ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఫీవర్ పీక్స్‌కు చేరింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుండటంతో భారతీయ ఫుట్‌బాల్ అభిమానులు సైతం అర్ధరాత్రి దాటినప్పటికీ నిద్రను త్యాగం చేసి మరీ తమ అభిమాన జట్లను ఉత్సాహపరుస్తున్నారు. ఈ లీగ్ ఒకవైపు వినోదాన్ని, సంతోషాన్ని ఇస్తున్నప్పటికీ, దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ టోర్నీలో నిరంతరం నిద్రను దూరం చేసుకోవడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఒకటి రెండు మ్యాచ్‌ల కోసం రాత్రి పూట మేల్కొనడం పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ వారాల తరబడి నిరంతరం నిద్రలేమితో గడపడం వల్ల శరీరానికి తీవ్ర నష్టం జరుగుతుందని విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగం కన్సల్టెంట్ డాక్టర్ లోకేష్ గుట్ట తెలిపారు. నిద్రలేమి వల్ల వచ్చే ఆరోగ్య నష్టాలు, వాటి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనే విషయాలను ఆయన వివరించారు.
"మన మెదడు, శరీరం రోజంతా సమర్థవంతంగా పనిచేయడానికి నిద్ర చాలా అవసరం. నిద్రపోయే సమయంలోనే శరీరం తన కణాలను రిపేర్ చేసుకుని, మరుసటి రోజుకు అవసరమైన శక్తిని పునరుద్ధరించుకుంటుంది. సాధారణంగా ప్రతి వయోజనుడికి రాత్రి పూట 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర అవసరం. కేవలం కొన్ని రోజులు సరిగ్గా నిద్రపోకపోయినా మనిషిలో బద్ధకం, అలసట పెరిగిపోతాయి. దేనిపైనా ఏకాగ్రత పెట్టలేరు. ఇది మూడ్‌ను కూడా దెబ్బతీసి, చిరాకును పెంచుతుంది. ఫలితంగా ఆఫీసులో లేదా ఇంట్లో రోజువారీ పనులు చేసుకోవడం కష్టంగా మారుతుంది," అని డాక్టర్ లోకేష్ గుట్ట వివరించారు.
రాత్రిళ్లు నిద్రపోకపోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు..
నిద్ర లేకపోవడం అనేది కేవలం మానసిక అలసటతోనే ఆగిపోదు. దీనివల్ల శరీరంలో కింది తీవ్రమైన మార్పులు సంభవిస్తాయని డాక్టర్ గుట్ట హెచ్చరించారు:
{{/usCountry}}నిద్ర లేకపోవడం అనేది కేవలం మానసిక అలసటతోనే ఆగిపోదు. దీనివల్ల శరీరంలో కింది తీవ్రమైన మార్పులు సంభవిస్తాయని డాక్టర్ గుట్ట హెచ్చరించారు:
{{/usCountry}}శరీరంలో స్ట్రెస్ హార్మోన్ల (ఒత్తిడి) స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి.
రక్తపోటు అకస్మాత్తుగా పెరుగుతుంది.
శరీర రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీనివల్ల త్వరగా జబ్బుల బారిన పడతారు.
దీర్ఘకాలంలో ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
"అర్ధరాత్రి దాటిన తర్వాత ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూసే అలవాటుతో పాటు మరికొన్ని అనారోగ్యకరమైన అలవాట్లు కూడా తోడవుతాయి. నిద్ర రాకుండా ఉండటం కోసం చాలా మంది కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీలు లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటారు. అలాగే మ్యాచ్ చూస్తూ హై-క్యాలరీ జంక్ ఫుడ్స్ స్నాక్స్‌గా తింటారు. రాత్రి వేళల్లో ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అస్సలు నిద్రపట్టదు. ఇది శరీర సహజ స్లీప్ సైకిల్ పూర్తిగా దెబ్బతీస్తుంది," అని ఆయన పేర్కొన్నారు.
ఆరోగ్యం పాడవకుండా మ్యాచ్‌లను ఆస్వాదించడం ఎలా?
అయితే, ఇష్టమైన ఆటను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, కొన్ని చిన్న చిన్న లైఫ్‌స్టైల్ మార్పుల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే మ్యాచ్‌లను ఎంజాయ్ చేయవచ్చని డాక్టర్ లోకేష్ గుట్ట సలహా ఇస్తున్నారు.
కెఫిన్ తగ్గించండి: సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో కాఫీ, టీలు, కూల్ డ్రింక్స్ తీసుకోవడం బాగా తగ్గించాలి.
హైడ్రేటెడ్‌గా ఉండండి: రాత్రి పూట జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ, తగినంత నీరు లేదా హెల్తీ లిక్విడ్స్ తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.
చిన్న కునుకు : పగటి సమయంలో వీలు దొరికినప్పుడు 15-20 నిమిషాల పాటు చిన్న కునుకు తీయడం వల్ల శరీరం రీఛార్జ్ అవుతుంది.
మ్యాచ్‌లు లేని రోజుల్లో ఎక్కువ నిద్ర: షెడ్యూల్‌లో మ్యాచ్‌లు లేని రోజుల్లో రాత్రి పూట త్వరగా పడుకుని, కోల్పోయిన నిద్రను భర్తీ చేసుకోవాలి.
"ఫిఫా వరల్డ్ కప్ తెచ్చే ఉత్సాహం, ఫుట్‌బాల్‌పై ఉన్న క్రేజ్ మిలియన్ల మంది అభిమానులను ఏకం చేస్తుంది. అయితే, ఈ టోర్నమెంట్ కేవలం నెల రోజులు మాత్రమే ఉంటుంది, కానీ దీనివల్ల వచ్చే దీర్ఘకాలిక నిద్రలేమి సమస్యలు మాత్రం చాలా కాలం పాటు మిమ్మల్ని వేధిస్తాయి. కాబట్టి ప్రతి క్షణాన్ని ఆనందించండి, కానీ మీ ఆటపై ఉన్న ఇష్టం ఆరోగ్యానికి నష్టం కలిగించకుండా చూసుకోండి," అని డాక్టర్ గుట్ట సూచించారు.