కువ శారీరక శ్రమ చేయడం వల్ల కొందరిలో దగ్గు, ఆయాసం రావచ్చు.
పని ప్రదేశాల వాతావరణం: ఉద్యోగ వ్యాపారాల ప్రదేశాల్లో ఉండే ధూళి, రసాయనాలు, పొగ వంటివి కూడా ఆస్తమాను తిరగబెట్టేలా చేస్తాయి.
దీర్ఘకాలంలో ఆస్తమాను ఎలా మేనేజ్ చేయాలి?
ఆస్తమాకు శాశ్వత నివారణ లేనప్పటికీ, సరైన చికిత్స ద్వారా లక్షణాలను అదుపులో ఉంచుకుని ఉత్సాహవంతమైన జీవితాన్ని గడపవచ్చు. లక్షణాలు తగ్గాయి కదా అని ప్రివెంటివ్ ఇన్‌హేలర్లను సొంతంగా వాడటం ఆపకూడదు. మందుల వాడకాన్ని తగ్గించాలన్నా ముందుగా డాక్టర్‌తో చర్చించాలి.
తెలిసిన ప్రేరేపక కారకాలకు దూరంగా ఉండటం, శ్వాసకోశ లక్షణాలను ఎప్పటికప్పుడు గమనించుకోవడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆస్తమా తిరగబెట్టకుండా జాగ్రత్తపడవచ్చు.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?
చిన్నతనంలో ఆస్తమా ఉండి, ఏళ్ల తరబడి సమస్య లేకపోయినా.. హఠాత్తుగా దగ్గు, ఈల కూత, ఛాతీ బిగుతు లేదా ఆయాసం పునరావృతమైతే వెంటనే పల్మనాలోజిస్ట్‌ను సంప్రదించాలి. ముఖ్యంగా తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు ఎదురైనా, వాడే మందులతో ఉపశమనం లభించకపోయినా ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం పొందడం శ్రేయస్కరం.
ఆస్తమా లక్షణాలు తాత్కాలికంగా తగ్గినట్లు కనిపించినా, భవిష్యత్తులో మళ్లీ బయటపడే అవకాశం ఉన్నందున దీర్ఘకాలిక అవగాహన, సరైన నియంత్రణ పద్ధతులు పాటించడం ఎంతో ముఖ్యం.
వ్యాసకర్త:
డాక్టర్ కే. యుగవీర్ గౌడ్,
కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలోజిస్ట్,
యశోద హాస్పిటల్స్, హైదరాబాద్

ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


