దీపావళి పటాకుల ధమాకా.. కళ్లకు ముప్పు కాకూడదంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

దీపావళి వేడుకల్లో పటాకులు కాల్చేటప్పుడు చిన్నపాటి నిర్లక్ష్యం చూపునకు తీవ్ర ముప్పు తెస్తుంది. కంటికి గాయాలైతే ఏం చేయాలి? ఎలాంటి తప్పులు చేయకూడదు? బెంగళూరు నేత్రధర్మ సూపర్‌స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సుప్రియ శ్రీగణేష్ వివరించిన మార్గదర్శకాలు ఇవే.

Published on: Nov 8, 2026, 20:56:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దివ్యకాంతుల దీపావళి అంటేనే ప్రమిదల వెలుగులు, చిన్నారుల కేరింతలు, పటాకుల సవ్వడులు. అయితే ఈ ఆనందోత్సాహాల మధ్య పటాకుల వల్ల జరిగే ప్రమాదాలు అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. పటాకులు కాల్చేటప్పుడు ఎగిసిపడే నిప్పురవ్వలు, అకస్మాత్తుగా పేలే బాంబులు తీవ్రమైన కంటి గాయాలకు కారణమవుతున్నాయి. పటాకులు కాల్చే వారికే కాకుండా, పక్కన నిలబడి చూసే వారికి కూడా ఈ ప్రమాదాల ముప్పు పొంచి ఉంది. పండుగ వేళ కంటి ఆరోగ్య పరిరక్షణపై బెంగళూరులోని నేత్రధర్మ సూపర్‌స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సుప్రియ శ్రీగణేష్ పలు కీలక విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వెల్లడించారు.

దీపావళి పటాకుల ధమాకా.. కళ్లకు ముప్పు కాకూడదంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి (Picture credit: Freepik)
దీపావళి పటాకుల ధమాకా.. కళ్లకు ముప్పు కాకూడదంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి (Picture credit: Freepik)

చిన్న గాయమే కదా అని నిర్లక్ష్యం చేయవద్దు

పటాకుల పొగ వల్ల వచ్చే కళ్ల మంటలు, అలర్జీల నుంచి మొదలుకొని తీవ్రమైన కాలిన గాయాలు, ఇన్ఫెక్షన్లు, చివరకు శాశ్వత అంధత్వానికి దారితీసే ప్రమాదాలు దీపావళి సమయంలో ఎక్కువగా నమోదు అవుతుంటాయి.

"ప్రతి ఏటా దీపావళి సీజన్లో ప్రతిరోజూ దాదాపు 25 నుంచి 30 వరకు పటాకుల వల్ల కంటి గాయాలైన కేసులు మా ఆసుపత్రికి వస్తుంటాయి. సరిగ్గా పేలని పటాకులను మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయడం, తయారీలో లోపాల వల్ల అకస్మాత్తుగా పేలిపోవడం మూలంగా కళ్లు కాలడం, కంటి లోపలికి విదేశీ పదార్థాలు గుచ్చుకోవడం వంటి తీవ్ర గాయాలవుతున్నాయి. తక్షణమే వైద్య సహాయం అందకపోతే చూపు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది. బయటకు చూడటానికి గాయం చిన్నదిగా కనిపించినా, లోపల తీవ్రమైన నష్టం జరిగి ఉండవచ్చు. అందుకే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి" అని డాక్టర్ సుప్రియ స్పష్టం చేశారు.

గాయమైనప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!

పటాకులు కాల్చేటప్పుడు కంట్లో నిప్పురవ్వ పడినా లేదంటే మరేదైనా గాయమైనా చాలామంది వెంటనే కళ్లను నలపడం చేస్తుంటారు. ఇది పరిస్థితిని మరింత దిగజారుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంటికి గాయమైనప్పుడు తీసుకోవాల్సిన తక్షణ జాగ్రత్తలు ఇవే:

కంటిని రుద్దకూడదు: గాయమైన కంటిపై ఒత్తిడి తెస్తూ రుద్దడం లేదా నలపడం అస్సలు చేయవద్దు.

వస్తువులను తీసే ప్రయత్నం వద్దు: కంట్లో ఏదైనా రవ్వ లేదా సన్నని పెంకు లాంటిది గుచ్చుకుంటే, దాన్ని సొంతంగా బయటకు తీసేందుకు ప్రయత్నించకూడదు.

సొంత వైద్యాన్ని విడిచిపెట్టండి: డాక్టర్ పరీక్షించకుండా కంట్లో ఎలాంటి ఐ డ్రాప్స్, మందులు లేదా ఆయింట్‌మెంట్లు వేయవద్దు.

వైద్య సహాయంలో ఆలస్యం వద్దు: గాయం చిన్నదే కదా అని తగ్గేవరకు వేచి చూడకుండా, వీలైనంత త్వరగా కంటి ఆసుపత్రికి వెళ్లాలి.

సురక్షితమైన పండుగ కోసం ఈ జాగ్రత్తలు పాటిద్దాం

దీపావళిని సురక్షితంగా జరుపుకోవడానికి డాక్టర్ సుప్రియ కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. కార్బైడ్ గన్స్, ఇంట్లో సొంతంగా తయారుచేసే ప్రమాదకరమైన బాంబులకు దూరంగా ఉండాలని కోరారు. వెలిగించినప్పుడు పేలని పటాకుల దగ్గరకు వెళ్లడం గానీ, వాటిని మళ్లీ వెలిగించే ప్రయత్నం గానీ చేయకూడదని హెచ్చరించారు.

అలాగే, పటాకులు కాల్చేవారు మాత్రమే కాకుండా పక్కన నిలబడి చూసేవారు కూడా రక్షణ కళ్లద్దాలు (Protective Eyewear) ధరించడం మంచిదని ఆమె సూచించారు. మనం సాధారణంగా వాడే పవర్ అద్దాలు లేదా సన్ గ్లాసెస్ ప్రమాద సమయాల్లో కళ్లకు పూర్తి రక్షణ ఇవ్వలేవు. కాబట్టి పటాకులు కాల్చేటప్పుడు విరిగిపోని ‘పాలీకార్బోనేట్’ గ్లాసెస్ లేదా ప్రొటెక్టివ్ గాగుల్స్ ధరించడం అత్యంత సురక్షితమని పేర్కొన్నారు.

(గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే. ఇది అర్హులైన వైద్యుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యపరమైన సందేహాలు లేదా కంటి గాయాలు ఏర్పడినప్పుడు తప్పనిసరిగా కంటి వైద్య నిపుణులను సంప్రదించాలి.)

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More